Chandrababu: ఏపీ మాజీ సీఎం చంద్రబాబుపై రాళ్లు విసిరిన దుండగులు, టీడీపీ అధినేత ఆగ్రహం
Andhra Pradesh News: ఏపీ రాజకీయాలు రోజురోజుకూ వేడెక్కుతున్నాయి. శనివారం సీఎం జగన్ పై ఓ దుండగుడు రాయితో దాడి చేయగా, ఆదివారం తెనాలిలో పవన్ పై, గాజువాకలో చంద్రబాబుపై రాళ్ల దాడి జరిగింది.
Stone pelted at TDP Chief chandrababu- గాజువాక: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకి తృటిలో ప్రమాదం తప్పింది. గాజువాక సభలో గుర్తు తెలియని వ్యక్తులు చంద్రబాబుపై రాళ్లు రువ్వారు. టీడీపీ అధినేతకు సమీపంలో రాయి పడటంతో ప్రమాదం తప్పింది. ప్రజాగళం సభలో వెనుక నుంచి రాళ్లు విసిరారని టీడీపీ నేతలు తెలిపారు. చంద్రబాబుపై రాయి విసరగానే పోలీసులు, భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తం అయ్యారు.
నిన్న సీఎం జగన్ సభలో చీకట్లో ఎవరో గులకరాయి వేస్తే, నేడు లైట్లు ఉండగానే తనపై కొందరు దుండగులు రాళ్లతో దాడికి పాల్పడ్డారని చంద్రబాబు అన్నారు. తెనాలిలోనూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సైతం రాళ్లు వేశారని, దీని వెనుక ఉన్నది ఎవరని చంద్రబాబు ప్రశ్నించారు. రాళ్లు విసిరి దుండగులు పరారయ్యారని, ఇకనుంచైనా డ్రామాలు ఆపేయాలని.. రానున్న రోజుల్లో వైసీపీ నేతలు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
చంద్రబాబు గారి గాజువాక సభలోకి, గంజాయి బ్యాచ్ ని వదిలిన సైకో పార్టీ.#PrajaGalam #EndOfYCP pic.twitter.com/fWxO3GSK7W
— Telugu Desam Party (@JaiTDP) April 14, 2024
చిల్లర పనులు మానుకోవాలని చంద్రబాబు హితవు
ఏపీలో ఉన్నది చెత్త ప్రభుత్వం, చేతకాని ప్రభుత్వం అని చంద్రబాబు నిప్పులు చెరిగారు. గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ గాజువాకలో ప్రజాగళం సభలోకి వచ్చాయన్నారు. విజయవాడలో ఇదివరకే డ్రామా చేశారని, ఇప్పుడు తమ సభలపై కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు తిరగబడి, వైసీపీ నేతల బట్టలు విప్పి తరిమి తరిమి కొడతారని బీ కేర్‌ఫుల్ జగన్ అంటూ చంద్రబాబు హెచ్చరించారు. ఇకనైనా చిల్లర పనులు మానుకోవాలని, మీ ప్రభుత్వానికి కాలం చెల్లింది, రాష్ట్రంలో వచ్చేది కూటమి ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు.
విజయవాడలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర రోడ్ షోలో పాల్గొన్న సీఎం వైఎస్ జగన్ పై శనివారం (ఏప్రిల్ 13న) రాత్రి రాయి దాడి జరిగింది. గజమాల పక్కకు తీసేశాక, అభివాదం చేస్తున్న జగన్ నుదురుకు ఓ రాయి వచ్చి గట్టిగా తాకింది. ఆయన ఎడమ కంటిపై భాగంలో గాయం కాగా, విజయవాడలో చికిత్స తీసుకున్నారు. జగన్ ను తాకిన రాయి విజయవాడ సెంట్రల్ వైసీపీ అభ్యర్థి వెల్లపల్లి శ్రీనివాస్ కు సైతం ఎడమ కంటికి తాకగా ఆయనకు సైతం గాయమైంది. ఆసుపత్రిలో చికిత్స తీసుకుని ఇంటికి వెళ్లిన వెల్లంపల్లిని వైసీపీ నేతలు పరామర్శిస్తున్నారు.