YSRCP Reaction on Furniture Allegations : లెక్క కడితే డబ్బులు ఇస్తామని చెప్పాం - క్యాంప్ ఆఫీస్ ఫర్నీచర్ వివాదంపై వైసీపీ వివరణ
Jagan Furniture : జగన్ క్యాంప్ ఆఫీసులో ఉన్న ప్రభుత్వ వస్తువులకు డబ్బులు చెల్లిస్తామని లేఖ రాశామని వైసీపీ తెలిపింది. దీనిపై ఇంకా ప్రభుత్వం నుంచి స్పందన రాకపోయినా విమర్శలు చేస్తున్నారని ఆరోపించింది.
Furniture Allegations On Jagan : ప్రజాధనంతో సొంత ఇంటికి సౌకర్యాలు కల్పించుకున్నారని ఓడిపోయిన తర్వాత వాటిని ప్రభుత్వానికి సరెండర్ చేయకుండా సొంతానికి వాడుకుంటున్నారని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై వచ్చిన ఆరోపణలపై వైఎస్ఆర్‌సీపీ వివరణ ఇచ్చింది. ఈ విషయంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని.. ప్రభుత్వానికి చెందిన ప్రతి వస్తువుకు డబ్బులు కడతామని లేఖ రాశామని ఆ పార్టీ నేత లేళ్ల అప్పిరెడ్డి మీడియాకు తెలిపారు.
ప్రభుత్వం జగన్ క్యాంప్ కార్యాలయం కోసం ఏర్పాటు చేసిన సౌకర్యాలు
జగన్మోహన్‌రెడ్డిగారిని లక్ష్యంగా చేసుకుని వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డం అలవాటుగా టీడీపీ మార్చుకుందని వైసీపీ విమర్శించింది. తప్పుడు ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నరాు. ముఖ్యమంత్రి హోదాలో జగన్ క్యాంపు కార్యాలయంలో పరిపాలనకు అవసరమైన సౌకర్యాలను గత ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఎవరు ఉన్నా వారి క్యాంపు కార్యాలయానికి తగిన సౌకర్యాలు ఏర్పాటు చేయడం సర్వసాధారణ విషయమని అప్పిరెడ్డి చెప్పారు. ఇందులో భాగంగానే జగన్ క్యాంపు కార్యాలయంలో కూడా ఏర్పాటు చేశారన్నారు.
జాబితాను అధికారులకు ఇచ్చామన్న వైసీపీ
ప్రభుత్వం మారాక ఏయే వస్తువులను క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేశారో జాబితాను అధికారులకు ఇప్పటికే సమర్పించడం జరిగిందని వైసీపీ తెలిపింది. వెసులుబాటు ఇస్తే ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఏర్పాటు చేసిన ఫర్నిచర్‌కు విలువకట్టి, ఎంత తిరిగి చెల్లించాలో చెప్తే, అంతా చెల్లిస్తామని ప్రభుత్వాధికారులను కోరడం జరిగిందన్నారు. దీనికి సంబంధించిన ప్రక్రియ ఇంకా కొనసాగుతోందన్నారు. ప్రభుత్వంవైపు నుంచి సమాధానం కోసం ఎదురుచూస్తున్నామని.. కానీ అప్పుడే టీడీపీ మంత్రులు, ఆ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా జగన్ ని లక్ష్యంగా చేసుకుని దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన మంత్రులుకూడా ఈ ప్రచారంలో భాగస్వాములు కావడం అత్యంత దురదృష్టకరమని అప్పిరెడ్డి చెప్పుకొచ్చారు.
టీడీపీ చేస్తున్న ఆరోపణలు ఇవీ !
సీఎంగా ఉన్నప్పుడు జగన్ ఎక్కవగా తన క్యాంప్ ఆఫీస్ నుంచి పరిపాలన చేసేవారు. సెక్రటేరియట్ కు కేవలం మంత్రి వర్గ సమావేశాలు ఉన్నప్పుడు మాత్రమే వచ్చేవారు. తాడేపల్లిలోని తన ఇంటి పక్కనే మరో భవనం నిర్మించారు. దాన్నే క్యాంప్ ఆఫీసుగా చెబుతున్నారు. సీఎం అయిన తర్వాత ప్రభుత్వ పరంగా జీవోలు విడుదల చేసి ఆ ఇంటికి అదనపు సౌకర్యాలు, ఫర్నీచర్ కల్పించారు. అంతా ప్రజాధనంతోనే కల్పించారు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత సీఎంగా రాజీనామా చేశారు. ఇప్పుడు తాడేపల్లిలో వైసీపీ పార్టీ కార్యాలయాన్ని ఖాళీ చేశారు. క్యాంప్ ఆఫీస్‌గా వినియోగించిన భవనాన్ని పార్టీ కార్యాలయంగా ప్రకటించారు. ఆ పార్టీ కార్యాలయంలోనే జగన్ తన పార్టీ సమీక్షల్ని నిర్వహిస్తున్నారు. జగన్‌కు చెందిన ప్రైవేటు ఆస్తికి ఆయన సీఎం అయిన మొదటి ఐదు నెలల్లోనే రూ. 15 కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలు రిలీజ్ చేసుకున్నారని జీవోలతో సహా కొంత మంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. వీటిని జగన్ వద్ద నుంచి రికవరీ చేయాలని అంటున్నారు. మంత్రులు కూడా ఆరోపించండంతో వైసీపీ వివరణ ఇచ్చింది.