YS Vijayamma : ఇడుపులపాయలో జగన్‌తో వైఎస్ విజయలక్ష్మి - కుమారుడికే మద్దతని పరోక్ష సంకేతాలా ?
Andhra News : సీఎం జగన్ ప్రచార బస్సు యాత్రకు వైఎస్‌కు నివాళులు అర్పించే కార్యక్రమంలో వైఎస్ విజయలక్ష్మి పాల్గొన్నారు. కుమార్తె కన్నా కుమారుడి వైపే ఆమె మొగ్గుతున్నట్లుగా భావిస్తున్నారు.
YS Vijayalakshmi participated in CM Jagan bus Yatra Starting Program : వైఎస్ విజయలక్ష్మి రాజకీయంగా తన కుమారుడి వైపే ఉన్నారని పరోక్షంగా సంకేతాలు ఇస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరిన తర్వాత ఒక్క సారి కూడా షర్మిలతో కనిపించని విజయమ్మ.. సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం ప్రారంభం సందర్భంగా ఇడుపుల పాయలో వైఎస్ సమాధికి నివాళి అర్పించేందుకు జగన్ కలిసి వచ్చారు. ప్రార్థనలు చేశారు. ఈ పరిణామంతో విజయమ్మ కుమారుడు జగన్ వైపే ఉన్నట్లుగా రాజకీయంగా సంకేతాలు వెళ్లినట్లే అనుకోవచ్చు.
రాజకీయంగా కుమారుడికే మద్దతివ్వాలని విజయలక్ష్మి నిర్ణయం
రాజకీయంగా విజయలక్ష్మి తీవ్ర ఒత్తిడిలో ఉన్నారని ఇటీవల పరిణామాలు నిరూపిస్తున్నాయి. కుమార్తె తెలంగాణలో పార్టీ పెట్టుకున్న తర్వాత పూర్తిగా షర్మిలకే అండగా నిలిచారు. తెలంగాణలో షర్మిలకు అండగా ఉండటానికే అంటూ వైఎస్ఆర్‌సీపీ గౌరవ అధ్యక్షురాలిగా రాజీనామా చేశారు. తెలంగాణకు వెళ్లారు. అక్కడ షర్మిల చేసిన పోరాటాల్లో తాను కూడా పాల్గొన్నారు. షర్మిలను అరెస్టు చేసినప్పుడు పోలీసులపై తీవ్ర విమర్శలు చేశారు కూడా.
షర్మిల ఏపీ రాజకీయాల్లోకి రావడం విజయమ్మకు ఇష్టం లేదా ?
గతంలో వైఎస్ఆర్‌సీపీ గౌరవ అధ్యక్షురాలి పదవికి రాజీనామా చేసినప్పుడు కుమారుడు ఏపీలో , కుమార్తె తెలంగాణలో రాజకీయాలు చేస్తారని.. ఇది దైవ సంకల్పమన్నారు. అయితే షర్మిల తన రాజకీయ పయనాన్ని అనూహ్యంగా మార్చుకున్నారు. ఆమె తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడమే కాకుండా .. ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకున్నారు. ఈ విషయంలో షర్మిలకు తల్లి సపోర్ట్ ఉందా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. కానీ విజయమ్మ మాత్రం.. షర్మిలతోనే ఉంటున్నారు. షర్మిల కుమార్తె పెళ్లికి .. రిసెప్షన్‌కు సీఎం జగన్ తో పాటు కుటుంబ సభ్యులు ఎవరూ హాజరు కాలేదు. కానీ విజయమ్మ మాత్రం వెళ్లారు.
ఎన్నికల ప్రచారంలోనూ పాల్గొంటారా ?
విజయమ్మ ఏపీలో షర్మిల కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల్లో ఎక్కడా కనిపించలేదు. పార్టీలో చేరే సమయంలో.. తర్వాత వివిధ సందర్భాల్లో ఇడుపుల పాయకు నివాళులు అర్పించేందుకు వెళ్లిన సమయంలోనూ కనిపించలేదు. అంటే.. రాజకీయంగా షర్మిల అడుగులకు .. విజయమ్మ మద్దతు ఇవ్వలేదని అనుకోవచ్చు. తాజాగా జగన్ వెంట.. రాజకీయ కార్యక్రమం ప్రారంభోత్సవానికి వెళ్లడంతో.. రాజకీయంగా తన మద్దతు జగన్ కే.. కుమారుడికే అని చెప్పినట్లయిందన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. వైఎస్ విజయలక్ష్మి ఎన్నికల ప్రచారంలోనూ పాల్గొనే అవకాశం ఉందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అదే జరిగితే షర్మిలకు మొదటి సారి ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతుంది.