Nara Lokesh News: లోకేశ్ ఫ్లెక్సీని పప్పు ముద్దలతో కొట్టిన వైసీపీ నేతలు - ఎన్టీఆర్ విగ్రహం ముందే నిరసన
Vizag News: అమర్నాథ్ ను అవమానించారో సరిగ్గా అదే ప్రదేశంలో వైసీపీ కార్యకర్తలు లోకేష్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి దానికి పప్పు అభిషేకం చేశారు.
Visakhapatnam News: రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఫ్లెక్సీ పై కోడిగుడ్లతో దాడి చేసిన టీడీపీ నేతలకు వైసీపీ యువజన విభాగం నాయకులు కౌంటర్ ఇచ్చారు. ఎక్కడైతే అమర్నాథ్ ను అవమానించారో సరిగ్గా అదే ప్రదేశంలో వైసీపీ కార్యకర్తలు లోకేష్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి దానికి పప్పు అభిషేకం చేశారు. పప్పు ముద్దలతో లోకేష్ ఫ్లెక్సీకి కొడుతూ ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడు ఆళ్ళ శివ గణేష్ ఆధ్వర్యంలో గురువారం మధ్యాహ్నం స్థానిక సెవెన్ హిల్స్ ఆసుపత్రి సమీపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఈ ఆందోళన కార్యక్రమం జరిగింది. పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు, లోకేష్, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వైసీపీపై, మంత్రి అమర్నాథ్ పై చేస్తున్న విమర్శలను నిరసిస్తూ నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా ఆళ్ల శివ గణేష్ మాట్లాడుతూ మంత్రి అమర్నాథ్ పై విమర్శలు చేసే స్థాయి లోకేష్ లేదని అన్నారు. కనీసం ఎమ్మెల్సీ కూడా కానీ లోకేష్ ను చంద్రబాబు నాయుడు మంత్రినీ చేశాడని, ఆ తర్వాత ఎమ్మెల్యేగా పోటీ చేసి లోకేష్ ఓడిపోయాడని, ఈ విధంగా బ్యాక్ డోర్ లో వచ్చి మంత్రి అయినది లోకేష్ ఒక్కడేనని అన్నారు. అమర్నాథ్ కుటుంబం దశాబ్దాల కాలంగా రాజకీయాల్లో ఉందని కార్పొరేటర్ గా పనిచేసి,ఆ తర్వాత ఎమ్మెల్యేగా విజయం సాధించి మంత్రి అయిన అమర్నాథ్ ను విమర్శించే హక్కు ఈ పప్పు ముద్దకు లేదని గణేష్ విమర్శించారు.
వైసీపీ మహిళా విభాగం కన్వీనర్ కృపా జ్యోతి మాట్లాడుతూ లోకేష్ కు పప్పు తింటే మంచి బుద్ధి వస్తుందని అన్నారు. వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే అవగాహన లేకుండా లోకేష్ మాట్లాడుతున్నారని అన్నారు. లోకేష్ శంఖారావం ఇప్పటికే అట్టర్ ప్లాప్ అయిందని, రానున్న ఎన్నికల్లో వైసీపీ విజయ దుందుభి మోగిస్తుందని చెప్పారు. లోకేష్ ఇప్పటికైనా తన పిచ్చి ప్రేలాపనను మానుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
వైసీపీ ఎస్సీ విభాగం కన్వీనర్ బోని శివరామకృష్ణ మాట్లాడుతూ మాట్లాడుతూ భవిష్యత్తులో మంత్రి అమర్నాథ్ పై ఎటువంటి విమర్శలు చేసిన తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఇప్పటికైనా లోకేష్ బుద్ధి తెచ్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పివి సురేష్, యువజన నాయకులు మెంటి మహేష్, జార్జ్ నాని, విద్యార్థి నాయకులు, రేలా జానకిరామ్, జీలకర్ర నాగేంద్ర, కనకల ఈశ్వర్, యువజన నాయకులు గోవిందరాజు, షేక్ అబ్దుల్ బాసిద్, యువజన విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.