ఫైబర్ నెట్ కేసులో మాజీ మంత్రి యనమల పేరు కూడా - ఛైర్మన్ సంచలన వ్యాఖ్యలు
ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ పి.గౌతమ్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫైబర్ నెట్ కేసులో గత ప్రభుత్వంలో ఆర్థికశాఖ మంత్రిగా పని చేసిన యనమల రామకృష్ణుడి పేరు కూడా బయటకు వస్తుందన్నారు.
ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ పి.గౌతమ్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫైబర్ నెట్ కేసులో గత ప్రభుత్వంలో ఆర్థికశాఖ మంత్రిగా పని చేసిన యనమల రామకృష్ణుడి పేరు కూడా బయటకు వస్తుందన్నారు. విజయవాడలోని ఫైబర్‌నెట్ కార్యాలయంలో శనివారం గౌతమ్‌రెడ్డి విలేకర్లతో మాట్లాడారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ పాత్ర ఉందా లేదా అనేది సీఐడీ తేలుస్తుందని స్పష్టం చేశారు. ప్రధాన మంత్రి మోదీ, హోంశాఖ మంత్రి అమిత్‌షాలకు చెప్పే చంద్రబాబుని, అరెస్టు చేసిందనడం పిచ్చి మాటలన్నారు. బీజేపీ, వైసీపీల మధ్య ఎలాంటి సంబంధాలూ లేవన్నారు.
ఫైబర్ నెట్ సంస్థకు వేల కోట్ల ఆస్తులు
ఫైబర్ నెట్ సంస్థకు రూ.3,586 కోట్ల ఆస్తులు ఉన్నాయన్నారు గౌతమ్ రెడ్డి. సంస్థ వ్యాపారాభివృద్ధికి వీలుగా హడ్కో నుంచి ఇప్పటికే రూ.150 కోట్ల రుణం తీసుకున్నామని, మరో రూ.150 కోట్లు తీసుకుంటామని వెల్లడించారు. గ్రామీణ విద్యుత్తు సంస్థ నుంచి రూ.300 కోట్ల రుణం కోసం సంప్రదింపులు చేస్తున్నామని, కొత్తగా కేబుల్ కనెక్షన్లు ఇచ్చేందుకు అవసరమైన బాక్సులను సంస్థ ద్వారా ఆపరేటర్లు, ఎంఎస్‌వోలకు మొదటి 9 నెలల వరకు ఉచితంగా ఇస్తామన్నారు. అవసరమైతే మరో మూడు నెలలు పొడిగిస్తామని, ఒక్కో బాక్సు విలువ ప్రైవేట్ మార్కెట్లో రూ.4 వేల వరకు ఉంటుందని తెలిపారు. దేశంలో ఎక్కడైనా టెలికాం ప్రాజెక్టులకు సంబంధించిన టెండర్లలో పాల్గొనాలని నిర్ణయించామన్న ఆయన, రూ.1,145.10 కోట్ల సీసీ కెమెరాల ప్రాజెక్టుని ప్రభుత్వం నుంచి తీసుకుని రాష్ట్ర హోంశాఖకు లీజుకి ఇస్తున్నామని తెలిపారు. ఫైబర్ నెట్ కంపెనీకి ప్రస్తుతం ఉన్న రూ.7 కోట్ల షేర్లను రూ.2 వేల కోట్లకు పెంచేందుకు చర్యలు తీసుకుంటుమని చెప్పారు.
నారా లోకేశ్‌కు సీఐడీ నోటీసులు
ఫైబర్ గ్రిడ్ కేసులో తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు సీఐడీ నోటీసులు ఇచ్చింది. లోకేశ్‌ను నిందితుల జాబితాలో చేర్చే నట్లయితే సీఆర్‌పీసీ సెక్షన్ 41ఏ ప్రకారం నోటీసు ఇచ్చి విచారిస్తామని సీఐడీ తరఫున అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ హైకోర్టుకు తెలిపారు. 41ఏ నోటీసు నిబంధనలను తప్పకుండా పాటిస్తామని హామీ ఇచ్చారు. ఏజీ చెప్పిన వివరాలను నమోదు చేసిన న్యాయమూర్తి జస్టిస్ కె.సురేశ్‌రెడ్డి, 41ఏ నిబంధనల మేరకు నడుచుకోవాలని సీఐడీని ఆదేశించారు. వ్యాజ్యంపై విచారణను మూగించారు.
ఫైబర్ గ్రిడ్ టెండర్లో అక్రమాలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలతో మంగళగిరి సీఐడీ పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిలు మంజూరు చేయాలని లోకేశ్ పిటిషన్ దాఖలు చేశారు. 41ఏ నోటీసు పేరుతో పిలిచి, నిబంధనలకు కట్టుబడలేదనే సాకుతో అరెస్టు చేసే ప్రమాదం ఉందని లోకేశ్ తరఫున సీనియర్ న్యాయవాది కోర్టు తెలిపారు. 41ఏ(3)(4) నిబంధనలను ఒకేసారి సూచిస్తూ నోటీసు ఇస్తున్నారని అన్నారు. నోటీసులోని అంశాలకు కట్టుబడలేదనే కారణం చూపుతూ అక్రమ అరెస్టులు చేస్తున్నారని తెలిపారు. అరెస్టు అవసరం లేదనుకున్నప్పుడు 41ఏ నోటీసు ఇవ్వాలనేది శాసనకర్తల ఉద్దేశమని తెలిపారు. పిటిషనర్ తండ్రి చంద్రబాబు పేరును స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అకస్మాత్తుగా చేర్చి ఒక్కసారిగా అరెస్టు చేశారని కోర్టుకు తెలిపారు. ఫైబర్ గ్రిడ్ కేసులో ఇప్పటి వరకు లోకేశ్ పేరు నిందితుల జాబితాలో లేదని, 2021లో నమోదు చేసిన కేసన్నారు. పిటిషనర్‌కు ఇప్పటి వరకు ఎలాంటి నోటీసు ఇవ్వలేదని, సీఐడీ 94 మంది సాక్షులను విచారించిందన్నారు.