Artist Laxmi: భర్తకు చెప్పకుండా వెళ్లిపోయిన ఆర్టిస్ట్, పోలీసులు టెన్షన్ టెన్షన్ - చివరికి ఏమైందంటే
Artist Laxmi: భర్తకు చెప్పకుండా హైదారాబాద్ లో ఉన్న కుమారుడి వద్దకు వెళ్లింది విశాఖ కళాకారిణి లక్ష్మి. అది తెలియని భర్త.. పోలీసులతో నగరమంతా జెల్లడ పట్టించాడు. ప్రస్తుతం ఈ వార్త చర్చనీయాంశంగా మారింది.
Artist Laxmi: విశాఖ బీచ్ లో అదృశ్యమై బెంగళూర్ లో తేలిన సాయిప్రియ ఘటన మరువక ముందే అలాంటి తరహాలోనే మరో ఘటన చోటు చేసుకుంది. అయితే ఈ ఘటనలో ఓ ప్రముఖ కళాకారిణి భర్తకు చెప్పకుండా హైదరాబాద్ లో ఉంటున్న తన కుమారుడి వద్దకు వెళ్లింది. ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. విశాఖపట్నం నగరంలో ప్రముఖ కళాకారిణి, స్వరరంజని సంస్థ అధ్యక్షురాలు జవ్వాది లక్ష్మి(54) అదృశ్యమైన ఘటనతో పోలీసులు పరుగులు తీశారు. నగరంలో ఇటీవల వరుసగా జరుగుతున్న నేర ఘటనలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆమె ఆచూకీ తెలుసుకునేందుకు పలు విధాలుగా ప్రయత్నించారు. చివరకు ఆమె క్షేమంగా ఉన్నట్లు తెలుసుకున్నారు. ఇంట్లో భర్తకు చెప్పకుండా హైదరాబాద్ వెళ్లినట్లు శనివారం రాత్రి నిర్దారణ అయింది.
శుక్రవారం సన్మానం.. అనంతరం అదృశ్యం!
విశాఖ ద్వారకానగర్ లోని పౌర గ్రంథాలయంలో శుక్రవారం రాత్రి జవ్వాది లక్ష్మిని ఓ సంస్థ ఘనంగా సన్మానించింది. కార్యక్రమం అనంతరం రాత్రి 8.45 గంటల సమయంలో మరో కళాకారిణి చంద్రకళతో కలిసి షేర్ ఆటోలో ఇంటికి బయలుదేరారు. చంద్రకళ ఆదర్శ నగర్ కూడలిలో దిగిపోయారు. అనంతరం ఆటో మధురవాడ వైపు వెళ్లింది. కానీ లక్ష్మి ఇంటికి చేరలేదు. శుక్రవారం సాయంత్రం బయటకు వచ్చే సమయంలో భర్త వేణుగోపాల్ ఇంట్లో లేకపోవడంతో ఆయన సెల్ కు ఆమె వాట్సాప్ లో మాటల సందేశం పంపారు. మరో మహిళతో కలిసి ఆటోలో వెళ్తున్నానని 9.30 గంటలకల్లా వచ్చేస్తానని అందులో పేర్కొన్నారు. ఆమె వస్తుందన్న ఉద్దేశంతో భర్త తలుపులకు గడియ కూడా పెట్టలేదు. ఆమె కోసం ఎదురు చూస్తూ.. నిద్రలోకి జారుకున్నారు. అర్ధరాత్రి 12 గంటలకు మెలకువ వచ్చి ఇంట్లో చుడగా భార్య కనపడకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
కిడ్నాప్ చేశారేమోనన్న అనుమానంతో..
హైదరాబాద్ లో ఉన్న తన కుమారుడు సాయిరాం సాగర్ కు, స్వరరంజని సభ్యులకు ఫోన్ చేశారు. ఆమె శుక్రవారం రాత్రి వెళ్లిన తర్వాత తమతో మాట్లాడలేదని చెప్పారు. ఆమెతో ప్రయాణించిన చంద్రకళతో మాట్లాడగా.. ఆదర్శ నగర్ లో తాను దిగిపోయాయని చెప్పారు. లక్ష్మీ ఫోన్ స్విచ్ఛాప్ చేసి ఉండడంతో ఎవరైనా కిడ్నాప్ చేశారేమోనన్న అనుమానంతో వేణగోపాల్ శనివారం ఉదయం పీఎం పాలెం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు రంగంలోకి దిగారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన సీపీ శ్రీకాంత్ పోలీసు అధికారుల అందరితో సమావేశం ఏర్పాటు చేశారు. నగరంలోని పలు నిఘా కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. ఆమె ప్రయాణించిన ఆటోను గుర్తించినా దానిపై రిజిస్ట్రేషన్ నెంబర్ కనపడలేదు. ఇతర మార్గాల్లో ఆమె ఆచూకీ తెలుసుకోవడానికి ప్రయత్నించారు. పీఎం పాలెం సీఐ రామకృష్ణ ఆధ్వర్యంలో పలు ప్రాంతాల్లో గాలించారు.
హైదరాబాద్ లోని కుమారుడి ఇంటికి వెళ్లిన లక్ష్మి..!
లక్ష్మి కనిపించడం లేదన్న వార్తను వేణుగోపాల్ హైదరాబాద్ లో ఉంటున్న కుమారుడుకి తెలియజేశారు. దీంతో అతను విశాఖకు బయలుదేరారు. శనివారం రాత్రి 9.30 గంటల సమయంలో విజయవాడ వచ్చే సరికి లక్ష్మి హైదరాబాద్ లోని కుమారునికి ఇంటికి వచ్చినట్లు సమాచారం అందింది. ఆమె క్షేమంగా ఉందని తెలియడంతో పోలీసులు, కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. విశాఖలో భర్తకు చెప్పకుండా.. కుమారునికి కూడా ముందుగా చెప్పకుండా హైదరాబాద్ ఎందుకు వెళ్తారన్న అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.