Weather Latest Update: తెలుగు రాష్ట్రాల్లో విరగకాస్తున్న ఎండలు, ఈ జిల్లాల్లో మరింత ఘోరంగా ఉష్ణోగ్రతలు!
పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతూ 40 డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి 43 డిగ్రీల సెంటీగ్రేడ్ పైన రాష్ట్రంలో అనేక చోట్ల నమోదు అయ్యే అవకాశం ఉంది.
![Weather Latest Update: తెలుగు రాష్ట్రాల్లో విరగకాస్తున్న ఎండలు, ఈ జిల్లాల్లో మరింత ఘోరంగా ఉష్ణోగ్రతలు! Weather in Telangana Andhrapradesh Hyderabad on 13 April 2023 Summer updates latest news here Weather Latest Update: తెలుగు రాష్ట్రాల్లో విరగకాస్తున్న ఎండలు, ఈ జిల్లాల్లో మరింత ఘోరంగా ఉష్ణోగ్రతలు!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/13/47687120a0c046fe6ab2b691abae56e41681350071301234_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ఈ రోజు ద్రోణి తూర్పు విదర్భ నుండి, మరాత్వాడ, ఇంటీరియర్ కర్ణాటక మీదుగా కోస్తా కర్ణాటక వరకు సగటు సముద్రం మట్టంకి 0.9 కిలో మీటర్ల ఎత్తు వద్ద కొనసాగుతుంది. దిగువ స్థాయిలో గాలులు ఆగ్నేయ దిశ నుండి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీచుచున్నాయి. ఈ ప్రభావంతో ఈరోజు, రేపు తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం ఉండే అవకాశం ఉంది మరియు ఎల్లుండి తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడా వచ్చే అవకాశం ఉంది.
పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతూ 40 డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి 43 డిగ్రీల సెంటీగ్రేడ్ పైన రాష్ట్రంలో అనేక చోట్ల నమోదు అయ్యే అవకాశం ఉంది. GHMC, చుట్టు ప్రక్కల జిల్లాలలో 40 డిగ్రీల సెల్సియస్ కన్నా తక్కువగా నమోదు అయ్యే అవకాశం ఉంది.
హైదరాబాద్ లో ఇలా
‘‘హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘాలు పట్టి ఉంటుంది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో సాయంత్రం లేదా రాత్రి సమయంలో ఉరుములతో కూడిన మేఘాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 38 డిగ్రీలు, 24 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఆగ్నేయ దిశ నుంచి గాలులు గంటకు 6 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొ్న్నారు. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 37.7 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 23.9 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 40 శాతం నమోదైంది.
ఏపీలో ఎండలు ఇలా
నేటి నుంచి ఏపీలో ఎండల తీవ్రత మరింత పెరగనుంది. ఒక పక్కన ఆంధ్రాలో ప్రస్తుతం 41-42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు చూస్తూ వచ్చాము. కానీ మరో మూడు రోజుల పాటు ఇది కాస్త 42 నుంచి 43 డిగ్రీల మధ్యలో ఉండనుంది. కారణం ఏమిటి అంటే పొడిగాలులు ఉత్తర భారత దేశం నుంచి నేరుగా మన వైపుగా వీస్తున్నాయి కాబట్టి వేడి తీవ్రత ఎక్కువవ్వనుంది. విశాఖ నగరంలో కూడ నేటి నుంచి మరో మూడు రోజులు వేడిగా ఉంటుంది. అనకాపల్లి, కాకినాడ, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మణ్యం, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ఏలూరు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంధ్యాల, కడప, తూర్పు అనంతపురం, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో వేడి 42 నుంచి 43 మధ్యలో ఉండనుంది.
ఆంధ్రప్రదేశ్ లో విరగ కాస్తోంది. ప్రస్తుతానికి పొడి గాలులు కోస్తా ప్రాంతం మీదుగా వీస్తోంది కాబట్టి వేడి అనేది చాలా ఎక్కువగా ఉంది. ప్రకాశం జిల్లాలోని గుండ్లపల్లిలో అత్యధికంగా 43.2 డిగ్రీలు నమోదయ్యింది. అలాగే నంద్యాల, కడప, చిత్తూరు జిల్లాలో కూడ 43 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలకు మించి నమోదయ్యింది.
ఈ ఏడాది ఎల్ నినో పరిస్థితులు - ఐఎండీ
ఈ ఏడాది వర్షాకాలం సాధారణంగా ఉండనుందని, నైరుతీ రుతుపవనాల వల్ల వర్షాలు సాధారణంగా ఉంటాయని మంగళవారం భారతీయ వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మృత్యుంజయ మహాపాత్ర తెలిపారు. వర్షాకాలం మధ్యలో ఎల్ నినో పరిస్థితులు ఉత్పన్నం అయ్యే అవకాశాలు ఉన్నాయని, దాని వల్ల రుతుపవనాలపై ప్రభావం పడుతుందని, సీజన్ రెండో భాగంలో వర్షాలు తక్కువగా కురిసే అవకాశాలు ఉన్నట్లు ఐఎండీ డైరెక్టర్ జనరల్ తెలిపారు. 2023లో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు 96 శాతం వర్షపాతం ఉంటుందని ఐఎండీ చెప్పింది. జూలైలో ఎల్ నినో పరిస్థితులు పెరిగే అవకాశాలు ఉన్నాయి.
ఎల్ నినో వల్ల పసిఫిక్ సముద్ర ఉపరితలం వేడిగా మారుతుంది. దీని వల్ల ప్రపంచవ్యాప్తంగా వాతావరణాల్లో మార్పు సంభవిస్తుంది. ఇండియాపై కూడా ఈ ప్రభావం ఉంటుంది. ఒకవేళ నైరుతి రుతుపవనాల సమయంలో ఎల్‌నినో ఉంటే, అప్పుడు వర్షాలపై ప్రభావం పడే అవకాశం ఉంది. దీని వల్ల రైతులకు మరిన్ని కష్టాలు ఉంటాయి. ఎల్‌నినో వల్ల సాధారణంగా భారత్ లో వర్షపాతం తక్కువగా నమోదు అవుతుంది. దీంతో కరవు పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉంటుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)