AP Govt : ప్రతీ నెలా ఐదో తేదీలోగానే 95 శాతం జీతాలు, పింఛన్లు ఇచ్చేస్తున్నాం-ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి
AP Govt : ప్రతీనెలా ఐదో తేదీలోగా 90 నుంచి 95 శాతం ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పింఛన్లను వైసీపీ ప్రభుత్వం చెల్లిస్తోందని ఏపీ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వెల్లడించారు.
AP Govt : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని ఆశాస్త్రీయంగా విభజించడం, కరోనా పరిస్థితుల వల్ల రాష్ట్రం ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కుంటున్నా ప్రతీనెలా ఐదో తేదీలోగా పింఛన్లు, జీతాలు చెల్లిస్తోందని... ఏపీ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి తెలిపారు. 90 నుంచి 95 శాతం ఉద్యోగుల జీతాలతో పాటు, పింఛన్లను చెల్లిస్తున్నామన్నారు. మిగిలిన 5 శాతం మందికి ఖజానాలో బిల్లులు సమర్పించిన తేదీకి అనుగుణంగా చెల్లింపులు జరుగుతున్నాయని అన్నారు. ఉద్యోగుల జీతాల బిల్లులు ఖజానా అధికారులు నెలాఖరులోగా సమర్పించ గల్గితే ప్రతీ నెలా ఒఖటో తేదీన జీతాలు ఇవ్వగలమని వివరించారు. ఈ మేరకు శనివారం రాత్రి ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
ఉద్యోగుల జీతాలు, పింఛన్ బిల్లులు 90 నుంచి 95 శాతం వరకు నెలాఖరు రోజున ఖజానా అధికారులు పాస్ చేస్తారని వాటి చెల్లింపులు ఆ మరుసటి నెల ఐదు లోగా పూర్తి చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. రిజర్వు బ్యాంకు, బ్యాంకుల సెలవులు, రాష్ట్రంలో నిధులు (వేస్ అండ్ మీన్స్ - చేబదుళ్లు) అందుబాటులో ఉన్న పరిస్థితుల ఆధారంగా ఈ చెల్లింపులు సాగుతున్నాయని వివరించారు. గతంలోనే కాకుండా ఇప్పుడు కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోందని అన్నారు.
రెండ్రోజుల క్రితమే గవర్నర్ కు ఉద్యోగ సంఘాల నేతల ఫిర్యాదు
రెండ్రోజుల క్రితమే ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంఘం నేతలు ప్రభుత్వంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం దగ్గర ఉన్న ఉద్యోగుల బకాయిలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని .. ఎన్ని సార్లు అడిగినా ప్రభుత్వం ఇవ్వడం లేదని ఉద్యోగ నేతలు గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. ఆర్టికల్ 309 ప్రకారం ఉద్యోగ వ్యవస్థపై ప్రత్యక్ష సంబంధాలు, అధికారులు గవర్నర్ కు ఉంటాయని.. ఉద్యోగ నేతలు చెబుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలను ప్రభుత్వం సకాలంలో చెల్లించలేకపోతోందని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. కోట్లాది రూపాయల బకాయిలు, పెన్షన్ల చెల్లింపుకు గవర్నర్ జోక్యం చేసుకోవాలని, లేకపోతే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడతారని వినతి పత్రం ఇచ్చారు. ఇప్పటికే రాష్ట్రంలో ఉద్యోగుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది... 15వ తేదీ వరకు జీతాలు పడుతునే ఉంటాయని, పెన్షన్ల పరిస్థితి అలాగే ఉందని.. ఈ అంశాలన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామని ఉద్యోగ నేతుల ప్రకటించారు.
ఉద్యోగుల డీఏ బకాయిలు,జీపీఎఫ్ బకాయిలు,సీపీఎస్ వాటా నిధులు 10వేల కోట్ల పైన ప్రభుత్వం బకాయి ఉందని ఉద్యోగ నేత సూర్యనారాయణ గవర్నర్ ను కలిసిన అనంతరం వెల్లడించారు. ఉద్యోగులు ఆందోళన చేయడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదన్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో మమ్మల్ని రక్షించాలని గవర్నర్ ను కలిశామన్నారు. ఉద్యోగులు,పెన్షనర్లు,దినసరి కార్మికులకు చెల్లించాల్సిన నిధులు నెల చివరి రోజు లేదా తర్వాత నెల మొదటి రోజు చెల్లించాలని, ఉద్యోగుల వ్యవహారాల్లో ప్రభుత్వం జాలి చూపించాల్సిన అవసరం ఉందన్నారు. గవర్నర్ కు జీవోలతో సహా అన్ని వివరాలు వివరించామన్నారు. ప్రభుత్వం నుంచి మొదటి చెల్లింపుదారుడిగా క్లెయిమ్స్ సెటిల్ చేసేలా చట్టాన్ని తీసుకురావాలని గవర్నర్ ను కోరామన్నారు. తగిన చర్యలు తీసుకుంటానని గవర్నర్ హామీ ఇచ్చారన్నారు.