Joinings in TDP : టీడీపీలోకి భారీగా చేరికలు - విజయసాయిరెడ్డి బావమరిదితో పాటు దాడి వీరభద్రరావు, ఎమ్మెల్సీ రామచంద్రయ్య కూడా !
TDP : తెలుగుదేశం పార్టీలో పెద్ద ఎత్తున సీనియర్ నేతలు చేరుతున్నారు. ఎమ్మెల్సీ రామచంద్రయ్య, దాడి వీరభద్రరావు, విజయసాయిరెడ్డి బావమరిది టీడీపీలో చేరారు.
Joinings in TDP : మంగళగిరిలోని టీడీపీ ఆఫీసు వద్ద సందడి వాతావరణం నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి నేతలు టీడీపీలో చేరేందుకు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. బుధవారం వైసీపీ కీలక నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సొంత బావమరిది టీడీపీలో చేరారు. ఉమ్మడి వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకానాథరెడ్డి ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో సైకిలెక్కారు.
టీడీపీలో చేరిన విజయసాయిరెడ్డి బావమరిది !
చంద్రబాబు పసుపు కండువా కప్పి ద్వారకానాథరెడ్డిని సాదరంగా టీడీపీలోకి ఆహ్వానించారు. ద్వారకానాథరెడ్డి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి స్వయనా బావమరిది. ఇక ద్వారకానాథరెడ్డితో పాటు అన్న సురేంద్రనాథరెడ్డి, అక్క హరెమ్మ (తారకరత్న అత్త) టీడీపీ కండువా కప్పుకున్నారు. విజయసాయిరెడ్డి, ఆయన భార్య మినహా కుటుంబసభ్యులందరూ ఒకే సారి టీడీపీలో చేరారు. విజయసాయిరెడ్డి, ఆయన భార్య మినహా కుటుంబసభ్యులందరం టీడీపీలో చేరామన్నారు. విజయసాయిరెడ్డి దంపతులు కూడా వైసీపీ వీడే పరిస్థితి రావొచ్చేమో అని వ్యాఖ్యానించారు. విజయసాయిని టీడీపీలోకి ఆహ్వానించే హక్కు తనకుందని, తనకు వైసీపీ టికెట్ ఇస్తానని పలుమార్లు మాట తప్పారని ద్వారకానాథరెడ్డి బయటపెట్టారు. తనకు కనీసం నామినేటెడ్ పదవి ఇస్తానని వైసీపీలో మోసగించారని ద్వారకానాథరెడ్డి తెలిపారు. రాయచోటి ఎమ్మెల్యే, వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని, జగన్ పాలన మొత్తం అవినీతిమయమైందని ఆరోపించారు.వైఎస్సార్ పాలనకు, జగన్ పాలనకు పొంతనే లేదని, ఎన్నికల కోసం వాడుకుని వదిలేయడం జగన్ నైజమని విమర్శించారు. సీఎంవోలో విజయసాయి, మరో నలుగురు కలెక్షన్ ఏజెంట్లు ఉన్నారని, విజయసాయి, సజ్జల, మిధున్ రెడ్డి వంటి కలెక్షన్ ఏజెంట్లకే జగన్ సీఎంవోకి అనుమతి ఇస్తున్నారని ద్వారకానాథరెడ్డి ఆరోపించారు. వైసీపీకి మెజార్టీ వచ్చే రాయచోటిలోనే గెలిచే పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు.
టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య
ఇక వైసీపీ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్యకూడా చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయన పార్టీలో చేరుతారని ఎవరూ అనుకోలేదు. కడప జిల్లాలో బలమైన బలిజ నేతగా ఉన్న ఆయన వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరేందుకు వచ్చారు టీడీపీలో చేరిన అనంతరం సిట్టింగ్ ఎమ్మెల్సీ రామచంద్రయ్య మాట్లాడుతూ.. మళ్లీ కోలుకోలేని విధంగా ఏపీని జగన్ అప్పులపాలు చేశారని ఆరోపించారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై జగన్‌కు చెప్పినా వినే పరిస్థితి లేదన్నారు. తనలాగే వైసీపీలో ఎంతోమంది ఉన్నారని, సమయానుకూలంగా బయటకు వస్తారని అన్నారు. రాష్ట్రం మరింత దిగజారుతుందనే ఉద్దేశంతో టీడీపీలో చేరుతున్నానని, కఠిన సమయంలో పొరపాటు చేస్తే రాష్ట్రం ఇబ్బందుల్లోకి వెళ్తుందన్నారు. వ్యవస్థలను పునరుద్దరించి దారికి తేవాలంటే చంద్రబాబుకే సాధ్యమని, రాష్ట్రానికి చంద్రబాబు నాయకత్వం చాలా అవసరమన్నారు. రాష్ట్ర ప్రజలకు మరో మార్గం లేదని, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా చంద్రబాబును సీఎం చేసి తీరాలని పిలుపునిచ్చారు. చంద్రబాబును సీఎం చేసేందుకు అందరూ కష్టపడాలని, చంద్రబాబు నాయకత్వాన్ని అందరూ బలపరచాలని సూచించారు. టీడీపీని అధికారంలోకి తెచ్చేందుకు అందరూ కలిసి పనిచేయాలన్నారు.
కుటుంబంతో సహా టీడీపీలో చేరిన దాడి వీరభద్రరావు
వైసీపీకి మంగళవారమే రాజీనామా చేసిన దాడి వీరభద్రరావు కుటుంబంతో సహా టీడీపీ కంజువా కప్పుకున్నారు. అలాగే వివిధ నియోజకవర్గాలకు చెందిన వైసీపీ ముఖ్యనేతలు, కార్యకర్తలు టీడీపీలో చేరారు. అనంతపురం, చీరాల, బాపట్ల, పార్వతీపురంకు చెందిన వైసీపీ కార్యకర్తలు టీడీపీ గూటికి చేరారు. ఒకేసారి భారీ సంఖ్యలో వైసీపీకి చెందిన నేతలు టీడీపీలో చేరగా.. విజయసాయిరెడ్డి సొంత బంధువులే చేరడం విశేషంగా మారింది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వైసీపీ శ్రేణులకు ఈ పరిణామం మింగుడు పడటం లేదు. చేరికల సందర్భంగా టీడీపీ ఆఫీస్ కిక్కిరిసిపోయింది.