Kapu Ramachandra Reddy : బీజేపీలో చేరేందుకు కాపు రామచంద్రారెడ్డి ప్రయత్నం - విజయవాడలో రాజ్‌నాథ్‌ను కలిసే ప్రయత్నాలు విఫలం !
Kapu Ramachandra Reddy : బీజేపీలో చేరేందుకు వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ప్రయత్నించారు. విజయవాడ పర్యటనకు వచ్చిన రాజ్ నాథ్ సింగ్‌తో భేటీకి ప్రయత్నించి విఫలమయ్యారు.
YCP MLA Kapu Ramachandra Reddy tried to join BJP : వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి విజయవాడలో బీజేపీ అగ్రనేతల్లో ఒకరు అయిన రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో భేటీ అయ్యేందుకు ప్రయత్నించారు. ఆయన విజయవాడ పర్యటనకు రావడంతో.. కాపు రామచంద్రారెడ్డి విజయవాడలో ఆయన బస చేసిన హోటల్ వద్దకు వెళ్లారు. అయితే ఆయనను అనుమతించలేదని తెలుస్తోంది. ఏపీ బీజేపీ నేతలతో మాట్లాడి వచ్చారు. రాజనాథ్ సింగ్ ను కలిసేందుకే వచ్చాననని.. మా జిల్లాకు సంబంధం లేని మీటింగ్ ఇక్కడ జరుగుతుంది.. అందుకే మీటింగ్ లో నుంచి బయటికి వచ్చేశానని మీడియాతో చెప్పారు.
ప్రస్తుతానికి ఏ పార్టీలో చేరాలో పూర్తి గా ఏ నిర్ణయం తీసుకోలేదని.. స్పష్టం చేశారు. కానీ వైసిపి ని పూర్తిగా వదిలేశాను... ఆ పార్టీ తో నాకు సంబంధం లేదన్నారు. వచ్చే ఎన్నికలలో తాను పోటీ చేస్తున్నానని.. ఏ పార్టీ అనేది త్వరలో చెబుతానన్నారు. మంగళగిరిలో జరుగుతున్న వైసిపి మీటింగ్ నుంచి నాకు ఎటువంటి సమాచారం లేదని.. రాజ్ నాధ్ సింగ్ ను మర్యాద పూర్వకంగా కలిసేందుకు వచ్చానన్నారు. త్వరలోనే అన్నివిషయాలు వివరిస్తానని.. ఆ తరువాత రాష్ట్రం లో పరిస్థితులు పై మాట్లాడతానని చెప్పుకొచ్చారు.
కాపు రామచంద్రారెడ్డి గతంలో కాంగ్రెస్ లోచేరాలని అనుకున్నారు. మడకశిర వెళ్లి రఘువీరారెడ్డితో సమావేసం అయ్యారు. రానున్న ఎన్నికల్లో కాపు రామచంద్రారెడ్డి, తన భార్య కాపు భారతి రెడ్డి రాయదుర్గం, కళ్యాణదుర్గం నియోజకవర్గంలో పోటీలో ఉంటామని చెబుతున్నారు. కాంగ్రెస్ లో చేరాలని అనుకున్నా.. మళ్లీ బీజేపీ వైపు చూస్తున్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన కాపు రామచంద్ర రెడ్డికి వైఎస్ జగన్ కూడా పలుమార్లు టిక్కెట్ ఇచ్చారు. వైఎస్ఆర్సిపీ ఆవిర్భావం నుంచి జగన్మోహన్ రెడ్డి వెంట వచ్చిన నేతగా గుర్తింపు ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో కాపు రామచంద్ర రెడ్డి కి టికెట్ ఇవ్వటం కుదరదు అని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తెలపడంతో కాపు రామచంద్ర రెడ్డి తీవ్ర మనోవేదనకు గురయ్యారు.
తాడేపల్లి సీఎంవో కార్యాలయం నుంచి బయటకు వచ్చి సీఎం క్యాంప్ ఆఫీసుకు సెల్యూట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి నమ్మించి గొంతు కోశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏ పార్టీలో టిక్కెట్ ఇచ్చినా చేరేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారు. కానీఏ పార్టీ నుంచి ఆయనకు ఆహ్వానం అందడం లేదు. కాంగ్రెస్ పార్టీ కూడా ఆయనపై పెద్దగా ఆసక్తి చూపించ లేదు. బీజేపీ పొత్తులు పెట్టుకుంటే.. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఆ పార్టీ నుంచి టీడీపీ మద్దతుతో బీజేపీ తరపున పోటీ చేయవచ్చన్న ఆలోచనతో ఆయన బీజేపీలో చేరేందుకు ప్రయత్నించినట్లుగా తెలుస్తోంది. అయితే ఏపీ బీజేపీ నేతలు ఆయనను పట్టించుకోలేదు.