YS Sharmila: సూపర్ సిక్స్ పథకాలు ఎప్పుడు అమలు చేస్తారు? కూటమి ప్రభుత్వానికి షర్మిల ప్రశ్నలు
Pcc President Sharmila : కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హామీలు అమలు చేయాలంటూ డిమాండ్ చేశారు. వైసిపి అధినేత వైఎస్ జగన్ పైన ఆమె విరుచుకుపడ్డారు.
YS Sharmila fires on Andhra Pradesh Government: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అదే సమయంలో తన సోదరుడు, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌తో కాంగ్రెస్ చర్చలు జరిపిందంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆమె ఖండించారు. కాంగ్రెస్ పార్టీకి ఆ అవసరం లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ మహా సముద్రమన్న షర్మిల.. పిల్ల కాలువలు ఎప్పటికైనా సముద్రంలో కలవాల్సిందేనని పేర్కొన్నారు.
విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు నెలలు దాటుతున్నా సంక్షేమ పథకాల్లో కొన్ని కూడా అమలు చేయడం లేదని విమర్శించారు. సూపర్ సిక్స్ అంటూ ఊదరగొట్టిన చంద్రబాబు.. వాటిలో కొన్ని హామీలైనా అమలు చేయాలని డిమాండ్ చేశారు. హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేయడం లేదన్న షర్మిల.. కొన్ని పథకాలు అమలుపై అయినా క్లారిటీ ఇవ్వాలని కోరారు.
అమ్మ ఒడి పథకాన్ని తల్లికి వందనం అని పేరు మార్చారని, ప్రతి తల్లికి ఎంత మంది బిడ్డలుంటే అంత మందికి రూ.15 వేలు చొప్పున ఇస్తామని హామీ ఇచ్చారన్నారు. జూన్, జూలై నెలలో తల్లులకు నిధులు ఇవ్వాలి ఉందని, కానీ, అసలు ఈ పథకం ఇప్పుడు అమలు అవుతుందా..? లేదా..? అన్న అనుమానం అందరిలోనూ ఉందన్నారు. లెక్కలు లేవంటూ సాకులు చెప్పడం తగదన్నారు. మంత్రి లోకేష్ ఈ ఏడాది అమలు చేయడం కష్టమంటున్నారని, తల్లికి వందనంపై కూటమి ప్రభుత్వం దీనిపై క్లారిటీ ఇవ్వాలన్నారు. మహిళలకు ఉచిత బస్సు పథకం ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలన్న షర్మిల.. ఉచిత ప్రయాణం కల్పించడంపై ప్రభుత్వానికి ఉన్న అభ్యంతరాలు ఏమిటో చెప్పాలన్నారు. జీరో టికెట్ కొట్టడానికి చేతులు రావడం లేదా..? అని ప్రశ్నించారు. ఖరీఫ్ సీజన్ దాటిపోతోందని, రైతు భరోసా ఎప్పుడు ఇస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పంట నష్టం జరిగితే ఇప్పటి వరకు పరిహారాన్ని అందించలేదన్నారు. కొద్దిరోజులుగా చంద్రబాబు ప్రతి మాటకు డబ్బులు లేవని చెబుతున్నారని, గత ప్రభుత్వం అప్పులు చేసిందని చెబతున్నారన్నారు. బాబుకు అప్పులు గురించి తెలియకుండానే హామీలు ఇచ్చారా..? అని షర్మిల ప్రశ్నించారు.
ఆరోగ్య శ్రీ పథకంపై స్పష్టత ఇవ్వాలి
ఆరోగ్య శ్రీ పథకాన్ని ఇక నడపలేనమి ఆస్పత్రులు చెబుతున్నాయని, సూదికి, దూదికి డబ్బులు లేవంటూ ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితికి ఆస్పత్రుల యాజమాన్యాలు వెళ్లిపోయాయన్నారు. ఈ పథకాన్ని అమలు చేయడంపై ప్రభుత్వం స్పష్టతను ఇవ్వాలన్నారు. ఆస్పత్రులకు మూడు వేల కోట్ల రూపాయలు బిల్లులు పెండింగడ్‌లో ఉన్నాయన్న షర్మిల.. చెల్లించకపోవడంతో ఆస్పత్రులు అల్టిమేటం కూడా ఇచ్చాయన్నారు. ఆరోగ్య శ్రీ పథకం వైఎస్‌ఆర్ ప్రవేశపెట్టిన పథకమని, ఈ వైద్య విధానం దేశానికే ఆదర్శమన్నారు. ఎన్నో రాష్ట్రాలు ఆరోగ్య శ్రీ పథకాన్ని కాపీ కొట్టాయన్నారు. ఆస్పత్రులకు మూడు వేల కోట్ల వరకు చెల్లింపులు జరపాల్సి ఉందన్నారు. గతేడాది సెప్టెంబరు నుంచి ఆరోగ్య శ్రీ పథకానికి బిల్లులు చెల్లించలేదన్న షర్మిల.. జగన్ హయాంలో రూ.1600 కోట్లు బిల్లులు పెండింగ్‌లో పెట్టేశారని విమర్శించారు. 11 నెలలు నుంచి ఆస్పత్రులకు రూపాయి కూడా చెల్లించలేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
ఆరోగ్య శ్రీ పథకాన్ని నిలిపివేయడంపై కూటమి ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తనకు తెలుసన్న చంద్రబాబు.. బాబు భవిష్యత్ గ్యారెంటీ అంటూ హామీలు ఎలా ఇచ్చారన్నారు. ఆరోగ్య శ్రీ పథకాన్ని జగన్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్న షర్మిల.. కూటమి ప్రభుత్వం ఈ పథకాన్ని రక్షించాలని కోరారు. ఆస్పత్రులను చర్చలకు పిలిచి కొంతైనా బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆరోగ్య శ్రీతోపాటు ఫీజురీయింబర్స్‌మెంట్ పథకానికి నిధులు కొరత ఉందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాలేకపోతే 25 మంది ఎంపీలు బీజేపీకి ఎందుకు ఊడిగం చేస్తున్నట్టు అని ప్రశ్నించారు. కూటమి మద్ధతుతోనే మోదీ గద్దెను ఎక్కిన విషయాన్ని గుర్తించాలని ఆమె స్పష్టం చేశారు.
పిల్ల కాలువలు మహా సముద్రలో కలవాల్సిందే
జగన్‌తో కాంగ్రెస్ పార్టీ చర్చలు జరిపిందంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని పీసీసీ ప్రెసిండెంట్ షర్మిలా కొట్టిపారేశారు. కాంగ్రెస్ పార్టీ ఒక మహా సముద్రమని, పిల్ల కాలువలు ఎప్పటికైనా సముద్రంలో కలవాల్సిందేనని స్పష్టం చేశారు. జగన్ వస్తే బాగుండు అని ప్రచారం చేస్తున్నారని, మళ్లీ ఎందుకు రావాలో చెప్పాలన్నారు. మళ్లీ పది లక్షల కోట్లు అప్పులు చేయడానికి రావాలా..? అని నిలదీశారు. పోలవరంతో సహా రాష్ట్రాన్ని తాకట్టు పెట్టడానికి మళ్లీ రావాలా..? అని ప్రశ్నించారు. మద్యపాన నిషేదం అని చెప్పి ప్రజల ప్రాణాలు తీయడానికి మళ్లీ రావాలా..? అని నిలదీశారు.
ప్రాజెక్టు గేట్టు కొట్టుకుపోతుంటే రిపేర్లు చేయకుండా ఉన్నందుకు జగన్ రావాలా..? అని షర్మిల ప్రశ్నించారు. ధర స్థిరీకరణ నిధి అని చెప్పి మళ్లీ మోసం చేయడానికి జగన్ రావాలా..? అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జగన్ మళ్లీ అధికారంలోకి రాడని, వైసీపీకీ ఎప్పటికీ అధికారంలోకి రాలేదన్నారు. విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ఎందుకు పోటీ పెట్టలేదన్న షర్మిల.. భారీ మెజార్టీతో గెలిచి ఎందుకు దైర్యం చేయలేదని ప్రశ్నించారు. బొత్స అనేవాడు నిండు సభలో విజయమ్మను అవమానించాడన్న షర్మిల.. అటువంటి వాళ్లకు జగన్ ఎమ్మెల్సీ స్థానాన్ని కట్టబెట్టాడన్నారు. 11 సీట్లకు వైసీపీ.. ఇప్పుడు ఒక్క సీటుతో పండగ చేసుకోవాలని హితవు పలికారు.