YS Jagan Narsipatnam Visit: వైద్యకళాశాలలు ప్రైవేటీకరిస్తే పేదవాడికి వైద్యం ఎలా అందుతుంది? నర్సీపట్నం వేదికగా వైఎస్ జగన్ ధ్వజం
YS Jagan Narsipatnam Visit:పేదలకు వైద్యం దూరం చేసేందుకు చంద్రబాబు నాయుడు మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్నారని జగన్ ఆరోపించారు. నర్సీపట్నం టూర్‌లో ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

YS Jagan Narsipatnam Visit: ఆంధ్రప్రదేశ్‌లో మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు కుట్ర జరుగుతోందని వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు. అనకాపల్లి జిల్లాలోని నర్సీపట్నంలో నిర్మాణంలో ఉన్న వైద్య కళాశాలను సందర్శించారు. విశాఖపట్నం నుంచి భారీ ర్యాలీతో నర్సీపట్నం చేరుకున్నారు. ఆయన దారి పొడవున వైసీపీ శ్రేణులు స్వాగతం పలికారు. జోరు వానలో కూడా అందర్నీ పలకరిస్తూ ముందుకు సాగారు జగన్. వైద్య కళాశాలను పరిశీలించిన తర్వాత మీడియాతో మాట్లాడిన జగన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
మెడికల్ కాలేజీ విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై జగన్ సంచలన ఆరోపణలు చేశారు. ప్రజారోగ్యం, రాష్ట్ర పిల్లల భవిష్యత్‌కు ప్రమాదకరమని విమర్శించారు. కీలకమైన వైద్య కళాశాలలను ప్రైవేటీకరణకు కుట్రలు చేస్తున్న చంద్రబాబు పేదవారికి అన్యాయం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. "అంతా ప్రైవేట్ పరం చేస్తే పేదవారికి వైద్యం ఎలా అందుతుంది?". అని ప్రశ్నించారు.
గతంలో వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని అందుబాటులోకి తీసుకొచ్చిందని గుర్తు చేశారు. ప్రైవేట్ ఆస్పత్రులలో ఛార్జీలు అధికంగా ఉంటాయని, వాటిని తట్టుకోవడం పేదల వల్ల కావడం లేదనే జిల్లాకో మెడికల్ కాలేజీ తీసుకొచ్చామన్నారు. పేదలకు ఆరోగ్యాన్ని అందించే ఆధునిక దేవాలయాలను ప్రైవేటు వ్యక్తులకు అమ్మేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. "ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఎందుకు ప్రైవేట్ పరం చేస్తున్నారు? పేదవారికి ఎందుకు అన్యాయం చేస్తున్నారు?" అని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
వైసీపీ హయాంలో పేదవాళ్ల కోసం రాష్ట్రవ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీలను అందుబాటులోకి తెచ్చామని, ఇందులో ఐదు మెడికల్ కాలేజీల్లో 2023-24 విద్యాసంవత్సరంలోనే క్లాసులు కూడా ప్రారంభమయ్యాయని జగన్ గుర్తు చేశారు. విజయనగరం, పాడేరు మెడికల్ కాలేజీల్లో తరగతులు ప్రారంభమయ్యాయని వెల్లడించారు.
నర్సీపట్నం ఉదాహరణ: రూ. 500 కోట్ల ఖర్చు వృథా?
నర్సీపట్నం మెడికల్ కాలేజీ నిర్మాణం గురించి కూడా వైఎస్ జగన్ ప్రత్యేకంగా మాట్లాడారు. తమ హయాంలో నర్సీపట్నంలో 52 ఎకరాల్లో మెడికల్ కాలేజీ నిర్మాణం చేపట్టామని, కోవిడ్ సంక్షోభం సమయంలో ఎక్కడా రాజీ పడకుండానే రూ. 500 కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు. ఈ కాలేజీ పూర్తయి ఉంటే, ఏకంగా 600 పడకలతో పేదలకు ఉచిత వైద్యం అందేదన్నారు. దీంతోపాటు ఏటా 150 మెడికల్ సీట్లు అందుబాటులోకి వచ్చి పేదలు చదువుకనేందుకు అవకాశం ఏర్పడేదన్నారు. అలాంటి మెడికల్ కాలేజీలను చంద్రబాబు అమ్మేస్తున్నారని జగన్ తీవ్ర ఆరోపణ చేశారు.
లక్ష కోట్ల అమరావతి Vs రూ. 5 వేల కోట్ల వైద్యం
జగన్ తన ప్రసంగంలో ప్రస్తుత ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు, ప్రాధాన్యతలపై కూడా విమర్శలు చేశారు. అమరావతిలో లక్ష ఎకరాలు సేకరించి, రోడ్లు, డ్రైనేజీలు, కరెంట్, నీళ్లు ఇవ్వడానికి ఏకంగా వేల కోట్లు ఖర్చు పెడుతున్నారని జగన్ పేర్కొన్నారు. ఇప్పుడు మరికొంత భూసమీకరణకు సిద్ధమవుతున్నారని మండిపడ్డారు. అమరావతి కోసం లక్ష కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధపడే చంద్రబాబు, కోట్లాది మందికి వైద్యం, విద్య అందించే మెడికల్ కాలేజీల కోసం ఏడాదికి వెయ్యి కోట్లు ఖర్చు చేయలేరా? అని జగన్ ప్రశ్నించారు. అంత చిన్న మొత్తాన్ని ఖర్చు పెట్టలేక, ఉచిత వైద్యం అందించే ఈ కళాశాలలను ప్రైవేట్ పరం చేస్తున్నారా? అని నిలదీశారు.
స్పీకర్‌కు స్ట్రాంగ్ కౌంటర్: జీవో నెంబర్ 204 ఎక్కడుంది?
మెడికల్ కాలేజీల నిర్మాణంపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు తప్పుడు ప్రచారం చేస్తున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం ఎంతవరకు ధర్మం అని జగన్ నిలదీశారు. "ఈ మెడికల్ కాలేజీలకు జీవో ఎక్కడుందని అడుగుతారా? ఇదిగో జీవో నెంబర్ 204," అని ఆ జీవో పత్రాన్ని జగన్ మీడియాకు చూపించారు.
జీవో నెంబర్ 204 లేదని అబద్ధాలు చెప్పినందుకు అయ్యన్న పాత్రుడు స్పీకర్ పదవిలో ఉండేందుకే అర్హులేనా అని జగన్ ప్రశ్నించారు. తప్పుడు మాటలు చెబుతూ చంద్రబాబుతో చేతులు కలిపినందుకు స్పీకర్ తలదించుకోవాలి అని జగన్ ఘాటుగా విమర్శలు చేశారు. 2024 జూన్‌లో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే సెప్టెంబర్ 3న మొత్తం 17 మెడికల్ కాలేజీల నిర్మాణాలు ఆపేయాలని మెమో కూడా ఇచ్చారని జగన్ ఆరోపించారు. అప్పటి నుంచే కుట్ర జరిగిందని అన్నారు.
కోటి సంతకాల ప్రజాఉద్యమం
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం చేయబోతున్నట్టు వైఎస్ జగన్ ప్రకటించారు.'కోటి సంతకాల సేకరణ' కార్యక్రమాన్ని చేపట్టబోతున్నట్టు వెల్లడించారు.
• అక్టోబర్ 10 నుంచి నవంబర్ 22 వరకు రచ్చబండ కార్యక్రమాలు సంతకాల సేకరణ జరుగుతున్నాయన్నారు.
• అక్టోబర్ 28న నియోజకవర్గ కేంద్రాల్లో పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహిస్తామన్నారు.
• నవంబర్ 12న జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు జరుగుతాయని ప్రకటించారు.
• నవంబర్ 23న నియోజకవర్గాల నుంచి సేకరించిన సంతకాల పత్రాలను జిల్లా కేంద్రాలకు తరలిస్తమన్నారు.
• నవంబర్ 24న అన్ని జిల్లా కేంద్రాల నుంచి పత్రాలను పార్టీ కేంద్ర కార్యాలయానికి తరలించే కార్యక్రమం చేపడతామని తెలిపారు. అక్కడి నుంచి వాటిని గవర్నర్‌కు అందజేస్తామని తెలిపారు.





















