Nellore Lecturer: ఆత్మకూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఘోరం! రోగికి స్వీపర్, సెక్యురిటీ ట్రీట్మెంట్ - పేషెంట్ మృతి
Atmakur News: సెక్యురిటీ గార్డులు, పారిశుద్ధ్య సిబ్బంది కలిసి దెబ్బలకు కట్టు కట్టారు. ఆ సమయంలో కనీసం డ్యూటీ డాక్టర్ కూడా వారివద్ద లేడు.
Nellore: నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పూర్తిగా నిర్లక్ష్యపూరితమైన ఘటన జరిగింది. ఆ నిర్లక్ష్యంతో ఓ లెక్చరర్ ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆ రోగికి పారిశుద్ధ్య సిబ్బంది వైద్యం చేయడం కలకలం రేపింది. రోడ్డు ప్రమాదంలో గాయాలైన వ్యక్తికి వైద్యుడు విధుల్లో ఉన్నా సెక్యూరిటీ గార్డులు, స్వీపర్లు చికిత్స అందించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రికి వచ్చిన వ్యక్తిని పట్టించుకోకపోవటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
మంగళవారం రాత్రి లెక్చరర్ రామక్రిష్ణ అనే వ్యక్తికి రోడ్డు ప్రమాదం జరిగింది. ఆయన్ను ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రికి తీసుకురాగా, రోగికి డ్యూటీ డాక్టర్ ఇంజెక్షన్ వేసి వదిలేశారు. బాధితుడికి రోడ్డు ప్రమాదంలో తల, కాళ్లకు తీవ్ర గాయాలు అయ్యాయి. అయితే, సెక్యురిటీ గార్డులు, పారిశుద్ధ్య సిబ్బంది కలిసి దెబ్బలకు కట్టు కట్టారు. ఆ సమయంలో కనీసం డ్యూటీ డాక్టర్ కూడా వారివద్ద లేడు. మెరుగైన వైద్యం కోసం రోగిని అక్కడి నుంచి నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించేందుకు స్ట్రెచర్‌లో తీసుకెళ్తుండగా సెక్యురిటీ, పారిశుద్ధ్య సిబ్బంది కట్టిన కట్లు ఊడిపోయాయి.
ఆస్పత్రికి తరలించేలోపే లెక్చరర్ చనిపోయారు. ఆత్మకూరు ఆస్పత్రిలో వైద్యులు లేకపోవడం, డ్యూటీ డాక్టర్ ఉన్నా సరిగా స్పందించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.