Weather Updates: నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఏపీలో మరో 4 రోజులు వర్షాలు - తెలంగాణలో పొడి వాతావరణం
AP Rains: నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఏపీలో మరో నాలుగు రోజులపాటు వర్షాలు కురవనుండగా, తెలంగాణలో మాత్రం వాతావరణం పొడిగా మారుతుందని వాతావరణ కేంద్రం పేర్కొంది.
Rains In AP: నైరుతి రుతుపవనాలు గత ఏడాదితో పోల్చితే వారం నుంచి పది రోజుల ముందే ఏపీ, తెలంగాణలోకి ప్రవేశిస్తున్నాయి. దక్షిణ కర్ణాటక, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం రాయలసీమ దాని పరిసర సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల మధ్య విస్తరించి ఉంది. నైరుతి రుతుపవనాల ఉత్తర పరిమితి 5 డిగ్రీల ఉత్తర అక్షాంశం / 67 డిగ్రీల తూర్పు రేఖాంశం, 6 డిగ్రీల ఉత్తర అక్షాంశం లేదా 72 డిగ్రీల తూర్పు రేఖాంశం, 18 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 94.5 డిగ్రీల తూర్పు రేఖాంశం గుండా కొనసాగుతోంది. వీటి ఫలితంగా ఏపీ, యానాం, తెలంగాణలో పలుచోట్ల నేడు సైతం మోస్తరు వర్షాలు కురయనున్నాయని వెల్లడించారు.
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో..
దక్షిణ అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, దక్షిణ, తూర్పు మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాల్లోకి నైరుతి రుతుపవనాలు మరింతగా విస్తరించాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఏపీలో ప్రస్తుతం పడమర, వాయువ్య గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో మరో నాలుగు రోజులపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి జల్లులు పడనుండగా, ఒకట్రెండు చోట్లు ఓ మోస్తరు వానలు కురిసే అవకాశం ఉంది. ఒకట్రెండు చోట్ల తీరం వెంట 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, మత్స్యకారులు వేటకు వెళ్లడం అంత క్షేమం కాదని సూచించారు.
District wise weather forecast and warnings for Andhra Pradesh for next 5 days Dated 23.05.2022. pic.twitter.com/XAv5aaDZEL
— MC Amaravati (@AmaravatiMc) May 23, 2022
దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో వర్షాలు..
నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతుండటంతో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. నేటి నుంచి మరో నాలుగు రోజులపాటు ఈ ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురవనున్నాయి. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. రాయలసీమలోనూ కొన్ని జిల్లాలకు ఒకట్రెండు చోట్ల వర్ష సూచన ఉంది. మరోవైపు వర్షాలు లేని ప్రాంతాల్లో నుంచి 3 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు.
తెలంగాణలో పొడి వాతావరణం..
తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం పొడిగా మారనుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గరిష్ట ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల మేర పెరగనున్నాయి. రాష్ట్రంలో పశ్చిమ, వాయువ్య దిశల నుంచి 10 నుంచి 20 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. హైదరాబాద్, పరిసర ప్రాంతాలలో ఆకాశం మేఘావృతమై ఉంటుంది కానీ వర్షం పడే అవకాశం లేదు. గరిష్ట ఉష్ణోగ్రతలు 37.8 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 26 డిగ్రీల వరకు ఉండే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
— IMD_Metcentrehyd (@metcentrehyd) May 23, 2022