Students Attack: భీమవరంలో యువకుడిపై దాడి - నలుగురు యువకులపై హత్యాయత్నం కేసు నమోదు, అరెస్ట్
Students Attack: భీమవరం ఎస్.ఆర్.కే.ఆర్ కాలేజీలో దారుణ సంఘటన జరిగింది. నలుగురు విద్యార్థులు కలిసి ఒక విద్యార్థిపై కర్రలతో దాడిచేసి గాయపరిచారు.
భీమవరంలో తోటి విద్యార్థి పై విద్యార్థులు దాష్టికం
హాస్టల్ రూమ్ లోకి తీసుకెళ్లి కర్రతో విచక్షణారహితంగా దాడి
నలుగురు యువకులపై హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు
Students Attack: భీమవరం ఎస్.ఆర్.కే.ఆర్ కాలేజీలో దారుణ సంఘటన జరిగింది. నలుగురు విద్యార్థులు కలిసి ఒక విద్యార్థిపై కర్రలతో దాడిచేసి గాయపరిచారు. కళాశాల వసతిగృహంలో ఈ ఘటన జరిగింది. గాయపడిన విద్యార్థి ప్రస్తుతం భీమవరం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దాడికి పాల్పడిన నలుగురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు.
దీనిపై పోలీసులు వివరాలు తెలిపారు. ఎస్ ఆర్ కే ఆర్ కాలేజీలో చదువుతున్న అంకిత్ ను.. అదే కళాశాలకు చెందిన ప్రవీణ్, ప్రేమ్, నీరజ్, స్వరూప్ లు కర్రలతో కొట్టారు. కాలేజీ హాస్టల్ లోనీ ఒక రూమ్ లోకి తీసుకెళ్లి కర్రలతో విచక్షణారహితంగా దాడిచేశారు. దీంతో అంకిత్ తీవ్రంగా గాయపడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీడియో ఆధారంగా పోలీసులు దాడికి పాల్పడిన యువకులను అరెస్ట్ చేశారు. అలాగే బాధితుని నుంచి ఫిర్యాదు అందుకున్నారు. దీనిపై భీమవరం టూ టౌన్ ఎస్సై కృష్ణ కుమార్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. బాధిత విద్యార్థి ఫిర్యాదు మేరకు దాడికి పాల్పడిన విద్యార్థులపై ఐపీసీ 341, 342, 384, 307, 324, 506 రెడ్ విత్ (34) కేసు నమోదు చేశారు. భీమవరం టూ టౌన్ సిఐ కృష్ణ కుమార్ ఆధ్వర్యంలో విచారణ అనంతరం ప్రవీణ్, ప్రేమ్, నీరాజ్, స్వరూప్ లను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.
వివాదానికి అమ్మాయే కారణమా!
విద్యార్థుల ఘర్షణకు ఒక అమ్మాయి కారణమని తెలుస్తోంది. ఆ అమ్మాయి కారణంగా విద్యార్థుల మధ్య వివాదం మొదలై ఘర్షణకు దారితీసినట్లు సమాచారం. ఓ అమ్మాయి విషయమై వీరి మధ్య వివాదం జరగగా.. అంకిత్ ని తోటి విద్యార్థులు హాస్టల్ లోకి తీసుకెళ్లి తలుపులు వేసి విచక్షణారహితంగా కర్రలతో దాడికి పాల్పడ్డారు. బాధిత యువకుడు క్షమించమని ఎన్నిసార్లు వేడుకున్నా ఏమాత్రం వినకుండా దాస్టికానికి దిగారు. దీంతో బాధిత విద్యార్థి తీవ్ర గాయాలు పాలయ్యాడు. బాధిత విద్యార్థి అంకిత్ షర్టు తీయించి మరి దారుణంగా కొట్టినట్లు వీడియోలో కనిపిస్తుంది. వీడియో వైరల్ అవ్వడంతో స్పందించిన పోలీసులు ఈ ఘటనపై సీరియస్ గా తీసుకుని విచారణ చేపట్టారు.
చదువుకోవడానికి కాలేజీలకు వెళ్లే విద్యార్థులు ఇలాంటి గొడవలతో జీవితాలు నాశనం చేసుకోకూడదని పోలీసులు హెచ్చరించారు. తల్లిదండ్రుల మాట వింటూ, కాలేజీలో లెక్చరర్లు, ప్రొఫెసర్లు చెప్పే విషయాలపై ఫోకస్ చేయాలని విద్యార్థులకు సూచించారు. ఒక్కసారి గొడవల్లోకి దూరి పెద్ద పెద్ద కేసులలో ఇరుక్కుంటే జీవితాలు నాశనం అవుతాయని, మీపై ఎంతో నమ్మకం ఉంచిన తల్లిదండ్రులను మోసం చేసినట్లేనని కాలేజీ యాజమాన్యం, పోలీసులు విద్యార్థులకు సూచించారు. అమ్మాయిలు, ప్రేమ అంటూ అనవసరంగా టైమ్ వేస్ట్ చేసుకుంటున్నారని, చదువుపై ఫోకస్ చేయడం లేదన్నారు.
Also Read: Tekkali SI Dance : టెక్కలి ఎస్సై కృష్ణ లీలలు, పోలీస్ స్టేషన్ ముందే యువతులతో అశ్లీల నృత్యాలు!