Vizianagaram Train Accident Live Updates: విజయనగరం చేరుకున్న సీఎం జగన్- ప్రమాదం జరిగిన తీరు వివరించిన అధికారులు
విజయనగరం సమీపంలో జరిగిన రైలు ప్రమాదంపై లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
LIVE
Background
విజయనగరం సమీపంలో జరిగిన రైలు ప్రమాద దుర్ఘటనపై కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ముఖ్యమంత్రి జగన్‌కు ఫోన్ చేశారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే తీసుకున్న చర్యలను ముఖ్యమంత్రి తెలియజేశారు. సహాయ బృందాలను వెంటనే ఘటనాస్థలానికి పంపించామని, క్షతగాత్రులకు వైద్యం అందించేందుకు సత్వర చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఘటనాస్థలానికి మంత్రి బొత్స సత్యన్నారాయణను పంపించామని, స్థానిక కలెక్టర్, ఎస్పీకూడా అక్కడే ఉండి సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారన్నారు. క్షతగాత్రులకు సరైన వైద్య సేవలు అందించడంపై అధికారులు దృష్టిపెట్టారని, వీరిని సమీపంలో ఉన్న ఆస్పత్రులకు పంపిస్తున్నారని, ఆమేరకు ఆయా ఆస్పత్రుల్లో అత్యాధునిక వైద్య సేవలు అందించేలా చర్యలు కూడా తీసుకున్నామని చెప్పారు.
రైలు ప్రమాద ఘటనలో మరణించిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు అన్నిరకాల చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశాలు జారీచేశారు. మృతుల్లో ఏపీకి చెందిన వారికి రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడ్డవారికి రూ.2 లక్షల సహాయం అందించాలన్నారు. మరణించన వారిలో ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఉంటే వారికి కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున, తీవ్రంగా గాయపడ్డవారికి రూ 50వేల చొప్పున సహాయం అందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు
మాటలకు అందని విషాదం. ఒడిశాలో ప్రమాదం గురుతులు ఇంకా మరువక ముందే మరో ఘోర ప్రమాదం జరిగింది. సిగ్నలింగ్ వ్యవస్థలో లోపాలు కారణంగా ఘోరం జరిగిపోయింది. విజయనగరం జిల్లా కొత్తవలస మండలంలో జరిగిన రైలు ప్రమాదంలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. వందల మంది గాయపడ్డారు.
కంటకాపల్లి- అలమండ మధ్య రాత్రి 7 గంటల సమయంలో దారణం ప్రమాదం జరిగింది. ట్రాక్‌పై ఉన్న ప్యాసింజర్ రైలును వెనుకనుంచి వచ్చిన ట్రైన్ బలంగా ఢీ కొట్టింది. విశాఖ నుంచి బయల్దేరిన విశాఖపట్నం పలాస రైలును విశాఖ పట్నం రాయగడ ట్రైన్ ఢీ కొట్టింది. దీంతో పక్కనే ఉన్న గూడ్స్ ట్రైన్‌పైకి ఈ బోగీలు దూసుకెళ్లాయి. ఒడిశాలోని బాలేశ్వర్‌లో కూడా ఇలాంటి ప్రమాదమే జరిగింది.
విజయనగరం వద్ద జరిగిన ప్రమాదంలో మొత్తంగా ఏడు బోగీలు నుజ్జునుజ్జు అయ్యాయి. పట్టాలు పైకి లేచాయి. దాని కింద నుంచి రైలు బోగీలు దూసుకెళ్లాయి. ఇలా అక్కడ జరిగిన ప్రమాదం చూస్తే ఒళ్లు జలదరించక మానదు. ప్రమాదం జరిగిన తర్వాత అక్కడ సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. రాత్రి వేళ కావడంతో చలితో సహాయక చర్యలు వేగంగా సాగలేదు. ఉదయం నుంచి వాటి స్పీడ్ పెంచారు.
కొత్తవలస వద్ద జరిగిన దుర్ఘటనలో ఇప్పటికి 14 మంది మృతి చెందిననట్టు అధికారులు గుర్తించారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రమాదంలో మూడు బోగీలు నుజ్జు నుజ్జు అయ్యాయి. వంద మందికిపైగా గాయపడ్డారు. బోగీలు తీస్తున్న కొద్దీ మృతుల సంఖ్య పెరిగొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
రెండు ప్యాసింజర్‌రైళ్లలో సుమారు 1500 మంది ప్రయాణిస్తున్నట్టు రైలు అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రమాదంలో పలాస వెళ్లే రైలులో ఉన్న గార్డు, రాయగడ రైలులో ఉన్న లోకోపైలెట్ మృతి చెందినట్టు గుర్తించారు. ప్రమాదం జరిగిన కాసేపటికి ఘటనాస్థలానికి చేరుకున్న ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. ముందు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. బోగీలను కట్ చేసి అందులో ఇరుక్కుపోయిన వారిని అతి కష్టమ్మీద బయడటకు తీసి ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డవారంతా విజయనగరం ప్రభుత్వాసుపత్రితోపాటు విశాఖలోని కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. ఘటనా స్థలంలో మంత్రి బొత్స సత్యనారాయణ, జిల్లా అధికారులు ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.