Chandrababu: నాది అద్దె ఇల్లు, నీకు ఊరూరా ప్యాలెస్‌లు: సీఎం జగన్ కు చంద్రబాబు స్ట్రాంగ్ కౌంటర్
Chandrababu: ఉమ్మడి విశాఖ జిల్లాలో పర్యటిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పెందుర్తిలో నిర్వహించిన ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
Chandrababu: ప్రశాంతమైన విశాఖ నగరంలో అరాచకాలు చేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. హుద్ హుద్ సమయంలో ఇక్కడే ఉండి ప్రజలకు సాయం చేశామని.. హుద్ హుద్ ముందు విశాఖ, తర్వాత విశాఖ అని చర్చించుకునేలా నగరాన్ని తీర్చిదిద్దామని బాబు చెప్పుకొచ్చారు. అలాంటి విశాఖకు సీఎం జగన్ ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. నాలుగేళ్లుగా ఒక్క ప్రాజెక్టు అయినా పూర్తయిందా, ఒక్క కంపెనీ అయినా వచ్చిందా, ఒక్క ఉద్యోగం కల్పించారా అని చంద్రబాబు ప్రశ్నించారు. ఇలా అయితే జనం ఎలా బతుకుతారని.. అందుకే ఇదేం ఖర్మ అనే కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్నీ ఉన్నాయి కానీ అల్లుడి నోట్లో శని అన్నట్లుగా పరిస్థితి తయారైందని మండిపడ్డారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో పర్యటిస్తున్న బాబు.. పెందుర్తిలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన టీడీపీ అధినేత వైసీపీ ప్రభుత్వంపై, సీఎం జగన్ మోహన్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు.
'మన రాష్ట్రంలో ఉండే సీఎం సైకోనా కాదా?'
విచిత్రంగా, వింత ఆలోచనలు ఉండే వ్యక్తిని సైకో అంటారని, మనందరం బాధపడుతుంటే చూసి సంతోషించే వ్యక్తిని సైకో అంటారని బాబు అన్నారు. మన రాష్ట్రంలో ఉండే ముఖ్యమంత్రి సైకో నా కాదా అని బాబు ప్రశ్నించారు. సాక్షాత్తూ సొంత పార్టీ ఎంపీనే పోలీసులతో కొట్టించి, సీఎం వీడియో చూస్తాడని దాన్ని ఏమనాలో చెప్పాలని ప్రశ్నించారు. మొన్న రాజమండ్రిలో ఆదిరెడ్డి అప్పారావు, శ్రీనివాస్ లను ఫిర్యాదు లేకపోయినా అరెస్టు చేసినట్లు గుర్తుచేశారు. బాబాయిని చంపేసి ఈ సైకో తనపై ఆరోపణలు చేస్తాడని బాబు మండిపడ్డారు. బాబాయిని చంపి ఓట్లు తెచ్చుకునే వారిని సైకో అనకుండా ఇంకేం అనాలని ప్రశ్నించారు.
'నాది అద్దె ఇల్లు, నీకు ఊరూరా ప్యాలెస్‌లు'
అమరావతిలో అద్దె ఇంట్లో ఉంటున్నానని, జగన్ కు ఉన్నట్లు ఊరూరా ప్యాలెసులు లేవని చంద్రబాబు అన్నారు. జగన్‌కు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై సహా అనేక ప్రాంతాల్లో ప్యాలెస్ లు ఉన్నట్లు చెప్పారు. 'నేను ఉండే అద్దె ఇంటిని కూల్చాలని ఎంత ప్రయత్నం చేశారో చూశారు కదా. లేని రింగ్ రోడ్డుపై క్విడ్ ప్రో కో అని ఆరోపణలు చేసి ఆ ఇల్లు జప్తు చేస్తాను అంటున్నాడు. ఇది పైశాచిక ఆనందం కాదా.. ఇతన్ని సైకో అనాలా వద్దా.. ప్రజా వేధిక కూల్చడం ద్వారా విధ్వంసం ప్రాంరంభించాడు. నేను జనం మధ్యలో తిరుగుతున్నా. కానీ జగన్ జనం మద్యలోకి రాలేదు. పరదాలు కడతారు. చెట్లు నరికివేస్తారు. మామూలు నాయకులు ఇలా చేస్తారా.. సైకోలే ఇలాంటి పనులు చేస్తారు' అని చంద్రబాబు విమర్శించారు.
'ఏది మన రాజధానో చెప్పుకోలేని పరిస్థితి'
వైసీపీ సర్కారు వచ్చి నాలుగేళ్లు గడుస్తున్నా.. ఇదీ మన రాజధాని అని చెప్పుకోలేని దౌర్భాగ్య స్థితి అని చంద్రబాబు అన్నారు. జగన్ మోహన్ రెడ్డి విశాఖ ఆస్తులపై కన్నేశారని, జగన్ విశాఖ వస్తే వైజాగ్ వాసులు కంటి నిండా నిద్రపోయే పరిస్థితి లేదని మండిపడ్డారు. విశాఖ జిల్లా భీమిలిలో వివాదాస్పద స్థలాలు ఇచ్చి పేదలను రోడ్డు పడేశారని, వాళ్లు అప్పులు చేసి ఇళ్లు కట్టుకున్న తరువాత కోర్టు కేసు అని వాళ్లను అడ్డుకున్నారని చెప్పారు. పంచగ్రామాల సమస్య పరిష్కారానికి జీవో నెంబర్ 229 ఇచ్చినట్లు గుర్తుచేశారు బాబు. కానీ వైసీపీ వాళ్లు కోర్టుకు వెళ్లి అడ్డుపడ్డారని.. మళ్లీ టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సమస్య పరిష్కరిస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు.