YS Sharmila: ప్రధాని మోదీ వారసుడు జగన్, బీజేపీకి దత్తపుత్రుడు అంటూ షర్మిల సంచలన వ్యాఖ్యలు
Andhra Pradesh News | తన సోదరుడు, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన ఆరోపణలు చేశారు. తండ్రి వైఎస్సార్ పథకాలను జగన్ నీరుగార్చారని విమర్శించారు.
YS Sharmila About Fee Reimbursement in AP | వైఎస్ రాజశేఖరరెడ్డి (YSR) మానస పుత్రిక ఫీజు రీయింబర్స్మెంట్ పథకం. మహానేత హయాంలో, కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన ఒక ప్రతిష్ఠాత్మక పథకం. పేద బిడ్డల జీవితాల్లో వెలుగులు నింపి, ఎంతో మంది ఇంజనీర్లను, డాక్టర్లను తయారు చేసిన గొప్ప పథకం అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల తన సోదరుడు, ఏపీ మాజీ సీఎం జగన్ పై మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
నాన్న వైఎస్సార్ అమలు చేస్తే, జగనన్నే నీరుగార్చారు
‘నాడు ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని YSR అద్భుతంగా అమలు చేస్తే.. సొంత కొడుకై ఉండి జగన్ మోహన్ రెడ్డి తన హయాంలో పథకాన్ని నీరు గార్చారు. విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజులు రూ.3500 కోట్లు పెండింగ్ పెట్టడం నిజంగా సిగ్గుచేటు. బకాయిలు చెల్లించకుండా వారి జీవితాలతో చెలగాటం ఆడారు. తల్లిదండ్రులను మనోవేదనకు గురి చేశారు. దోచుకొని దాచుకోవడం మీద ఉన్న శ్రద్ధ, విద్యార్థుల సంక్షేమం మీద పెట్టలేదు.
YSR తన జీవితం మొత్తం మత పిచ్చి బీజేపీనీ వ్యతిరేకిస్తే..అదే బీజేపీకి దత్తపుత్రుడు వైఎస్ జగన్. బీజేపీతో చెట్టా పట్టాలు వేసుకొని తిరిగిన మోడీ వారసుడు జగన్ . అలాంటి వాళ్లకు YSR ఆశయాలు గుర్తుకు ఉంటాయని అనుకోవడం,ఆశయాలకు వారసులు అవుతారనడం పొరపాటు.
నాడు YCP ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని నీరుగార్చి నిర్వీర్యం చేయాలని చూస్తే.. నేడు కూటమి ప్రభుత్వంనిర్లక్ష్యం చేస్తోంది. వైసీపీ చేసింది మహా పాపమైతే.. కూటమి సర్కారు విద్యార్థులకు పెడుతున్నది శాపం. ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో ఏపీ సీఎం చంద్రబాబును డిమాండ్ చేస్తున్నాం. బకాయిలు ఎవరు పెండింగ్ పెట్టినా.. అవి రిలీజ్ చేసే బాధ్యత ఇప్పుడు మీపై ఉంది. వెంటనే నిధులు విడుదల చేయాలని, పథకానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా చూడాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామని’ ఎక్స్ ఖాతాలో షర్మిల పోస్ట్ చేశారు.