Andhra Pradesh: ఏపీలో స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, తెలంగాణతో కలిసి డ్రగ్స్‌పై యుద్ధం - అనగాని సత్యప్రసాద్
Andhra Pradesh Drugs Issue: ఏపీలో డ్రగ్స్ మహమ్మారిని అరికట్టేందుకు మంత్రుల సబ్ కమిటీ ఏర్పాటు చేసినట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. తెలంగాణలో కలిసి డ్రగ్స్ నిర్మూలిస్తామన్నారు.
Anagani Satya Prasad | హైదరాబాద్: రాష్ట్ర విభజనతో తలెత్తిన సమస్యలతో పాటు రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న ఇతర సమస్యల పరిష్కారం కోసం భేటీలో చర్చించినట్లు సీఎంల భేటీ అనంతరం మంత్రులు తెలిపారు. తెలంగాణ ఏర్పాటయ్యాక డ్రగ్స్ ఫ్రీ స్టేట్ గా చూడాలని చర్యలు తీసుకుంటున్నారని, ఏపీలో ప్రస్తుతం డ్రగ్స్ మహమ్మారి ప్రజల్ని పట్టి పీడిస్తోందని ఏపీ మంత్రులు పేర్కొన్నారు. సీఎంల భేటీ అనంతరం ఉమ్మడి ప్రెస్ మీట్‌లో ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ.. నీళ్లు, నిధులు, నియామకాలు అనే పోరాటంతో తెలంగాణ రాష్ట్ర ఏర్పడిందన్నారు. మరోవైపు ఏపీ అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
ఏపీ నుంచి తెలంగాణకు డ్రగ్స్.. !
‘రెండు రాష్ట్రాలను పట్టి పీడిస్తోన్న సమస్య డ్రగ్స్. ఏపీలో డ్రగ్స్, గంజాయి తమ రాష్ట్రానికి సరఫరా అవుతోందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. ఏపీలో ఇదివరకే ఆరుగురు మంత్రులతో డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపేందుకు సబ్ కమిటీ ఏర్పాటు చేశాం. 8వ తరగతి చదువుతున్న విద్యార్థుల స్కూల్ బ్యాగుల్లో సైతం గంజాయి దొరుకుతోంది. తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్ కల్చర్ ను రూపుమాపుదాం. డ్రగ్స్ ను పూర్తిగా అరికట్టి ఏపీ, తెలంగాణ యువతను ఈ డ్రగ్స్ నుంచి విముక్తి చేయాలనుకుంటున్నాం. జాయింట్ ఆపరేషన్ గా రెండు తెలుగు రాష్ట్రాలు ఆ సమస్యపై ఉమ్మడిగా ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉంది. రెండు వారాల్లో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సూచన మేరకు ఉన్నతాధికారులు డ్రగ్స్ అరికట్టడంపై తీసుకోవాల్సిన చర్యలపై విధివిధానాలు రూపొదించడానికి నిర్ణయం తీసుకున్నట్లు’ ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్ సీఎంల భేటీలో తీసుకున్న నిర్ణయాలను వివరించారు.
విభజన సమస్యలపై పరిష్కారం కోసం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కొన్ని రోజుల కిందట లేఖ రాశారు. ఈ లేఖపై స్పందించిన తెలంగాణ సీఎం రేవంత్ భేటీ కోసం ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. జులై 6న సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ వేదికగా భేటీకి నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. ఈ క్రమంలో చంద్రబాబుతో పాటు ఏపీ మంత్రులు అనగాని సత్యప్రసాద్, కందుల దుర్గేష్, బీసీ జనార్ధన్ రెడ్డి, ఏపీ సీఎస్ తెలంగాణకు వచ్చారు. హైదరాబాద్ లోని ప్రజా భవన్ లో ఏపీ, తెలంగాణ సీఎంలు భేటీ అయి గత పదేళ్లలో పరిష్కారం కాని సమస్యలపై చర్చించారు. విద్యుత్ బకాయిలు, ఏపీ ఫైనాన్స్ కార్పొరేషన్, ఏపికి ప్రభుత్వ భవనాలు ఆస్తులు, విభజన చట్టంలో షెడ్యూల్ 9,10 లలో పేర్కొన్న పలు అంశాలపై చర్చ జరిగింది.
విభజన సమస్యల పరిష్కారం కోసం మొదట ఉన్నతాధికారుల కమిటీ ఏర్పాటు చేసి సమస్య పరిష్కారం కోసం ప్రయత్నించనున్నారు. అయినా పరిష్కారం కాని అంశాలపై రెండు రాష్ట్రాల మంత్రులతో కమిటీ ఏర్పాటు చేసి పరిష్కరించనున్నారు. అయినా పరిష్కారం దొరకని అంశాలపై రెండు రాష్ట్రాల సీఎంలు మరోసారి ప్రత్యేకంగా సమావేశమై ఏం చేయాలన్నది డిసైడ్ చేస్తారని సీఎంల భేటీ అనంతరం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో భట్టి విక్రమార్క, ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు.
Also Read: ప్రజా భవన్‌లో ముగిసిన సీఎంల భేటీ - సమస్యల పరిష్కారానికి చంద్రబాబు, రేవంత్ కీలక నిర్ణయం