YS Jagan: పౌరులకు గొప్పగా సేవలు అందించారు, సీఎం జగన్ పై ప్రపంచ బ్యాంకు ప్రతినిధి బృందం ప్రశంసలు
ఏపీ సీఎం వైఎస్ జగన్ తో ప్రపంచ బ్యాంకు ప్రతినిధి బృందం భేటీ అయ్యింది. భారత్ లో ప్రపంచ బ్యాంకు డైరెక్టర్ అగస్తే టోనో కౌమే (Auguste Tano Koume) నేతృత్వంలో బృందం జగన్ ను కలిసింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో ప్రపంచ బ్యాంకు ప్రతినిధి బృందం భేటీ అయ్యింది. భారత్ లో ప్రపంచ బ్యాంకు డైరెక్టర్ అగస్తే టోనో కౌమే (Auguste Tano Koume) నేతృత్వంలో బృందం జగన్ ను కలిసింది.
మూడు కార్యక్రమాలపై సమీక్ష...
ప్రపంచ బ్యాంకు ఆర్థిక సహాయంతో అమలవుతున్న మూడు కార్యక్రమాలపై ఈ సందర్బంగా సమీక్ష నిర్వహించారు. ఏపీ ప్రజారోగ్యం బలోపేతం, ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఎడ్యుకేషన్ (సాల్ట్), ఏపీ ఇంటిగ్రేటెడ్ ఇరిగేషన్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్ట్ (ఏపీఐఐఏటీపీ) ప్రాజెక్టులు అమలు అవుతున్న తీరును సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రపంచ బ్యాంకు భారత్ విభాగానికి డైరెక్టర్ AugusteTano Koume మాట్లాడుతూ తాము రాష్ట్రానికి రావడం ఇదే తొలిసారని తెలిపారు. వివిధ రంగాల్లో ప్రభుత్వం చేరుకున్న లక్ష్యాలను ప్రత్యక్షంగా మేం చూశామని, ప్రభుత్వం ప్రజలకు ఏ విధంగా సేవలు అందించగలదు.. అనేందుకు ఉదాహరణగా ముఖ్యమంత్రి నిలిచారని కొనియాడారు. మంచి వైద్యం, ఆరోగ్యం, మంచి విద్యను ఎలా అందించవచ్చు.. అనే అంశాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చూపిన చొరవని ప్రత్యక్ష్యంగా పరిశీలించామని అన్నారు.
నిర్దేశిత సమయంలోగా సేవలను పౌరులకు అందించడంలో గొప్ప సేవలను అందించారని, దేశంలో దాదాపు 22 రాష్ట్రాలకు రుణాలు ఇస్తున్నామని వెల్లడించారు. వివిధ రంగాల్లో వృద్ధి కోసం రుణాలు ఇస్తున్నామని, రాష్ట్రాన్ని మిగిలిన రాష్ట్రాలు ఒక ఉదాహరణగా తీసుకుని ముందుకు సాగవచ్చని అన్నారు. రాష్ట్రంతో భాగస్వామ్యం చాలా రోజులుగా కొనసాగుతోందని, వచ్చే పాతికేళ్ల వరకు సహకారం కొనసాగుతుందని హామీ ఇచ్చారు. 2047 నాటికి దేశంలానే, రాష్ట్రం కూడా మంచి ఆదాయం ఉన్న రాష్ట్రంగా మారడానికి తగిన సహకారం, మద్దతు ఇస్తామని వివరించారు. అత్యంత వృద్ధిరేటు ఉన్న రాష్ట్రాల్లో ఏపీ ఒకటని తెలిపారు.
డైనమిక్ పారిశ్రామిక రంగం, వైద్య రంగాలు..
సమర్థవంతమైన డైనమిక్ ప్రభుత్వం ఉందని, వరల్డ్ బ్యాంకుతో చేపడుతున్న కార్యక్రమాలు చాలా బాగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఏపీ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు జాతీయ స్థాయిలో అమలు చేస్తున్న కార్యక్రమాలకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయని అన్నారు. ఆరోగ్య రంగంలో టెలి మెడిసన్, ఆన్లైన్ సేవలు, ప్రజలకు చేరువగా వైద్యం, స్వయం సహాయక సంఘాలకు మద్దతుగా నిలవడం వంటి కార్యక్రమాలు అమలపై హర్షం వ్యక్తం చేశారు. విద్యా రంగంలో కూడా ప్రపంచ బ్యాంకు రాష్ట్రంతో కలిసి పనిచేస్తోందన్నారు.
ప్రభుత్వ కార్యక్రమాలపై అధ్యయనం చేయండి..
ప్రపంచ బ్యాంకు బృందాన్ని ఉద్దేశించి సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో తమ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలపై సమగ్రంగా అధ్యయనం చేయాలని కోరారు. ఈ కార్యక్రమాల్లో మరింతగా ప్రపంచ బ్యాంకు భాగస్వామ్యాన్ని తాము ఆశిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో మొత్తం స్కూళ్ల రూపు రేఖలన్నీ మారుస్తున్నామని ఆయన అన్నారు. 12 రకాల మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నట్లు వివరించారు. 6వ తరగతి నుంచి ఐఎఫ్పీ ప్యానెల్స్ ఏర్పాటు చేస్తున్నామని, వచ్చే జూన్ కల్లా వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. డిజిటలైజేషన్ దిశగా వేస్తున్న పెద్ద అడుగులకు తోడ్పాటు కావాలన్నారు. నాడు నేడు కోసం భారీ ఎత్తున డబ్బు ఖర్చు చేస్తున్న విషయాన్ని జగన్ వివరించారు. రెండో దశ నాడు - నేడు పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయని, జీఈఆర్ రేషియోను పెంచుకుంటూ వెళ్లాలన్నదే మా ఉద్దేశమన్నారు. ప్రైమరీ ఎడ్యుకేషన్ లో మేం వచ్చేసరికి దేశ సగటు కన్నా.. తక్కువగా ఉండేదిని, ఇప్పుడు దీన్ని అధిగమించామని సీఎం జగన్ తెలిపారు.