Vizag IIPE: పెట్రోలియం వర్సిటీకి సొంత క్యాంపస్, 157.36 ఎకరాలు కేటాయించిన ప్రభుత్వం
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీకి (IIPE ) చెందిన సొంత భూమి సమస్య పరిష్కారమైంది. విభజన చట్టం ప్రకారం ఏపీకి కేటాయించిన సంస్థల్లో IIPE అత్యంత ప్రతిష్టాత్మక మైంది.
గత 6 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీకి (IIPE ) చెందిన సొంత భూమి సమస్య పరిష్కారమైంది. విశాఖ జిల్లాలోని సబ్బవరం మండలం వంగలి గ్రామం వద్ద ఈ సంస్థకు సొంతంగా క్యాంపస్, శాశ్వత భవనం నిర్మించుకోవడానికి 157.36 ఎకరాల భూమిని కేటాయిస్తూ విశాఖ కలెక్టర్ మల్లిఖార్జున్ ఆదేశాలు జారీ చేశారు. విభజన చట్టం ప్రకారం ఏపీకి కేటాయించిన సంస్థల్లో IIPE అత్యంత ప్రతిష్టాత్మక మైంది. కానీ ఆ సంస్థను ఏపీకి మంజూరు చెయ్యడానికి కేంద్రం జాప్యం చెయ్యడంతో 2016లో గానీ పెట్రోలియం యూనివర్సిటీ ఏపీకి రాలేదు.
6 ఏళ్లుగా ఏయూ లోనే క్లాసుల నిర్వహణ:
సంస్థను ఇచ్చినప్పటికీ సొంత స్థలం కేటాయించక పోవడంతో ఆంధ్రా యూనివర్సిటీలోనే గత 6 ఏళ్లుగా పెట్రోలియం వర్సిటీ విద్యార్థులకు క్లాసులు, శిక్షణా తరగతులు నిర్వహిస్తూ వచ్చారు. నిజానికి సొంత క్యాంపస్ నిర్మించుకునేదాకా మూడేళ్లు తమ ప్రాంగణంలో క్లాసులు నిర్వహించుకునేందుకు ఆంధ్రా యూనివర్సిటీతో ఎంవోయూ చేసుకుంది IIPE . కానీ అది స్థల కేటాయింపులో జాప్యం వల్ల 6ఏళ్ళపాటు కొనసాగింది. అయితే ప్రస్తుతం ప్రభుత్వం కేటాయించిన 157. 36 ఎకరాల భూమిలో సొంత క్యాంపస్ తో పాటు శాశ్వత భవన నిర్మాణం కూడా పెట్రోలియం యూనివర్సిటీ చేపట్టనుంది.
మా వల్లే ఇది సాధ్యమైంది: బీజేపీ ఎంపీ
తమ వల్లే పెట్రోలియం యూనివర్సిటీకి సొంత స్థలం లభించిందని బీజేపీ చెబుతోంది. ఆ మేరకు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఒక లేఖను కూడా విడుదల చేశారు. తన విశాఖ పర్యటనలో భాగంగా విశాఖ కలెక్టర్ ను కలిసి సమస్యపై వివరించాననీ ,10 రోజుల్లో ఈ సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన కలెక్టర్ మల్లిఖార్జున్ తన మాట నిలబెట్టుకున్నారని జీవీఎల్ తెలిపారు. సమస్య పరిష్కారానికి చొరవ తీసుకున్నందుకు తనకు IIPE సంస్థ డైరెక్టర్ VSRK ప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారని జీవీఎల్ పేర్కొన్నారు. ఏదేమైనా గత ఆరేళ్లుగా పెండింగ్ లో ఉన్న భూ కేటాయింపు అమలు జరగడంతో పెట్రోలియం యూనివర్సిటీకి సొంత బిల్డింగ్ నిర్మాణానికి ఓ దారి దొరికినట్లయింది.
Also Read: ఏపీ ఉద్యోగులకు జగన్ సర్కార్ బిగ్ షాక్! డిమాండ్లు పట్టించుకోకుండానే వరుస జీవోలు