MGBS Boy Kidnap Case: ఎంజీబీఎస్‌లో కిడ్నాపైన బాలుడు సేఫ్, కిడ్నాపర్ తెలివిగా చేసిన పనికి పోలీసులు షాక్
Missing Boy Found: ఎంజీబీఎస్‌లో కిడ్నాప్ అయిన బాలుడి కథ సుఖాంతం అయింది. కిడ్నాప్ అయిన బాలుడ్ని గుర్తించిన పోలీసులు నవీన్‌ను కుటుంబ సభ్యులకు క్షేమంగా అప్పగించారు.
MGBS Boy Kidnap Case: హైదరాబాద్‌లోని మహాత్మా గాంధీ బస్ స్టేషన్ (MGBS)లో కిడ్నాప్ అయిన బాలుడి ఆచూకీ లభ్యమైంది. అపహరణకు గురైన చిన్నారి నవీన్ సీబీఎస్ వద్ద నల్గొండ బస్సులో కనిపించినట్లు పోలీసులు తెలిపారు. ఏపీ నుంచి బంధువుల ఇంటికి వచ్చిన చిన్నారిని తండ్రి సొంత గ్రామానికి తీసుకెళ్లడానికి రాగా, ఎంజీబీఎస్‌లో బాలుడు నవీన్‌ను ఓ గుర్తు తెలియని వ్యక్తి కిడ్నాప్ చేశాడు. ఇదంతా సీసీకెమెరాలో రికార్డయింది.
మిర్యాలగూడ నుంచి వచ్చిన బస్సులో బాలుడు నవీన్‌ని గమనించిన ఆర్టీసీ కండక్టర్ పోలీసులకు సమాచారం అందించారు. అదివరకే బాలుడి మిస్సింగ్ కేసు నమోదు కావడంతో వివరాలు సెకరించిన పోలీసులు బాలుడు నవీన్‌ను కుటుంబసభ్యులకు క్షేమంగా అప్పగించారు. బాలుడి కిడ్నాప్ వ్యవహారం టీవీలో రావడం, పోలీసులు నిఘా పెట్టడంతో కిడ్నాప్ చేసిన వ్యక్తి తిరిగి బస్సులో ఎక్కించి హైదరాబాద్ పంపించి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. కిడ్నాపర్ కూడా బస్సులో ప్రయాణించాడా అనే కోణంలోనూ దర్యాప్తు చేపట్టారు. తాను దొరికిపోతానేమోనని తెలివిగా తప్పించుకునేందుకు బాలుడ్ని బస్సు ఎక్కించి పంపడంతో కిడ్నాపర్ చేసిన పనికి పోలీసులు షాకయ్యారు.
అసలేం జరిగిందంటే..
రంగారెడ్డి జిల్లా మామిడిపల్లి బాలాపూర్ మండలం రంగనాయకుల కాలనీకి చెందిన లక్ష్మణ్ కూలీ పనిచేస్తూ జీవనం సాగించేవాడు. బతుకుదెరువు కోసం తన భార్య, కుమార్తెతో కలిసి ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లాలోని లక్కిరెడ్డిపల్లి గ్రామానికి వలస వెళ్లాడు. వీరి మూడేళ్ల కుమారుడు నవీన్‌ను ఇక్కడే బంధువుల ఇంట్లో వదిలివెళ్లాడు. కొడుకును తిరిగి తమ వెంట తీసుకెళ్లేందుకు మే 9న ఏపీ నుంచి హైదరాబాద్‌కు వచ్చాడు లక్ష్మణ్. మూడేళ్ల కుమారుడు నవీన్‌ను సొంతూరుకు తిరిగి తీసుకెళ్లేందుకు వచ్చిన లక్ష్మణ్ ఎంజీబీఎస్‌లో ప్లాట్ ఫారం 44 వద్ద కుమారుడ్ని కూర్చోబెట్టి టాయ్‌లెట్‌కు వెళ్లారు. మూత్రశాల నుంచి తిరిగొచ్చి చూసే సరికి కుమారుడు నవీన్ కనిపించలేదు.
కుమారుడు కనిపించడం లేదని, ఎవరో కిడ్నాప్ చేసి ఉంటారని బాలుడి తండ్రి లక్ష్మణ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సీసీ కెమెరాలు పరిశీలించగా.. గుర్తు తెలియని వ్యక్తి బాలుడ్ని తీసుకెళ్తున్నట్లు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలించగా, ఆందోళనకు గురైన నిందితుడు బాలుడ్ని బస్ ఎక్కించి మిర్యాలగూడ నుంచి హైదరాబాద్ బస్సు ఎక్కించాడు. కండక్టర్ నుంచి సమాచారం అందుకున్న పోలీసులు చిన్నారి నవీన్‌ను క్షేమంగా తండ్రి లక్ష్మణ్‌కు అప్పగించారు. బస్సులో కిడ్నాపర్ కూడా ప్రయాణించాడా, లేక కేవలం బాలుడ్ని బస్సు ఎక్కించి పంపించాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బస్ స్టేషన్, రైల్వే స్టేషన్లలో చిన్నారులను ఒంటరిగా వదిలి వెళ్లకూడదని, ఇలా చేస్తే పిల్లలు కిడ్నాప్ అయ్యే అవకాశం ఎక్కువ అని తల్లిదండ్రులకు పోలీసులు సూచించారు.