Visakhapatnam Constituency News: విశాఖలో ఇటు నుంచి ఝాన్షీ- అటు నుంచి ఎవరు? కూటమి అభ్యర్థిపై ఉత్కంఠ!
విశాఖ పార్లమెంటు స్థానంపై ప్రధాన పార్టీలు దృష్టి సారించాయి. కచ్చితంగా విజయం సాధించే అభ్యర్థినే బరిలోకి దించేందుకు సామాజిక సమీకరణాల లెక్కలు వేస్తున్నాయి.
Vizag News: విశాఖపట్నం(Visakhapatnam ) పార్లమెంట్ అభ్యర్థిగా అధికార పార్టీ వైఎస్‌ఆర్‌సీపీ(YSRCP) మాజీ ఎంపీ, ప్రస్తుత రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana) భార్య ఝాన్సీ లక్ష్మి(Jhansi Lakshmi) బరిలోకి దింపింది. ఇప్పుడు ప్రతిపక్షాల నుంచి అభ్యర్థిగా ఎవరు బరిలోకి దిగుతారన్న చర్చ నియోజకవర్గంలో మొదలైంది. వచ్చే ఎన్నికల్లో జనసేన-టిడిపి కూటమి అభ్యర్థిగా బలమైన వ్యక్తిని బరిలోకి దించేందుకు ప్రతిపక్షాలు సన్నాహాలు చేస్తున్నాయి. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మాజీ ఎంపీ ఎంవివిఎస్ మూర్తి మనవడు, నటుడు నందమూరి బాలకృష్ణ అల్లుడు శ్రీ భరత్ బరిలోకి దిగారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ విశాఖపట్నం స్థానానికి ఇన్చార్జిగా ఆయనే కొనసాగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయనే బరిలోకి దిగుతారా..? లేకపోతే మరో వ్యక్తికి అవకాశం కల్పిస్తారా..? అన్నది తేలాల్సి ఉంది.
ఉమ్మడి అభ్యర్థిపై స్పష్టత కరువు..
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి -జనసేన కూటమిగా పోటీ చేయబోతున్నాయి. ఇప్పటికే ఆయా పార్టీలు పోటీ చేయబోయే స్థానాలపై కసరత్తు చేస్తున్నాయి. విశాఖపట్నం పార్లమెంట్ స్థానంపైన ఇరు పార్టీలు దృష్టి సారించాయి. తెలుగుదేశం పార్టీ నుంచి గడిచిన ఎన్నికల్లో పోటీ చేసిన భరత్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పార్లమెంటు నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటనలు చేస్తున్నారు. విభిన్నమైన కార్యక్రమాలను నిర్వహిస్తూ భరత్ తానే పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తానని చెప్పకనే చెబుతున్నారు.
జనసేన నుంచి కూడా పోటీ చేసేందుకు ఆశావహులు సిద్ధమవుతున్నారు. గడిచిన ఎన్నికల్లో జనసేన నుంచి విశాఖపట్నం పార్లమెంటు స్థానానికి పోటీ చేయాలని భావించి తుది వరకు ఆ దిశగా ప్రయత్నాలు సాగించిన పల్సస్ సంస్థ అధినేత గేదెల శ్రీనుబాబు ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ మేరకు హామీ ఇస్తే పార్టీలో చేరేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. విశాఖ పార్లమెంటు స్థానాన్ని తెలుగుదేశం పార్టీ జనసేనకు ఇస్తుందా..? లేదా.? అన్నది తేలాల్సి ఉంది.
బిజెపి నుంచి ఇద్దరు ఆశావహులు..
భారతీయ జనతా పార్టీ కూడా ఇక్కడ పోటీ చేసేందుకు సిద్ధమవుతోంది. తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉంటే ఈ స్థానాన్ని కచ్చితంగా బిజెపి ఆశిస్తుంది. తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉంటే వచ్చే ఎన్నికల్లో నుంచి బరిలోకి దిగేందుకు మాజీ కేంద్రమంత్రి, గతంలో ఇక్కడ నుంచి ఎంపీగా గెలిచిన పురందేశ్వరి సిద్ధమవుతున్నారు. బిజెపిలో ఇదే స్థానం నుంచి బరిలోకి దిగేందుకు మరో వ్యక్తి కూడా సన్నాహాలు చేసుకుంటున్నారు. బిజెపి రాజ్యసభ సభ్యులు జివిఎల్ నరసింహారావు వచ్చే ఎన్నికల్లో విశాఖ లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దిగి అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తున్నారు. గడిచిన కొన్నాళ్లుగా విశాఖ కేంద్రంగానే ఆయన తన కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. సంక్రాంతి సంబరాలను కూడా నిర్వహిస్తున్నారు. జివిఎల్ విశాఖ పార్లమెంట్ స్థానం నుంచి బరిలోకి దిగడం ఖాయమని చెబుతున్నారు. టీడీపీతో పొత్తు ఉన్నా.. లేకపోయినా జివిఎల్ బరిలోకి దిగడం కన్ఫామ్ అని ఆ పార్టీ శ్రేణుల మాట.
విశాఖ పార్లమెంటు స్థానం పరిధిలో సుమారు లక్షకుపైగా నార్త్ ఇండియన్స్ ఉండడం బిజెపికి కలిసి వస్తుందని అంచనా వేస్తోందా పార్టీ. అందుకే జివిఎల్ వంటి వారు ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. విశాఖపట్నం నుంచి సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ బరిలోకి దిగుతారని చెబుతున్నారు. ఈయన కొద్ది రోజుల కిందటే జై ఆంధ్ర పార్టీని ఏర్పాటు చేశారు. ఆ పార్టీ తరఫున బరిలోకి దిగే అవకాశం కనిపిస్తోంది. టీం జెడి పేరుతో క్షేత్రస్థాయిలో ఆయన అనుచరులు పెద్ద ఎత్తున కార్యకలాపాలు నిర్వర్తిస్తున్నారు.
టిడిపి లెక్కలు వేరేలా..?
వచ్చే ఎన్నికల్లో ఎక్కువ ఎంపీ స్థానాలను చేసుకోవడమే లక్ష్యంగా ప్రణాళికలు వేస్తున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విశాఖపట్నం స్థానంపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు చెబుతున్నారు. వైసీపీ సామాజిక సమీకరణలను పరిగణలోకి తీసుకొని ఎక్కువ ఓటర్లు ఉన్న బీసీ సామాజిక వర్గానికి చెందిన బొత్స ఝాన్సీ లక్ష్మికి టికెట్ కేటాయించింది. వైసీపీ సమీకరణలను ధీటుగా ఎదుర్కొనేందుకు ఆయన అభ్యర్థిని బరిలోకి దించేందుకు చంద్రబాబు నాయుడు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఇన్చార్జిగా ఉన్న భరత్ కాదు అనుకుంటే గాజువాక నియోజకవర్గ ఇన్చార్జిగా, పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న పల్లా శ్రీనివాసరావును బరిలోకి దించాలని అధిష్టానం నివసిస్తోంది. సామ్యుడిగా, స్థానికుడిగా, బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా మంచి పేరు ఉన్న పల్లా శ్రీనివాసరావు అయితే సులభంగా ఈ స్థానం నుంచి విజయం సాధించే అవకాశం ఉంటుందని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. మరి తెలుగుదేశం పార్టీ ఏ దిశగా నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.