TDP Vs Janasena: జనసేన - బీజేపీ మధ్య గ్యాప్‌కు కారణం ఎవరు ? పవన్ పట్టించుకోలేదా ? బీజేపీ నిర్లక్ష్యం చేసిందా ?
పవన్ లైట్ తీసుకున్నారా ?బీజేపీ అతిశయానికి వెళ్లిందా ?బీజేపీ, జనసేనల మధ్య పొత్తులు సఫలం కాకపోవడానికి కారణాలేమిటి ?
TDP Vs Janasena: ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ - జనసేన మేధ్య పొత్తు విషయం క్లైమాక్స్ కు వచ్చినట్లుగా కనిపిస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి ఓటేయవద్దు అని పవన్ పిలుపునిచ్చారు కానీ బీజేపీకి ఓటేయమని చెప్పలేదు. అందుకే ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఉందా లేదా అన్న డౌట్ అందరికీ వచ్చింది. గత కొన్నాళ్లుగా జరుగుతున్న పరిణామాలు చూస్తే మోదీ, అమిత్ షా అంటే గౌరవం కానీ ఏపీ బీజేపీ నేతలంటే మాత్రం ఇష్టం లేదన్నట్లుగా పవన్ మాట్లాడుతున్నారు. పవన్ మాటల్ని బట్టి చూస్తే ఢిల్లీ వరకూ బీజేపీకి మద్దతుగా ఉంటాం.. రాష్ట్రంలో మాత్రం వద్దని రాజకీయవర్గాలు ఓ అంచనాకు వస్తున్నాయి. దానికి తగ్గట్లుగానే అటు బీజేపీ కానీ ఇటు పవన్ కానీ కలిసి నడిచేందుకు ఏ మాత్రం ప్రయత్నం చేయలేదు. చివరికి అది బంధం తెగిపోయే దశకు చేరుకుంది.
అనూహ్యంగా బీజేపీతో పొత్తు పెట్టుకున్న పవన్ కల్యాణ్
సాధారణంగా రాజకీయ పొత్తులు అనేవి ఎన్నికల సమయంలోనే ఉంటాయి. ఎన్నికల సమయంలో పవన్ కల్యాణ్ కమ్యూనిస్టు పార్టీలు, బీఎస్పీతో కలిసి వెళ్లారు. ఎన్నికల్లో దారుణ పరాజయం ఎదురైంది. చివరికి రెండు చోట్ల తాను కూడా గెలవలేదు. దీంతో వెంటనే రియలైజ్ అయ్యారు. ఏపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తీసుకున్న నిర్ణయాలతో ఇసుక కొరత ఏర్పడటం.. మూడు రాజధానుల నిర్ణయంతో ప్రజా వ్యతిరేకత గుర్తించి వెంటనే రంగంలోకి దిగారు. విశాఖలో కవాతు నిర్వహించారు. అమరావతిలోనూ నిర్వహించాలనుకున్నారు. తేదీ ప్రకటించారు. కానీ అనూహ్యంగా ఢిల్లీ వెళ్లి బీజేపీతో పొత్తు ప్రకటన చేశారు. అసలు ఎన్నికలు అయిపోయాక ఈ పొత్తు ప్రకటనేంటో చాలా మందికి అర్థం కాలేదు. కానీ పవన్ నిర్ణయం తీసుకున్నారు కదా అని ఫాలో అయిపోదామనుకున్నారు. కానీ అలా పొత్తు ప్రకటన చేసిన తర్వాత కలిసి చేయాల్సిన ఉద్యమాలు కాస్తా పూర్తిగా ఆగిపోయాయి. జనసేన ప్రకటించిన కవాతు కూడా జరగలేదు. ఓ సమన్వయ కమిటీ ఏర్పాటు చేసుకుని కలిసి పని చేద్దామనుకున్నారు కానీ.. ఆ కమిటీలు కాదు కదా ఏమీ లేవు. పొత్తు ప్రకటన చేశారు కానీ.. కలిసి పని చేసిందే లేదు.
తిరుపతి ఉపఎన్నికల సమయంలోనే పవన్‌కు కాస్త గౌరవం !
తిరుపతి లోక్ సభ సభ్యుడు మృతి చెందడంతో వచ్చిన ఉపఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీ సిట్టింగ్ సభ్యుడి కుటుంబసభ్యులకు టిక్కెట్ ఇవ్వకపోవడంతో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు పోటీ చేశాయి. ఆ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి పోటీ చేయాలని జనసేన అనుకుంది. కానీ బీజేపీ జరుగుతోంది లోక్ సభ ఎన్నికలు కాబట్టి బీజేపీకి చాన్సివ్వాలని పట్టుబట్టింది. రెండు సార్లు ఢిల్లీ పర్యటనల తర్వాత పవన్ కల్యాణ్ .. బీజేపీకి సీటు ఇచ్చారు. మాజీ ఐఏఎస్ అధికారికి టిక్కెట్ ఇచ్చి రంగంలోకి దింపారు. పవన్ కల్యాణ్ కూడా ప్రచారం చేశారు. కానీ ఏడు నియోజకవర్గాల్లో కలిపి కేవలం 57వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. డిపాజిట్ రాలేదు. అంతకు ముందు సాధారణ ఎన్నికల్లో బీజేపీకి 16 వేల ఓట్లు వచ్చాయి. జనసేన కలిసిన తర్వాత మరో 30 వేల ఓట్లు పెరిగాయి. నిజానికి పవన్ కల్యాణ్ కు మద్దతిచ్చే వర్గం ఎక్కువగా ఆ ప్రాంతంలో ఉందని చెప్పుకుంటారు. కానీ ఆ స్థాయిలో ఓట్లు రాలేదు. దీంతో బీజేపీ, జనసేన పొత్తు వర్కవుట్ కావడం లేదన్న అభిప్రాయం ప్రారంభమయింది.
స్థానిక ఎన్నికల్లో ఎవరికి వారే పోటీ !
తర్వాత స్థానిక ఎన్నికల్లో బీజేపీ, జనసేన పొత్తులపై చర్చించుకోలేదు. కనీసం పొత్తులు పెట్టుకోవాలన్న ఆలోచన కూడా చేయలేదు. ఎవరికి వారు పోటీ చేసుకున్నారు. కోస్తాలో కొన్ని చోట్ల టీడీపీ, జనసేన స్థానిక నాయకత్వాలు పొత్తులు పెట్టుకుని పోటీ చేసి మంచి ఫలితాలు సాధించాయి. ఓ ఎంపీపీ పదవిని..జడ్పీటీసీని సొంతం చేసుకున్నాయి. అప్పట్నుంచే టీడీపీ, జనసేన పొత్తులపై చర్చలు ప్రారంభమయ్యాయి.
బీజేపీ అంతర్గత రాజకీయాలతో జనసేనతో సమన్వయం మరింత క్లిష్టం !
ఏపీ బీజేపీకి ఉన్న బలం స్వల్పమే అయినా నేతల మధ్య ఆధిపత్య పోరాటానికి మాత్రం కొరతే లేదు. సోము వీర్రాజుకు వ్యతిరేకంగా ఓ బలమైన గ్రూప్ ఏర్పడింది. సోము వీర్రాజు పార్టీ నేతల్నే కాదు జనసేననూ పట్టించుకోలేదని.. కనీసం సమన్వయం చేసుకునే ప్రయత్నం చేయలేదన్న విమర్శలు వచ్చాయి. ఇలా ఎలా చూసినా.. జనసేన చొరవ తీసుకుని మరీ పొత్తులోకి వచ్చినా...జనసేనతో మైత్రిని కొనసాగించుకుని పరస్పర లబ్ది పొందాల్సిన పార్టీలు రెండూ నష్టపోయాయి. ఆవిర్భావసభలో పవన్ అదే చెప్పారు.. బీజేపీ సహకరించి ఉంటే.. టీడీపీ అవసరం లేకుండా ఎదిగేవాళ్లమని. కానీ ఆ అవకాశం చేజారిపోయింది. ఇప్పుడు బీజేపీ నేతలు ఏం అనుకున్నా ప్రయోజనం లేని స్థితికి చేజారిపోయింది.