Vizag Venkateswara Swamy Temple: విశాఖ శ్రీవారి ఆలయంలో మహాసంప్రోక్షణ - నేటితో ముగియనున్న హోమాలు, కార్యక్రమాలు
Visakhapatnam Venkateswara Swamy Temple: విశాఖలో టీటీడీ నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మార్చి 18న ప్రారంభమైన సంప్రోక్షణ కార్యక్రమాలు నేడు ముగియనున్నాయి.
Vizag Venkateswara Swamy Temple: విశాఖపట్నంలో టీటీడీ నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ మహాసంప్రోక్షణ నేడు నిర్వహిస్తున్నారు. మార్చి 18న ప్రారంభమైన సంప్రోక్షణ కార్యక్రమాలు నేడు ముగియనున్నాయి. బుధవారం నిర్వహించ తలపెట్టిన మహా సంప్రోక్షణ కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకు విగ్రహ ప్రతిష్ట, మహాసంప్రోక్షణ నిర్వహిస్తారు.
ఉదయం నుంచే కార్యక్రమాలు..
విశాఖలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో బుధవారం ఉదయం 5.30 గంటల నుంచి 8 గంటల వరకు కుంభారాధన, నివేదన,హోమం, మహాపూర్ణాహుతి నిర్వహించారు. ఆపై ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు కుంభాలను, ప్రధాన దేవతా విగ్రహాలను ప్రదక్షిణగా ఆలయంలోకి తీసుకొచ్చి ఉదయం 9.50 గంటల నుంచి 10.20 సమయంలో వృషభ లగ్నంలో మహాసంప్రోక్షణ శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. మహా సంప్రోక్షణ అనంతరం అర్చక బహుమానం పూర్తి చేస్తారు. బుధవారం సాయంత్రం 3 గంటల నుండి 4.15 గంటల వరకు శ్రీవారి కల్యాణోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు. ఆలయంలో ధ్వజారోహణం చేపడతారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి (TTD Chairman YV Subba Reddy) ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. రాత్రి 7.30 గంటల తరువాత భక్తులకు సర్వదర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు చేశారు.
మార్చి 18న సంప్రోక్షణ ప్రారంభం..
మార్చి 18న విశాఖలోని శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో సంప్రోక్షణ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఆరోజు రాత్రి రాత్రి 7 నుం 10 గంటల వరకు ఆచార్య ఋత్విక్ వరణం, మృత్సంగ్రహణం, అంకురార్పణ నిర్వహించారు.
మార్చి 19న ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు యగాశాలవాస్తు, పంచగవ్య్రపాశనం, రక్షాబంధనం, అకల్మషహోమం, అక్షిమోచనం, బింబశుద్ధి, పంచగవ్యాధివాసం చేశారు. సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటల మధ్య అగ్నిప్రతిష్ట, కుంభావాహనం, కుంభారాధన, కలశస్థాపన, హోమం నిర్వహించారు
మార్చి 20న హోమం, యాగశాల కార్యక్రమాలు జరిగాయి. మార్చి 21న ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 వరకు హోమం, జలాధివాసం, రత్నన్యాసం, విమాన కలశస్థాపన, బింబస్థాపన చేయగా.. సాయంత్రం 6 నుండి హోమం, యాగశాల కార్యక్రమాలు పూర్తి చేశారు.
నిన్న (మార్చి 22న) ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు బింబవాస్తు, నవకలశ స్నపనం, చతుర్దశ కలశ స్నపనం నిర్వహించారు. అదే రోజు సాయంత్రం 4 గంటల నుంచి 5.30 వరకు మహాశాంతి తిరుమంజనం నిర్వహించారు. మంగళవారం రాత్రి 8 గంటల నుంచి 10.30 వరకు రక్షాబంధనం, కుంభారాధనం, శయనాధివాసం, హౌత్రం, నివేదన, సర్వదేవతార్చన, హోమం, యాగశాల కార్యక్రమాలు పూర్తి చేశారు.