Bengal Tigers: విజయనగరం ప్రజలను హడలెత్తిస్తున్న బెంగాల్ టైగర్స్, రెండు పులులూ జత కలిస్తే !
ఒడిశాలోని అడవుల నుంచి అల్లూరి సీతారామరాజు జిల్లా మీదుగా విజయనగరం జిల్లాలోకి అడుగుపెట్టి ఉంటాయని భావిస్తున్నారు. కొద్దిరోజులుగా ఎక్కడా పశువులపై దాడులు లేవు.
ఉమ్మడి విజయనగరం జిల్లాలో గత మూడు దశాబ్దాల్లో ఎప్పుడూ పెద్దపులి సంచరించిన దాఖలాలు లేవు. అయితే, గత ఏడాది ఏప్రిల్ నెలలో తొలిసారిగా రాయల్ బెంగాల్ టైగర్ జిల్లాలో కనిపించింది. అదే సమయంలో పొరుగున అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో కూడా పులి దాడులు జరిగాయి. విశాఖ`విజయనగరం సరిహద్దు జిల్లాల్లోనూ పశువులపై దాడి చేశాయి. తొలుత ఇది ఒకే పులి అని భావించినా.. తర్వాత విజయనగరం జిల్లాలో కదలికలను బట్టి రెండు పులులు ఉన్నాయని అటవీ శాఖ అధికారులు ఒక నిర్ధారణకు వచ్చారు. ఒడిశాలోని అడవుల నుంచి అల్లూరి సీతారామరాజు జిల్లా మీదుగా విజయనగరం జిల్లాలోకి అడుగుపెట్టి ఉంటాయని భావిస్తున్నారు. కొద్దిరోజులుగా ఎక్కడా పశువులపై దాడులు లేవు. తాజాగా మంగళవారం రాత్రి విజయనగరం జిల్లా బొండపల్లి మండలం గొల్లుపాలెం పొల్లాల్లో ఆవుపై దాడి చేయడంతో గ్రామస్థులు భయాందోళన చెందుతున్నారు.
పులులు రెండూ ఒకటికొకటి ఎదురుపడలేదు
రాయల్ బెంగాల్ టైగర్లలో ఒకటి ఆడది.. మరొకటి మగది. చెరోవైపు సంచరిస్తూ ఎనిమిది నెలలుగా ఉమ్మడి విజయనగరం జిల్లా ప్రజలను హడలెత్తిస్తున్నాయి. కళ్లాల వద్ద ఆవులు, దూడలను హతమార్చుతూ ఆకలి తీర్చుకుంటున్నాయి. ఇప్పటి వరకూ మనుషులపై దాడి చేసిన సందర్భాలు లేవు. దీనివల్లే కాస్తయినా ప్రజలు ఊపిరి పీల్చుకోగలుగుతున్నారు. ఇన్నాళ్లూ పులులు రెండూ ఒకటికొకటి ఎదురుపడలేదని అధికారులు భావిస్తున్నారు. కానీ, ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే.. అవి రెండూ ఒక చోటకు చేరాయని అనుకుంటున్నారు. కొద్దిరోజులుగా వీటి అలికిడి లేకపోవడం, ఇది పులులు జతకట్టే కాలం కూడా కావడంతో అవి సంభోగించే అవకాశం ఉందని ఆటవీ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదే గానీ జరిగితే.. మూడున్నర నెలల కాలంలోనే రెం. డు లేదా మూడు పిల్లలకు జన్మనిస్తాయి. ప్రపంచంలో అత్యంత వేగంగా అంతరించిపోతున్న స్థితిలో ఉన్న ప్రాణుల్లో రాయల్ బెంగాల్ టైగర్లు కూడా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో వీటి కలయిక జరిగి, పిల్లలకు జన్మనిస్తే జిల్లాకు విశేషమే. రాయల్ బెంగాల్ టైగర్లు మన రాష్ట్రంలోని నల్లమల అటవీ ప్రాంతంలోనే ఎక్కువగా ఉన్నాయి. విశాల మైన శ్రీశైలం అభయారణ్యంలో ఒక్కో పులి 30 నుంచి 40 కిలోమీటర్ల పరిధిలో సంచరిస్తుంటాయి. ఆ ప్రాంతాన్ని తమ రాజ్యంగా భావిస్తుంటాయి.
ఒడిశా నుంచి వచ్చిందా?
పులి తొలుత కనిపించిన ఆండ్ర ఫారెస్టు ఏరియా ఒడిశా సరిహద్దుకు సమీపంలోనే ఉంది. ఇది అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అనంత గిరి మండలానికి సరిహద్దు ప్రాంతమే. దీని తర్వాత అరకు అటవీ ప్రాంతం దాటితే ఒడిశా సరిహద్దు ఉంది. తాటిపూడి, ఆండ్ర జలాశయాల చుట్టూ విస్తరించి ఉన్న అటవీ ప్రాంతంలోనే గత ఎనిమిది నెలల్లో ఎక్కువ సార్లు పెద్దపులి సంచారం కనిపించింది. ప్రస్తుతం రెండు పులులు అనంతగిరి మండల సరిహద్దు గ్రామా లైన మూలపాడు, గూడెం, బొండపల్లి మండలంలోని పాత పనసలపాడు, మెంటాడ మండలంలోని పణుకు వానివలన గ్రామాల పరిసరాల్లోనే ఉంటున్నాయని అటవీ అధికారులు చెబుతున్నారు. ఆ ప్రాంతమంతా నాలుగైదు. కిలోమీటర్ల విస్తీర్ణంలోనే ఉంది. అక్కడే రెండు పులులు ఏకమయ్యే అవకాశం ఉందని అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారు. గర్భధారణ జరిగితే వంద నుంచి 110 రోజుల్లోనే పిల్లలకు జన్మనిస్తాయి.
కొత్త సంవత్సరంలో పులి అలికిడి తక్కువగానే ఉంది. దీంతో ఇటు ప్రజలు, అటు అటవీ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. మరలా ఇప్పుడు బొండపల్లి మండలంలో పశువును పొట్టన పెట్టుకోవడంతో కలవరం మొదలైంది. జిల్లాలో ఇప్పటి వరకూ పులి దాడితో 42 పశువులు మృతి చెందాయి. పశువులను నష్టపోయిన బాధిత రైతులకు ప్రభుత్వం రూ.7.42 లక్షలను పరిహారంగా అందజేసింది. ప్రాణనష్టం మరింత పెరగక ముందే అటవీ అధికారులు పులులను పట్టుకుని అరణ్యంలోకి తరలించాలని గ్రామస్థులు కోరుతున్నారు.