Visakha Baby: కన్నతల్లి దారుణం - శిశువు ఏడుపుతో టాయ్‌లెట్ డోర్ ఓపెన్ చేసి ప్యాసింజర్స్ షాక్
Mother Leaves Her Child In Train Toilet: రైలులో హృదయ విదారక ఘటన జరిగింది. పేగు తెంచుకుని అప్పుడే పుట్టిన బిడ్డను టాయ్‌లెట్‌లో వదిలి వెళ్లిన ఘటన విశాఖపట్నం జిల్లాలో చోటుచేసుకుంది.
Woman Leaves Child In Bokaro Express Toilet: ఓ మహిళ అమ్మతనానికే మాయని మచ్చ తెచ్చింది. పేగు తెంచుకుని అప్పుడే పుట్టిన బిడ్డను టాయ్‌లెట్‌లో వదిలి వెళ్లిన ఘటన విశాఖపట్నం జిల్లాలో చోటుచేసుకుంది. ధన్‌బాద్ - అల్లీపి (Dhanbad-Allepy Bokaro Express) ఎక్స్‌ప్రెస్ రైలులో బుధవారం ఉదయం ఓ గుర్తు తెలియని మహిళ రైలులోనే ప్రసవించింది. అనంతరం పుట్టిన బిడ్డను రైలు టాయ్‌లెట్‌లో వదిలి వెళ్లగా మిగతా ప్రయాణికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. ఆర్‌పీఎఫ్ జీఆర్‌పీ పోలీసులు రైలులోని శిశువును కాపాడి, రైల్వే ఆసుపత్రికి తరలించారు.
ఆర్పీఎఫ్ పోలీసుల కథనం ప్రకారం.. ఓ మహిళ train No. 13351 బొకారో ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న సమయంలో ప్రసవించింది. అప్పుడే పుట్టిన మగబిడ్డను రైలు టాయ్‌లెట్‌లో వదిలేసి నిర్ధాక్షిణ్యంగా వెళ్లిపోయింది. బీ1 కోచ్ టాయ్‌లెట్ నుంచి సింహాచలం దాటిన తరువాత ఏడుపు వినిపించడంతో మిగతా ప్రయాణికులు టాయ్‌లెట్ తలుపు తెరిచి చూసి షాకయ్యారు. అప్పుడు పుట్టిన ఓ మగబిడ్డ పిండంతో టాయ్‌లెట్ షింకులో గుర్తించారు.
సింహాచలం స్టేషన్ దాటిన తరువాత ఓ పసిబిడ్డను టాయ్‌లెట్‌లో గుర్తించడంపై టీటీ వి బ్రహ్మాజీకి తోటి ప్రయాణికులు సమాచారం అందించారు. టీటీ ట్రెయిన్ రెస్క్యూ టీమ్, ఎస్కార్ట్ టీమ్‌కు సమాచారం అందించగా, వారు ఆ శిశువును విశాఖపట్నం డివిజన్ రైల్వే హాస్పిటల్‌కు తరలించారు. ఆ శిశువు ఆరోగ్యంగా ఉన్నాడని, అనంతరం మెరుగైన చికిత్స కోసం కేజీహెచ్‌కు తరలించారు. అనంతరం శిశువును చైల్డ్ కేర్ అధికారులకు అప్పగించారు. ఈ ఘటనపై విచారణ చేపట్టినట్లు రైల్వే పోలీసులు తెలిపారు.
డివిజనల్ రైల్వే మేనేజర్, వాల్టెయిర్ అనుప్ సత్పతి మాట్లాడుతూ టీటీకి తగిన అవార్డును ఇస్తామని చెప్పారు. ఆ చిన్నారి పోషణ, పెంపకానికి అయ్యే ఖర్చులను తాను భరిస్తానని మేనేజర్ ప్రకటించారు. శిశువు ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడూ చెక్ చేస్తున్నామని చెప్పారు. ఆ బిడ్డ కన్న తల్లిదండ్రులు ఎవరో తెలుసుకునేందుకు విచారణ చేపట్టామని పేర్కొన్నారు. ఒకవేళ ఆ బాబు తల్లిదండ్రులు తమకు తాము స్వచ్ఛందంగా ముందుకు వచ్చి బిడ్డను తీసుకెళ్లాలనుకుంటే ఆ శిశువు పోషణకు అయ్యే మొత్తం ఖర్చులు అందిస్తామని చెప్పారు. ఈ వివరాలను సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఏకే త్రిపాఠి ఓ ప్రకటనలో తెలిపారు.