Cyclone Asani: తీరాన్ని తాకిన అసని తుపాను, తీరంలో ఎగసిపడుతున్న రాకాసి అలలు - ఆ జిల్లాల్లో అతి భారీ వర్షాలు
Cyclone Asani Latest Updates: రెండు రోజులుగా ఏపీలోని ఉత్తరాంధ్ర వాసులను కలవరపెట్టిన అసని తుపాను నేటి సాయంత్రం పలుచోట్ల తీరాన్ని తాకింది. మరో రెండు గంటల్లో పూర్తి స్థాయిలో తీరాన్ని తాకే అవకాశం ఉంది.
Cyclone Asani hit the coast of Bapatla: అసాని తుపాను తీరాన్ని తాకింది. ప్రస్తుతం బాపట్ల వద్ద తీరాన్ని తాకిందని వాతావరణ శాఖ సమాచారం. బందర్ వద్ద సైతం తుపాను తీరాన్ని తాకిందని, మరో రెండు గంటల్లో పూర్తి స్థాయిలో అసని తుపాను తీరాన్ని తాకనుందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. తుపాను తీరాన్ని తాకడంతో తీరం వెంట రాకాసి అలలు దూసుకొస్తున్నాయి. బలమైన గాలులు వీస్తుండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అసని తుపాను ప్రభాంతో ఉమ్మడి గుంటూరు, క్రిష్ణ, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి.
తీరం వెంట బలమైన గాలులు..
తుఫాను పరిసర ప్రాంతాల్లో మాత్రం 100 కి.మీ. వేగంతో గాలులు వీస్తున్నాయి. తీరం సమీప ప్రాంతాల్లో గాలుల వేగం గంటకు 60-80 కి.మీ. మధ్య ఉంటుందని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు. ఉమ్మడి గుంటూరు, కృష్ణా, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. ఉత్తర కోస్తాంధ్రలో ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని, తీరం వెంట ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. మరో రెండు గంటల్లో అసని తుపాను పూర్తిగా తీరాన్ని తాకనుండగా, మరో 12 గంటల్లో వాయుగుండంగా బలహీన పడే అవకాశం ఉంది.
ముఖ్యంగా పల్నాడు, ప్రకాశం జిల్లాలోని వివిధ భాగాలతో పాటుగా, నెల్లూరు జిల్లాలోని ఉత్తర ప్రాంతాలు, అనంతపురం, కడప జిల్లాల్లో అక్కడక్కడ మరో రెండు గంటల వరకు వర్షాలు కొనసాగుతాయి. రాత్రికంతా ఇది వాయుగుండంగా మారనుంది, ఆ తర్వాత మరింత బలగహీనపడనుంది. అసని తుపాను ఎన్నో మలుపులు తిరిగి, చివ్వరికి నిన్న చెప్పినట్టుగానే ప్రస్తుతం బాపట్ల తీరానికి తుపాను చేరింది. ప్రకాశం, బాపట్ల, నెల్లూరు జిల్లా ఉత్తరభాగాల్లో గాలులు గంటకు 100 కి.మీ వేగంతో వీచే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అసని తుపాను నేపధ్యంలో హెల్ప్ లైన్ నెంబర్లు, విపత్తుల నిర్వహణ సంస్థలో అత్యవసర సహయం కోసం
24 గంటలు అందుబాటులో హెల్ప్ లైన్ నెంబర్లు
• 1070
• 18004250101
- డా.బిఆర్ అంబేద్కర్ , డైరెక్టర్ , ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ
ముఖ్యంగా ప్రకాశం జిల్లా, నెల్లూరు, జిల్లా కావలి పరిధిలో, పల్నాడు, బాపట్ల జిల్లాలోని కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. ఇదే కాకుండా సముద్రలో అలలు భాగా ఎగిసిపడుతుంటాయి. విజయవాడ నగరంలో చిరుజల్లుల వర్షంతో పాటుగా గుంటూరు, కృష్ణా, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెదర్ మ్యాన్ అంచనా వేశారు. చిత్తూరు, అన్నమయ్య, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో చిరు జల్లులు పడతాయి.
7 జిల్లాల్లో 454 రిలీఫ్ క్యాంప్‌లు ఏర్పాటు..
అసని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపడుతున్నామని చెప్పారు ఏపీ హోం మంత్రి తానేటి వనిత. కోస్తా జిల్లాల్లో తుపాను ప్రభావంపై కలెక్టర్లను, ఎస్పీలను సీఎం వైఎస్ జగన్ అలర్ట్ చేశారని, సహాయక చర్యలు, ముందు జాగ్రత్త చర్యలలో ఎలాంటి జాప్యం జరగకూడదని ఆదేశించారని చెప్పారు. తీర ప్రాంతాల్లో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు మంత్రి తానేటి వనిత చెప్పారు. తుపాను, వర్ష ప్రభావం అధికం ఉందని భావిస్తున్న 7 జిల్లాలలో 454 రిలీఫ్ క్యాంప్‌లు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా విశాఖలో భారత నేవీ, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ సహాయక చర్యలకు సిద్ధంగా ఉన్నాయి.
Also Read: Asani Cyclone: మరింత బలహీన పడిన అసని- రేపటికి వాయుగుండంగా మారిపోనున్న తుపాను