Vizag Steel News: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణలో కీలక ట్విస్టు! స్వయంగా ప్రకటించిన కేంద్ర ఉక్కు మంత్రి
విశాఖపట్నం పర్యటనలో ఉన్న కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగన్ సింగ్ కులస్తే విశాఖ పోర్టు కళావాణి స్టేడియంలో రోజ్ గార్ మేళాలో పాల్గొన్నారు.
కేంద్ర మంత్రి ఫగన్ సింహ్ కులస్తే కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ విషయంలో ప్రస్తుతానికి ముందుకు వెళ్లడం లేదని అన్నారు. ఇప్పటికిప్పుడు ప్రైవేటు సంస్థలకు అమ్మే ప్రక్రియ చేయడం లేదని స్పష్టత ఇచ్చారు. ప్రస్తుతం ఆర్ఐఎన్ఎల్‌ను బలోపేతం చేస్తున్నామని చెప్పారు. స్టీల్ ప్లాంటులో కొన్ని కొత్త విభాగాలు ప్రారంభిస్తున్నామని చెప్పారు. ముడి సరకు పెంపొందించే ప్రక్రియపై ఫోకస్ చేసినట్లుగా చెప్పారు. పూర్తిస్థాయి సామర్థ్యం మేరకు ప్లాంట్ పని చేసే ప్రక్రియ జరుగుతోందని అన్నారు. దీనిపై ఆర్‌ఐఎన్‌ఎల్ యాజమాన్యం, కార్మిక సంఘాలతో చర్చిస్తాం. ఆర్‌ఐఎన్‌ఎల్ అధికారులతో భేటీ అవుతున్నామని చెప్పారు. వారితో మరిన్ని విషయాలు చర్చిస్తామని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం బిడ్ వేయడానికి ప్రయత్నిస్తుండడం ఒక బూటకం మాత్రమేనని కొట్టిపారేశారు. బిడ్డింగ్‌లో పాల్గొనడం వారి పరిధిలోని విషయం అని అన్నారు.
ప్రస్తుతం విశాఖపట్నం పర్యటనలో ఉన్న కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగన్ సింహ్ కులస్తే విశాఖ పోర్టు కళావాణి స్టేడియంలో రోజ్ గార్ మేళాలో పాల్గొన్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తుందనే అంశం బయటికి వచ్చినప్పటి నుంచి ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రైవేటీకరణను బీజేపీ తప్ప అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో తాజాగా తెలంగాణ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్‌ను టేకోవర్ చేసుకునే నిర్ణయం కూడా తీసుకుంది. అందుకు సంబంధించి సింగరేణి కేలోరీస్ అధికారులు విశాఖ ప్లాంటును రెండు రోజుల క్రితం సందర్శించి, ప్లాంటు డైరెక్టర్లతో చర్చలు కూడా జరిపారు. సాధ్యాసాధ్యాల పరిశీలన కూడా చేశారు.
స్టీల్ ప్లాంటుకు మూలధన వనరులు సమకూర్చేందు కోసం బిడ్ లను ఆహ్వానిస్తున్నట్లుగా నోటిఫికేషన్ విడుదల అయిన సంగతి తెలిసిందే. విశాఖ ఉక్కు కర్మాగారంలో భాగస్వామిగా చేరేందుకు ఉక్కు, ముడి ఉక్కు తయారీపై ఆసక్తి ఉన్న సంస్థల నుంచి వ్యాపార ప్రతిపాదనలను ఆహ్వానిస్తున్నట్లు స్టీల్ ప్లాంటు యాజమాన్యం మార్చి 27న ప్రకటించింది. దీంతో విశాఖ ఉక్కు ప్రైవేటు పరం అవుతుండడాన్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ‘ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్’ బిడ్ దాఖలు చేయాలని నిర్ణయించింది. ఈ పరిస్థితుల్లో కేంద్ర ఉక్కుశాఖ సహాయ మంత్రి విశాఖపట్నం పర్యటనకు రావడం, తాజా సంచలన ప్రకటన చేయడం చర్చనీయాంశం అయింది.