Srikakulam News: ప్రధానోపాధ్యాయురాలిపై చేయి చేసుకున్న వైసీపీ నేత - బిల్లులపై సంతకం చేయకపోవడమే కారణం!
Srikakulam News: ఓ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిపై వైసీపీ నేత చేయి చేసుకున్నారు. అనంతరం బడికి తాళం వేసి.. తాను పూర్తి చేసిన పనుల బిల్లులపై సంతకం చేయాలంటూ ఆమెను వేధించారు.
Srikakulam News: తాను పూర్తి చేసిన పనుల పాత బిల్లులపై ప్రధానోపాధ్యాయురాలు సంతకం చేయలేదనే కోపంతో.. ఆమె చెంప పగులగొట్టాడో వైసీపీ నేత. అంతే కాకుండా ఆమెను వేధిస్తూ.. బడికి తాళం కూడా వేశాడు. ఏం చేయాలో పాలుపోని ప్రధానోపాధ్యాయురాలు మండల విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేసింది.
శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఎన్టీఆర్ నగర్ ప్రాథమిక పాఠశాలలో విజయ లక్ష్మి ప్రధానోపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు. అయితే ఆ పాఠశాల యాజమాన్య కమటీ ఛైర్మన్ తండ్రి, వైసీపీ నేత అయిన దుప్పల శ్రీనివాస్.. ఆ పాఠశాల కోసం కొన్ని పనులు చేశారు. అయితే ఆ బిల్లులపై ప్రధానోపాధ్యాయురాలు విజయ లక్ష్మి సంతకం చేయలేదు. దీంతో కోపం పెంచుకున్న అతడు ఆమెపై చేయి చేసుకున్నారు. బడికి తాళం వేసి వెళ్లిపోయారు. ఏం చేయాలో పాలుపోని హెచ్ఎం విజయ లక్ష్మ మండల విద్యాధికారి దృష్టికి తీసుకొచ్చారు. అయితే 2019-20, 2020-21 విద్యా సంవత్సరాల్లో పాఠశాలల్లో చేపట్టిన మరమ్మతు పనులకు సంబంధించి బిల్లుల చెల్లింపునకు సంతకం చేయాలంటూ దుప్పల శ్రీనివాస్ తనపై ఒత్తిడి తీసుకు వచ్చారని ప్రధానోపాధ్యాయురాలు విజయ లక్ష్మి వెల్లడించారు. అయితే ఆ సమయంలో తాను ఈ బడిలో పని చేయలేదని ఎంఈఓ దృష్టికి తీసుకెళ్లాలలని సూచించినా అతడు పట్టించుకోలేదని వాపోయారు.
ఈక్రమంలోనే బుధవారం ఉదయం పాఠశాలకు వచ్చి తనను ఇష్టం వచ్చినట్లుగా తిట్టినట్లు చెప్పారు. అలాగే బడిలోని రెండు గదులకు తాళాలు వేశారని పేర్కొన్నారు. ఇటీవల తన ఆరోగ్యం బాగోలేక సెలవులో ఉన్న రోజుల్లోనూ ఫోన్లు చేస్తూ... బిల్లుల కోసం తరచూ వేధించేవారని వాపోయారు. ఇటీవల తన ఆరోగ్యం బాగాలేక సెలవులో ఉంటే కూడా వేధింపులు ఆపలేరని.. ఫోన్లు చేసి మరీ తనను టార్చర్ చేసినట్లు స్పష్టం చేశారు. బుధవారం దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ఆమె సిద్ధం కాగా... తమ శాఖ అధికారుల సూచనల మేరకు విరమించుకున్నారు. మండల విద్యాధికారి చిన్నారావు పాఠశాలను సందర్శించి ఈ సంఘటనపై విచారణ చేపట్టారు. పలు ఉపాధ్యాయ సంఘాల నేతలు పాఠశాలను సందర్శించి ప్రధానోపాధ్యాయురాలికి సంఘీభావం తెలిపారు.
మూడు నెలల క్రితం తిరుపతిలోనూ ఇలాంటి ఘటనే
తిరుపతి జిల్లా వరదయ్యపాలెం పంచాయతీ ఎస్సీ కాలనీ(హరిజనవాడ) అంగన్వాడీ కేంద్రాన్ని వివాదంతో మూసివేయడం చర్చనీయాంశంగా మారింది. సీడీపీవో స్వయంగా వచ్చి సమస్య పరిష్కరించే వరకు అంగన్ వాడీ కేంద్రాన్ని తీయబోమని ఇటీవల పదవీ విరమణ పొందిన అంగన్ వాడీ టీచర్ ఆనందమ్మ తేల్చి చెప్పింది. వరదయ్యపాలెం పంచాయతీ ఎస్సీ కాలనీ(హరిజనవాడ) లో అంగన్ వాడీ టీచర్ గా పని చేస్తున్న ఆనందమ్మ గత జనవరిలో పదవీ విరమణ చెందారు. అయితే తనకి ఎవరూ లేనందున తన బాగోగులు చూస్తున్న.. తన బంధువులకు తన ఉద్యోగాన్ని ఇవ్వాలని ఆనందమ్మ కోరడంతో అవకాశాలని పరిశీలిస్తామని సీడీవోవో హామీ ఇచ్చారు.
సీపీడీఓనే మా మధ్య గొడవ పెట్టిందంటూ ఆనందమ్మ ఆరోపణలు
అయితే పదవీ విరమణ 62 వరకు పెంచినందున ఆ అవకాశాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చిన సీడిపీవో.. ఆయాగా పని చేస్తున్న నాగమణికి పదోన్నతి ఇస్తామని ఆశ పెట్టి.. బందువుల్లా కలసి మెలసి ఉన్న తమ మధ్య సిడిపివో చిచ్చు పెట్టారని అంగన్వాడీ టీచర్ ఆనందమ్మ ఆరోపిస్తుంది. స్వయంగా తమకు ఆశ చూపిన సిడీపీఓనే వచ్చి వివాదాన్ని పరిష్కరించాలని ఆనందమ్మ వాదనకు దిగింది. అయితే సిడీపీఓ దేవకుమారి స్పందిస్తూ.. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు 60 ఏళ్లు పూర్తి కావడంతో ఆనoదమ్మ పదవి విరమణ ఉత్తర్వులు వెలువడిందని, కలెక్టర్ ఉత్తర్వుల మేరకు ప్రస్తుతం పని చేస్తున్న ఆయాకు పదోన్నతి ఇచ్చారని తెలిపారు. 62 ఏళ్లకి పదవి విరమణపై తన పరిధిలో లేదని.. ఈ విషయంలో గానీ ఈ వివాదంలో గానీ తన ప్రమేయం లేదని అన్నారు.