Weather Updates: నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం, భగభగ మండుతున్న ఏపీ, తెలంగాణ - వర్షాల కోసం రైతుల ఎదురుచూపులు
Southwest Monsoon To Enter AP: మే 28వ తేదీన రుతుపవనాలు కేరళను తాకాయి. వారం రోజుల్లో ఏపీలోకి ప్రవేశించాల్సిన నైరుతి రుతుపవనాల కదలిలకు ఉపరితల ఆవర్తనం, పశ్చిమ గాలుల ప్రభావంతో అవరోధం ఏర్పడింది.
Southwest Monsoon: ఉపరితల ఆవర్తనం, పశ్చిమ గాలుల ప్రభావంతో నైరుతి రుతుపవనాల కదలికలకు అవరోధం ఏర్పడింది. ఈ సంవత్సరం మే 28వ తేదీన రుతుపవనాలు కేరళను తాకాయి. మే 31 నాటికి కర్ణాటక, ఏపీ సరిహద్దు వరకు వచ్చినా.. మధ్యప్రదేశ్, విదర్భ, తెలంగాణ మీదుగా రాయలసీమ వరకు విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తనం, పశ్చిమ గాలుల ప్రభావంతో రుతుపవనాల రాక ఆలస్యమైంది. జూన్ 4, 5వ తేదీనే రాయలసీమను తాకాల్సి ఉండగా ఇంకా రాలేదు. నేడు లేదా రేపు నైరుతి రుతుపవనాలు ఏపీని తాకనున్నాయని వాతావరణ శాఖ చెబుతోంది. ఆంధ్రప్రదేశ్, యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ దిశ నుంచి గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో ఏపీలో కొన్ని జిల్లాల్లో వర్షాలు కురవనుండగా.. మరికొన్ని చోట్ల వేడి, ఉక్కపోతతో ప్రజలు ఇబ్బంది పడతారు.
కోస్తాంధ్ర, యానాంలో..
ఈ రోజు ఆంధ్రప్రదేశ్, యానాంలలో వర్షాలు చాలా తక్కువగా ఉంటాయి. నైరుతి రుతుపవనాలు జూన్ మధ్యలో కోస్తాంధ్ర ప్రాంతంలోకి ప్రవేశిస్తాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో జూన్ 15 తరువాత రుతుపవనాలు వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. కోస్తాంధ్ర జిల్లాల్లో ఈ రోజు అంతగా చెప్పుకోదగ్గ వర్షాలు ఉండవు. కొద్ది చోట్లల్లో మాత్రమే వర్షాలుంటాయి. పార్వతీపురం మణ్యం, పాడేరు, ఏలూరు జిల్లా, పశ్చిమ ప్రకాశం, పశ్చిమ నెల్లూరు జిల్లాలో మాత్రమే కొన్నిచోట్ల అక్కడక్కడా వర్షాలుంటాయి. మిగిలిన జిల్లాల్లో వేడి, ఉక్కపోత అధికంగా ఉండటంతో ప్రజలు ఇబ్బంది పడతారు. రైతులు మాత్రం పంట పొలానికి సంబంధించిన పనులకు శ్రీకారం చుడతారు.
రాయలసీమలో వెదర్ అప్‌డేట్స్..
రాయలసీమ జిల్లాల్లోని కర్ణాటక సరిహద్దు ప్రాంతాలని ఈ రోజు రుతుపవనాలు తాకనున్నాయి. ముఖ్యంగా కర్నూలు, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో వర్షాలు పడతాయని ఏపీ వెదర్ మ్యాన్ అంచనా వేశారు. అది కూడా కర్ణాటక రాష్ట్రానికి దగ్గరగా ఉండే ప్రాంతాల్లో కురిసే ఛాన్స్ ఉంది. కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, తిరుపతి, నంద్యాల, అన్నమయ్య (మదనపల్లి । రాయచోటి)లో అక్కడక్కడ మాత్రమే వర్షాలుంటాయి. విస్తారంగా వర్షాలు ఉండవు. నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం కావడంతో ఎండ నుంచి ఉపశమనం లభించడం లేదు. గతేడాది కన్నా ముందుగానే వర్షాలు పడతాయని అంచనా వేయగా అలా జరగలేదు.
తెలంగాణలో వడగాల్పులు
నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది తెలంగాణలో ఆలస్యంగా ప్రవేశించనున్నాయి. ఉపరితల ఆవర్తనం, పశ్చిమ గాలుల ప్రభావంతో మందగించిన రుతుపవనాల గమనం మళ్లీ బలం పుంజుకుని జూన్ 11 నుంచి 13 తేదీలలో తెలంగాణలోకి రానున్నాయి. హైదరాబాద్ లో రోజంతా ఆకాశం మేఘావృతమై ఉండనుంది. మండు వేసవి ఎండల నుంచి ఉపశమనం కలగనుంది. కానీ మధ్యాహ్నానికి హైదరాబాద్‌లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో వడగాల్పులు వీచ్చే అవకాశం ఉంది. కొన్ని జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది.
Also Read: Gold-Silver Price: బంగారం కొంటున్నారా? నేడు తగ్గిన పసిడి ధరలు! వెండి కూడా దిగువకు