Visakhapatnam: ఎవరు గొప్ప అంటూ చెలరేగిన ఘర్షణ.. విద్యార్థి ప్రాణాల్ని బలిగొన్న కొట్లాట.. విశాఖలో దారుణం
ఇద్దరు విద్యార్థుల మధ్య నేను గొప్పంటే నేను గొప్ప అంటూ.. చెలరేగిన ఘర్షణ చివరికి ఒకరి ప్రాణాలను బలిగొంది. ఈ ఘటన ఏపీలోని విశాఖపట్నం జిల్లా అక్కయ్యపాలెంలో చోటుచేసుకుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లా అక్కయ్యపాలెంలో విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు విద్యార్థుల మధ్య జరిగిన గొడవ చినికిచినికి గాలివానగా మారి కొట్లాటకు దారి తీసింది. ఈ ఘటనలో జశ్వంత్ అనే విద్యార్థి మృతి చెందాడు. పోలీసులు, పాఠశాల యాజమాన్యం వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక ఎయిడెడ్ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న జశ్వంత్ (13) అనే విద్యార్థి రోజులానే పాఠశాలకు వెళ్లాడు. అక్కడ తన తోటి విద్యార్థులతో ఎవరు గొప్ప అనే విషయంలో గొడవ జరిగింది. అది కాస్తా పెరిగి ఎవరు బాగా కొట్టగలరనేంత వరకు వెళ్లింది. దీంతో ఇక్కడ కాదు స్కూల్ బయట చూసుకుందాం అంటూ వారు హెచ్చరించుకున్నారు.
Also Read: గుప్త నిధుల పేరుతో మోసం.. చివరకు హత్య.. నెల్లూరులో దారుణం..
పాఠశాల నుంచి ఇంటికి వెళ్లేప్పుడు మరోసారి..
పాఠశాల అయిపోయి ఇంటికి వెళ్లే సమయంలో వీరు మరోసారి గొడవకు దిగారు. దీంతో అవతలి వ్యక్తి జశ్వంత్‌పై దాడి చేశాడు. దీంతో జశ్వంత్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. తోటి విద్యార్థులు వెంటనే పాఠశాలు యాజమాన్యానికి సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న యాజమాన్యం.. జశ్వంత్‌ను వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే జశ్వంత్ మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
Also Read: నిజామాబాద్‌లో యువతిపై గ్యాంగ్.. ఆరుగురు అరెస్టు
మరో ఇద్దరు విద్యార్థులు ఉన్నారు..
గొడవ జరిగే సమయంలో మరో ఇద్దరు విద్యార్థులు ఘటనా స్థలిలోనే ఉన్నారని పోలీసులు తెలిపారు. వారి నుంచి మరిన్ని వివరాలు సేకరిస్తున్నామని చెప్పారు. విద్యార్థుల మధ్య జరిగిన కొట్లాట కారణంగానే తమ కొడుకు మరణించాడని జశ్వంత్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి ముగ్గురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ ఆస్పత్రికి తరలించారు.
ఏసీపీ హర్షితచంద్ర, ట్రాఫిక్ ఏడీసీపీ ఆదినారాయణ తదితరులు విద్యార్థుల మధ్య కొట్లాట జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. అలాగే ఘటనా స్థలి చుట్టుపక్కల ప్రాంతాల్లోని సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన దృశ్యాలను పరిశీలించారు. విద్యార్థుల ప్రవర్తన తీరుపై ప్రిన్సిపల్, టీచర్ల నుంచి వివరాలు సేకరిస్తున్నారు.
Also Read: పని మనిషిపై వంట మనిషి దాష్టీకం.. బలవంతంగా రూంలోకి లాక్కెళ్లి రేప్