Visakhapatnam News Today Telugu: అరకులో ఎయిర్ పోర్ట్ కావాలన్న వైసీపీ ఎంపీ ప్రతిపాదన, ముందు హెలికాప్టర్లు దిగే ఏర్పాట్లు చేద్దామన్న కేంద్రమంత్రి
Araku MP : అరకులో ఎయిర్ పోర్ట్ కావాలని వైసీపీ ఎంపీ తనూజా రాణి కేంద్రమంత్రికి రిక్వస్ట్ చేశారు. డైరెక్ట్‌గా విమానాలు వచ్చే ఏర్పాటు ఉంటే పర్యాటకుల సంఖ్య పెరుగుతుందని అన్నారు.

Araku MP Thanuja Rani: ఏపీలోని ప్రముఖ పర్యాటక కేంద్రం అరకులో ఎయిర్‌పోర్టు ఏర్పాటు ప్రతిపాదన పరిశీలనలో ఉందని అరకు ఎంపీ డాక్టర్ తనూజా రాణి అన్నారు. అరకులో పాస్ పోర్ట్ సేవా కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆమె మాట్లాడారు. ఇటీవల కాలంలో గిరిజన ప్రాంతం గణనీయంగా అభివృద్ధి చెందుతుందని వైసీపీ ఎంపీ తనూజా రాణి వివరించారు.
గతంలో సింగిల్ లైన్ రోడ్డు ఉండేదని, ఇప్పుడు అరకులో నాలుగు లైన్లుగా మారిందని తనూజా రాణి అన్నారు. సింగిల్ లైన్ రైల్వే ట్రాక్ ప్రస్తుతం డబుల్ ట్రాక్‌గా మారుతోందని గుర్తు చేశారు. తాజాగా పాస్ పోర్ట్ సేవా కేంద్రం కూడా వచ్చింది. అలాగే త్వరలో ఎయిర్‌పోర్ట్ కూడా వస్తుందని అన్నారు. ఈ విషయంపై ఇప్పటికే సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖకి ప్రతిపాదన తీసుకు వెళ్లినట్టు ఆమె చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అరకులో ఎయిర్‌పోర్ట్ త్వరితగతిన వస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
Also Read: గ్రామపంచాయతీ క్లస్టర్ వ్యవస్ధలో మార్పులకు పవన్ నిర్ణయం - కీలక సూచనలు చేసిన బీజేపీ
ముందు హెలికాప్టర్ దిగే ఏర్పాట్లు చేద్దాం : విమాన యాన శాఖ మంత్రి
దీనిపై విమానాయన శాఖ స్పందించినట్టు సమాచారం. ముందుగా హెలికాప్టర్స్ వచ్చేలా ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి. కొన్ని హెలిపాడ్లు ఏర్పాటు చేస్తే అరకు వ్యాలీకి హెలికాప్టర్ల ద్వారా టూరిస్టులు రాకపోకలు సాగించే అవకాశం ఉంటుందని విమానయాన శాఖ భావిస్తున్నట్టు తెలుస్తోంది.
ఏపీలో కొత్తగా 7 ఎయిర్ పోర్ట్‌లు
ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ఏడు ఎయిర్పోర్ట్‌లు నిర్మించబోతోంది కేంద్రం. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఏపీలో 7, తెలంగాణలో 3 ఎయిర్‌పోర్టులు నిర్మించాలనేది కేంద్రం ఆలోచన. వాటిలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో కుప్పం, దగదర్తి, ఒంగోలు, తాడేపల్లిగూడెం, నాగార్జున సాగర్, తుని -అన్నవరం, శ్రీకాకుళం విమానాశ్రయాలను నిర్మించాలని కేంద్రం నిశ్చయించింది.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సైతం దీనిపై ఇప్పటికే సమీక్షలు జరిపారు. శ్రీకాకుళం ఎయిర్పోర్ట్‌కు సంబంధించి ఫీజిబిలిటీ ఆల్రెడీ పూర్తయింది. దీనిని రెండు దశల్లో 1383 ఎకరాల్లో నిర్మించాలని నిర్ణయించారు. దానితోపాటు మిగిలిన ఎయిర్ పోర్టుల నిర్మాణానికి సంబంధించిన భూమిని కూడా ఏపీ ప్రభుత్వం గుర్తించింది. ఇప్పుడు వాటితో పాటే అరకులోనూ ఒక విమానాశ్రయాన్ని నిర్మించాలని అక్కడి ఎంపీ డాక్టర్ తనూజా రాణి ప్రతిపాదిస్తున్నారు. మరి దీనిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏమంటాయో చూడాలి.
Also Read: ఎంవోయూలు చేసుకోకుండానే దావోస్ టూర్ ముగింపు - చంద్రబాబు, లోకేష్ వ్యూహం మార్చారా ?





















