Vizag Steel Plant Protest: ఏపీ భవన్ వద్ద విశాఖ ఉక్కు కార్మికులు ధర్నా... మద్దతు తెలిపిన వైసీపీ, టీడీపీ..అన్ని పార్టీలతో కలిసి పనిచేస్తామన్న విజయసాయి రెడ్డి
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఢిల్లీలో కార్మికులు చేస్తున్న ధర్నా రెండో రోజుకు చేరింది. ఏపీ భవన్ వద్ద నిర్వహించిన ధర్నాలో టీడీపీ, వైసీపీ ఎంపీలు పాల్గొన్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు ఢిల్లీలో వరుసగా రెండో రోజు ధర్నా నిర్వహిస్తున్నారు. ఏపీ భవన్ వద్ద చేపట్టిన ధర్నాకు వైసీపీ, టీడీపీ ఎంపీలు మద్దతు తెలిపారు. ఆంధ్రా భవన్ ఆవరణలో మంగళవారం ఉక్కు కార్మికులు చేపట్టిన ఆందోళనకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్‌ఆర్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు వి.విజయసాయిరెడ్డి ఉక్కు కార్మికులకు భరోసా కల్పించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉక్కు కార్మిక సంఘాలు తలపెట్టిన ఈ ఉద్యమాన్ని ఒక ఏడాది పాటు ఇలానే కొనసాగిస్తే సార్వత్రిక ఎన్నికలకు గడువు దగ్గర పడుతుందన్నారు. ఎన్నికలు ముందు పెట్టుకుని ఏ ప్రభుత్వం కూడా ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకోదని విజయసాయి రెడ్డి అన్నారు. ఒక ఏడాది పాటు ఉద్యమం కొనసాగించాలంటే అందరు సంఘటితంగా పోరాడాలని ఆయన పిలుపు ఇచ్చారు.
అవసరమైతే కోర్టులను ఆశ్రయించి ఈ ప్రక్రియపై స్టే తీసుకురావడానికి ప్రయత్నించాలని విజయసాయిరెడ్డి అన్నారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించాలన్న కేంద్రం నిర్ణయంలోనే అనేక అవకతవకలు ఉన్నాయన్నారు. కాబట్టి న్యాయస్థానాల్ని ఆశ్రయించి ప్రైవేటీకరణ ప్రక్రియను నిలిపివేయడానికి ప్రయత్నాలు చేయాలని కోరారు. ఉక్కు కార్మికుల పోరాటంలో తమ వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖ ఉక్కు కార్మికులు, ఉద్యోగుల ప్రయోజనాలు కాపాడడానికి కృషి చేస్తున్నారని తెలిపారు. ఉక్కు కార్మికుల పోరాటానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సహాయ, సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని హామీ ఇచ్చారు.
స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, విశాఖ ఉక్కును కాపాడాలని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉక్కు పరిరక్షణ సమితి నినాదాలతో హోరెత్తించింది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని నిరసిస్తూ ఢిల్లీలో ధర్నా చేస్తున్న స్టీల్‌ప్లాంట్ ఉద్యోగులకు టీడీపీ ఎంపీలు కేశినేని నాని, కింజరాపు రామ్మోహన్‌నాయుడు మద్దతు పలికారు. ఏపీ భవన్ వద్దకు వెళ్లిన ఎంపీలు వారికి సంఘీభావం తెలిపారు. ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయం చాలా బాధాకరమని తెలిపారు. ఈ నిర్ణయంతో దాదాపు 32 వేల మంది ఉద్యోగులు, వారి కుటుంబాలు ఇబ్బందులు పడతారని అన్నారు. కార్మికులు, ప్రజల సంపద విశాఖ ఉక్కు అన్న కేశినేని నాని... ప్రైవేటీకరణ చేస్తామంటే ఊరుకునేది లేదన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు టీడీపీ పూర్తి వ్యతిరేకమని చెప్పారు. పార్లమెంట్‌లోనూ తమ పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు. ఈ విషయంలో అన్ని పార్టీలతో కలిసి టీడీపీ ముందుకెళ్తుందన్నారు.
Also Read: Amarraja Issue : అమరరాజా వెళ్లడం కాదు ...ప్రభుత్వమే దండం పెట్టి పొమ్మంటోంది : సజ్జల