Vizag Traffic: విశాఖలో నేవీ డే 2022: పెద్ద ఎత్తున ట్రాఫిక్ మళ్లింపులు - కొత్త దారులు ఇవీ
బీచ్ రోడ్డులోని ఎన్టీఆర్ విగ్రహం నుండి పార్క్ హోటల్ జంక్షన్ వరకు నౌకాదళ యుద్ద విన్యాసాలు జరుపుతున్న సందర్భంగా సదరు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్రపతి వస్తున్నారు.
భారత నౌకాదళము నేవీ డే-2022 సందర్భంగా విశాఖపట్నం నగరంలో డిసెంబరు 04 నాడు రామకృష్ణ బీచ్ రోడ్ లో జరిగే కార్యక్రమాల నేపథ్యంలో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో పోలీసులు నిబంధనలు విధించారు. బీచ్ రోడ్డులోని ఎన్టీఆర్ విగ్రహం నుండి పార్క్ హోటల్ జంక్షన్ వరకు నౌకాదళ యుద్ద విన్యాసాలు జరుపుతున్న సందర్భంగా సదరు కార్యక్రమానికి ముఖ్య అతిధిగా భారత దేశ రాష్ట్రపతి, పలువురు ప్రముఖులు విశాఖ నగరానికి వస్తున్నారు. ఈ సందర్భంగా ఆ రోజు మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు సాధారణ వాహనదారులు కొన్ని సూచనలు పాటించాలని పోలీసులు సూచనలు చేశారు.
* కలెక్టరేట్ జంక్షన్ నుండి నేవల్ కోస్టల్ బ్యాటరి, నేవల్ కోస్టల్ బ్యాటరి నుండి పార్క్ హోటల్ వరకు, సిరిపురం జంక్షన్ నుండి చినవాల్తేరు మీదుగా పార్క్ హోటల్ వరకు, సిరిపురం జంక్షన్ నుండి ఆలిండియా రేడియో జంక్షన్ మీదుగా ఎన్టీఆర్ విగ్రహం వరకు, ఆలిండియా రేడియో జంక్షన్ నుండి పాండురంగాపురం డౌన్ వరకు, నేవల్ కాంటీన్ జంక్షన్ నుండి నావెల్ కోస్ట్ బ్యాటరి వరకు, పందిమెట్ట జంక్షన్ నుండి Novotel హోటల్ వరకు, సెంచరీ క్లబ్ నుండి novotel హోటల్ వరకు పాసులు లేని వాహనములు అనుమతించరు. కాబట్టి, ప్రజలు పోలీస్ వారికి సహకరించి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రయాణించాలని కోరారు.
* MVP వైపు నుండి వచ్చే వాహనదారులు VUDA పార్క్ ప్రక్కన గల MGM గ్రౌండ్, ఉడా పార్క్, జయశ్రీ సై కృష్ణ టావెల్స్ పార్కింగ్ ప్లేస్, క్రికెట్ నెట్ ప్రాక్టీస్ గ్రౌండ్, కురుపాం టవర్స్ దగ్గర గల విశాఖ ఫంక్షన్ హాల్, కామత్ హోటల్ వద్ద గల RR construction లలో తమ వాహనములను పార్క్ చేసుకొని పార్క్ హోటల్ మీదుగా బీచ్ రోడ్ కి రాకుండా బీచ్ లో ఉన్న enclosures లోనికి కాలి నడకన వెళ్ళాలి. పార్క్ హోటల్ నుండి ఎటువంటి వాహనాలను బీచ్ రోడ్ లోకి అనుమతించరు.
* జగదాంబ, దండుబజార్ వైపు నుండి వచ్చే వాహనదారులు కలెక్టర్ ఆఫీస్ జంక్షన్, జిల్లా పరిషత్ జంక్షన్ మీదుగా ఆంధ్ర యూనివర్సిటీ మెడికల్ కాలేజీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ గ్రౌండ్, AMCOSA గ్రౌండ్, AMCOSA ఎదురుగా గల జూబిలీ హోం గ్రౌండ్‌లలో తమ వాహనాలను పార్క్ చేసుకొని కలెక్టర్ ఆఫీస్ జంక్షన్, నావెల్ కోస్ట్ బ్యాటరీ జంక్షన్ మీదుగా బీచ్ రోడ్ కి రాకుండా బీచ్ లో ఉన్న enclosures లోనికి కాలి నడకన వెళ్ళాలి.
* సందర్శకుల రద్దీని బట్టి ఋషికొండ జంక్షన్, జోడుగుల్లపాలెం జంక్షన్, కురుపాం జంక్షన్, MVP Double రోడ్, మద్దిలపాలెం జంక్షన్, టైకూన్ జంక్షన్, అసీలుమెట్ట జంక్షన్, గొల్లలపాలెం జంక్షన్, పందిమెట్ట జంక్షన్, జగదంబ, టౌన్ కొత్త రోడ్, కలెక్టర్ ఆఫీస్ జంక్షన్, జిల్లాపరిషత్ జంక్షన్ల వద్ద మళ్ళింపు చర్యలు ఉంటాయి.
* నేవల్ కోస్టల్ బ్యాటరీ నుండి పార్క్ హోటల్ వరకు నివసిస్తున్న వారు పోలీస్ వారికీ సహకరించి ఈ కార్యక్రమమును దిగ్విజయం చేయాల్సిందిగా పోలీసులు సూచించారు. అత్యవసరమైన పరిస్థితులలో తప్ప ఆ రోజును ముఖ్యంగా మధ్యాహ్నం 12 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు వాహన రాకపోకలు జరుపరాదు.
* కలెక్టరేట్ జంక్షన్, C.R. రెడ్డి సర్కిల్ వద్ద ఇతర వాహనములు రాకుండా కటాఫ్ పాయింట్స్ ఉన్నందున నేవల్ కోస్టల్ బ్యాటరీ నుండి పార్క్ హోటల్ వరకు నివసిస్తున్న వారు పోలీస్ వారికి సహకరించి, ఈ తేదీ, సమయాల్లో వారి రాకపోకలను ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
* భీమిలి వైపు నుండి బీచ్ రోడ్ గుండా పార్క్ హోటల్ వైపు వచ్చు సిటీ బస్సులు కామత్ హోటల్ నుండి కుడి వైపుగా వెళ్లి ఉషోదయ జంక్షన్, A.S. రాజా కాలేజీ, MVP Double రోడ్ మీదుగా ద్వారకా బస్సు స్టేషన్ కు చేరుకోవాలి.
* ప్రజలు పైసూచనలు పాటించి పోలీసులకు సహకరించాలని, నేవీ డే కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని విన్నవించారు. అలాగే డిసెంబరు 2 నాడు ఆర్కే బీచ్ దగ్గర పూర్తి స్థాయి రిహర్సల్స్ జరుగుతాయి కాబట్టి, ప్రజలు, సందర్శకులు గమనించి ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని విశాఖ పోలీసులు కోరారు.