Anakapalli: అనకాపల్లిలో కలుషితాహారం తిని ముగ్గురు విద్యార్థులు మృతి- విచారణకు ఆదేశించిన ప్రభుత్వం
Andhra Pradesh: కలుషిత ఆహారం తిన్న విద్యార్థులు ముగ్గురు మృతి చెందడలం అనకాపల్లిలో కలకలం రేపింది. దీనిపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.
Chandra Babu: ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లిలో కలుషితాహారం తిని ముగ్గురు విద్యార్థులు చనిపోయారు. ఇంకొంత మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో కూడా కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని తెలుసుకున్న చంద్రబాబు తీవ్ర దగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాస పట్టణంలోని అనాథశ్రమంలో కలుషిత ఆహారం తిన్న విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. రెండు రోజుల క్రితం సమోసా తిన్న విద్యార్థులు తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. కలుషిత ఆహారం తిని వాంతులు చేసుకున్న విద్యార్థులను సమీప ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ ముగ్గురు విద్యార్థుల ఇవాళ చనిపోయారు. వారిలో కొందరు పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్య సిబ్బంది చెబుతోంది.
ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించింది. విద్యార్థుల మరణ వార్త విన్న సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విద్యార్థులు మృతిపై విచారం వ్యక్తం చేశారు. చికిత్స పొందుతున్న విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. ఘటనకు గల కారణాలపై పూర్తి నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు
ఈ దుర్ఘటనపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించారు. "అనకాపల్లి జిల్లా కోటపురట్ల మండలం కైలాసపట్నం అనాథాశ్రమంలో కలుషితాహారం తిని జాషువా, భవానీ, శ్రద్ధ అనే విద్యార్థులు మృతిచెందిన ఘటన తీవ్రంగా కలచివేసింది. ఈ ఘటనపై ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్లతో మాట్లాడాను. అనకాపల్లి ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 17మంది విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాల్సిందిగా అధికారులను ఆదేశించాం. మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు అప్రమత్తతతో వ్యవహరించాలని కోరుతున్నాను." అని అన్నారు.
కైలాసపట్నం పుడ్ పాయిజన్ కేసుపై హోం మంత్రి వంగలపూడి ఆనిత స్పందించారు. విద్యార్థుల మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఆమె... అనకాపల్లి జిల్లా కలెక్టర్, కేజీహెచ్, నర్సీపట్నం ఆసుపత్రుల సూపరింటెండెంట్‌లతో మాట్లాడారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీశారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. అధికారులను అప్రమత్తం చేసిన హోం మంత్రి వంగలపూడి అనిత. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు డిప్యూటీ డిఈఓ పెన్నాడ అప్పారావు, ఎంఈఓ పి రామారావుసహా పోలీసులు అధికారులు ఈ దుర్ఘటపై దర్యాప్తు చేస్తున్నారు.