Ambati Rambabu: అంబటి రాంబాబు 25 వేల ఓట్ల తేడాతో ఓడిపోతారు, వైసీపీ నేతల నుంచే వ్యతిరేకత
Sattenapalli: సత్తెనపల్లి నియోజకవర్గంలో అంబటి రాంబాబుకు సొంత పార్టీ నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆయనకు టికెట్ ఇవ్వొద్దని అసమ్మతి నేతలు అధిష్టానానికి అల్టిమేటం ఇస్తున్నారు
Andhra Pradesh News: ఎన్నికల తరుణంలో అధికార వైసీపీ (YSRCP)లో అసంతృప్తి స్వరాలు బయటపడుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సొంత పార్టీ నేతల నుంచే సెగ తగులుతోంది. వ్యతిరేకత ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వొద్దంటూ సొంత పార్టీ నేతలు వైసీపీ అధిష్టానానికి అల్టిమేటం జారీ చేస్తున్నారు. టికెట్ ఇస్తే సహకరించేది లేదని, ఓడించి తీరుతామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. చాలా నియోజకవర్గాల్లో ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేలే కాదు.. మంత్రులు కూడా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు. ఇటీవల మంత్రి రోజాకు టికెట్ ఇస్తే ఓడిస్తామంటూ నగరి నియోజకవర్గానికి చెందిన వైసీపీ నేతలు జగన్‌కు హెచ్చరికలు జారీ చేశారు. తాజాగా మంత్రి అంబటి రాంబాబు విషయంలోనూ అదే జరిగింది.
అంబటికి ఇస్తే 25 వేల ఓట్ల తేడాతో ఓడిపోతారు
మంత్రి అంబటి రాంబాబుకు వచ్చే ఎన్నికల్లో టికెట్ కేటాయిస్తే 25 వేల ఓట్ల తేడాతో ఓడిపోతారంటూ సత్తెనపల్లి నియోజకవర్గానికి చెందిన అసమ్మతి నేతలు తేల్చేశారు. ఈ విషయాన్ని నర్సరావుపేట పార్లమెంట్ వైసీపీ సమన్వయకర్త అనిల్ కుమార్ యాదవ్ దృష్టికి తీసుకెళ్లారు. అంబటి రాంబాబుకు సత్తెనపల్లి టికెట్ రాకుండా చూడాలని కోరారు. తమ మాటను కాదని ఆయనకు టికెట్ ఇస్తే ఓటమి ఖాయమని తెలిపారు. తాజాగా నర్సరావుపేటలో అనిల్ కుమార్ యాదవ్‌ను సత్తెనపల్లికి చెందిన వైసీపీ నేతలు కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పార్టీ పరిస్థితి గురించి వివరించారు. అంబటి నియోజకవర్గంలో దందాలు చేయిస్తున్నారని, వైసీపీ శ్రేణులను కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. అంతేకాకుండా పార్టీలో గ్రూప్ విబేధాలకు ఆజ్యం పోసి పార్టీని భ్రష్టు పట్టించారని అనిల్ కుమార్ యాదవ్‌కు వివరించారు.
జగన్ మాట కోసం పనిచేశాం
గత ఎన్నికల్లో జగన్ చెప్పారని అంబటి రాంబాబు కోసం పనిచేశామని, కానీ ఈ సారి పనిచేయలేమని అసమ్మతి నేతలు తేల్చేశారు. అనిల్ కుమార్ యాదవ్‌తో భేటీ అయిన వారిలో సత్తెనపల్లి నియోజకవర్గానికి చెందిన డాక్టర్ గుజ్జల నాగభూషణరెడ్డి, చిట్టా విజయ భాస్కర్ రెడ్డి, మర్రి వెంకట్రామిరెడ్డితో పాటు బ్రహ్మారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. ఈ సందర్బంగా సత్తెనపల్లి నేతలు చెప్పిన విషయాలను జగన్ దృష్టికి తీసుకెళ్తామని అనిల్ కుయార్ యాదవ్ తెలిపారు. అంబటి రాంబాబుపై సొంత పార్టీ నేతలు ఫిర్యాదు చేయడం తొలిసారి కాదు. ఆయనకు టికెట్ ఇవ్వొద్దని ఇప్పటికే పలుమార్లు వైసీపీ అధిష్టానికి తెలిపారు. ఇప్పుడు ఎన్నికల తరుణంలో మరోసారి ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. అంబటి మరోసారి సత్తెనపల్లి నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. కానీ అసమ్మతి నేతలు మాత్రం సహకరించలేదు. దీంతో వారిని ఎలా బుజ్జగిస్తారనేది ఇప్పుడు కీలకంగా మారింది.
గతంలో కాంగ్రెస్ తరపున రేపల్లె నియోజకవర్గం నుంచి అంబటి రాంబాబు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక ఆ తర్వాత 2005 నుంచి 2009 వరకు ఏపీ ఇండస్ట్రీయల్ ఇన్‌ఫ్రాస్టక్చర్ కార్పొరేషన్‌కు ఛైర్మన్‌గా పనిచేశారు. వైసీపీ ఏర్పాటు చేసిన తర్వాత కాంగ్రెస్‌కు రాజీనామా చేసి జగన్ వెంట నడిచారు. 2014 ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి పోటీ చేసి 924 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఇక 2019 ఎన్నికల్లో 20 వేల ఓట్ల మెజార్టీతో వైసీపీ నుంచి గెలిచారు. ప్రస్తుతం జగన్ కేబినెట్‌లో ఇరిగేషన్ శాఖ మంత్రిగా అంబటి కొనసాగుతున్నారు.