Srikakulam Politics : సామాజిక రాజకీయంలో నలిగిపోతున్న సిక్కోలు నేతలు - ఆధిపత్యపోరాటంలో ఎవరిది పైచేయి ?
సిక్కోలు రాజకీయంలో కులాల ఆధిపత్య పోరాటమే కీలకం అవుతోంది.
Srikakulam Politics : ఎన్నికలు దగ్గరకు వస్తే చాలు కుల రాజకీయాలు కొదవే ఉండదు. శ్రీకాకుళం జిల్లాలో బొడ్డేపల్లి రాజగోపాలరావు శతజయంతి ఉత్సవాల కేంద్రంగా జరుగుతున్న రాజకీయం ఔరా అనిపిస్తోంది. శతజయంతి ఉత్సవాలు పేరుతో కాళింగ సామాజిక నేతలు ఆ ఓటర్లను తమకు దగ్గర చేసుకునేలా ఎక్కడికక్కడే విగ్రహాలు ఏర్పాటు చేశారు. బహిరంగ సభలు నిర్వహించారు. కాళింగ సామాజిక వర్గం బలం, బలగం, రాజకీయ జయాపజయాలకు సారథులుగా ఉన్నామని అధికార, ప్రతిపక్ష పార్టీల చూపించే ప్రయత్నం చేశారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో రూ. రెండు కోట్ల గోల్ మాల్ జరిగిందనే ప్రచారం ఊపందుకుంటోంది.
శ్రీకాకుళం జిల్లాలో కాళింగ వర్గం ప్రభావం
శ్రీకాకుళం జిల్లాలో ఓటర్లు సంఖ్యలో 11శాతం కాళింగ సామా జిక ఓటర్లు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. పోలినాటి వెలమలు 9.86 శాతం ఉండగా, కాపులు 12.92 శాతం ఉన్నారు. ఈ మూడు సామాజిక వర్గాల్లో కాళింగ సామాజిక వర్గం కాంగ్రెస్ జమానాలో అన్ని విధా లుగా పెద్దపీట వేసేవారు. అప్పుడు అనేక కీలక పదవులు కూడా వారిని వరించాయి. ఇక తెలుగుదేశం పార్టీ వస్తూనే కాంగ్రెస్ చేరదీసిన వర్గాలకు అపోజిట్ వర్గాలను తన వైపు నకు లాక్కుంది. ఆ విధంగా కాళింగులతో పోటీలో వెనుక బడిన వెలమలు టీడీపీకి బాగా దగ్గర అయ్యారు. కింజరాపు కుటుంబానికిబాగా ఎదిగే అవకాశం వచ్చింది. ఇక టీడీపీ వచ్చిన తర్వాత జిల్లాలో సామాజిక సమీకరణలలో కూడా పెద్దఎత్తున మార్పు చోటు చేసుకుంది. కాంగ్రెస్ కూడా వెలమలను సమాదరించడం మొదలుపెట్టింది. అలా ధర్మాన కుటుంబం వెలుగులోకి వచ్చింది.
పార్టీల వారీగా చీలిన సామాజిక వర్గాలు
కాళింగులు, వెలమలు మంత్రులుగా అధికార మార్పిడి జరిగిన ప్రతీ సందర్భంలో తమ హవా చూపిస్తూ వచ్చారు. టీడీపీలోకి చేరిన తమ్మినేని సీతారాం వంటి వారికి తొలుత ఎన్టీఆర్ నుంచి బాగానే ఆదరణ ఉండేది. తర్వాత చంద్రబాబు నాయుడు జమానాలో కింజరాపు కుటుంబానికి ప్రాము ఖ్యత పెరిగింది. ఈ పరిస్థితులను ఎదుర్కొలేక తమ్మినేని ప్రజారాజ్యంలో చేరిపోయారు. అప్పుడు మొదలైన వెలమ నేతలపై పగ, ప్రతీకారాలు ఇప్పటికీ కొనసాగుతునే ఉంది. సిక్కోల్ రాజకీయాల్లో పలు పార్టీల్లో పదవులు అనుభవిస్తున్నప్పటికీ తమ్మినేని, కింజరావు, ధర్మాన బలగం మధ్య అగాధం ఉండనేవుంది. వీటన్నింటికీ దూరంగా రాజకీయాలు సుతిమెత్తగా నడుపుతున్న కాపు సామాజిక వర్గం మాత్రం రాజకీయ ఎమర్జన్సీ పరిస్థితుల్లో వెలమ సామాజిక నేతలతోనే ఉండేందుకు ఎక్కువగా ఇష్టపడుతూంటాయి.
ధర్మాన తీరుతో కాళింగ వర్గం దూరం
శ్రీకాకుళం జిల్లాలో కాళింగ, వెలమ, కాపు సామాజిక వర్గాల ఓటర్లను ప్రభావితం చేసే శక్తి వైసీపీ అధినేతకు లేకుండా పోయింది. చాలా ఘనంగా కాళింగ సామాజిక వర్గం దివంగత ఎంపీ బొడ్డేపల్లి రాజగోపాలరావు శతజయంతి ఉత్సవాలు అధికార లాంఛనాలతో నిర్వహించినప్పటికీ కార్యక్రమాలకు వెలమ సామాజిక నేతలు అధికార పార్టీలో ఉండడంతో హాజరు వేసుకున్నారే తప్ప ప్రాధాన్యత ఇవ్వలేదు. శతజయంతి ఉత్సవాలు ఘనంగా ముగింపునకు కాళింగ సామాజిక బలగం అంతా తమ బలాబలాలను చూపించక ముందే రాష్ట్ర మంత్రి ధర్మాన ప్రసాదరావు చాణక్య రాజకీయాలు ఆరంభించేశారు. శతజయంతి ఉత్సవాలు ఒక పక్క జరుగుతుంటే ఈ మరో పక్క వెలమ నాయకులందరినీ ఒకతాటిమీదకు తీసుకువచ్చి స్థానికంగా ఆనందమయి కాన్వేకేషన్ హాల్లో వెలమ సామాజిక వర్గం పెద్దలు, పిన్నలతో సమావేశానికి వెనుక నుంచి నడిపించారు. శ్రీకాకుళం జిల్లా వెలమ సంక్షేమ సంఘాన్ని మరోసారి ఆ సామాజిక ఓటర్లకు గుర్తు చేసేలా సభ నిర్వహించారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ముగించారు. ప్రభుత్వంలో ఉన్నందుకు వెలమ సామాజిక నేతగా ధర్మాన ప్రసాదరావు తన సామర్ధ్యంతో శ్రీకాకుళం నియోజకవర్గంలో అంపోలు వద్ద సామాజిక సంఘం కోసం ప్రభుత్వ భూమిని కేటాయించేలా చర్యలు తీసుకుంటున్నారు. తన వెలమ సామాజిక వర్గాన్ని కాపాడుకోవడంతోపాటు, అధికారంలో ఉన్నంతలో వారందరికీ న్యాయం చేయాలన్న తపనతో జిల్లా అడ్ హాక్ కమిటీని కూడా నియమించారు.
క్లిష్టంగా కులాల సమీకరణాలు
వెలమ సామాజిక వర్గంపై కాళింగ సామాజిక వర్గం ఆధిపత్యం పొందేందుకు ప్రయత్నాలు చేసింది. వైసీపీ సర్కార్లో కాళింగ సామాజిక వర్గం ఆగడాలు, హద్దులు దాటిన వ్యవహారాలు మితిమీరిపోయాన్న ఫిర్యాదులు వెళ్లాయి. ఓటరు - జగన్ ఫార్ములాతో పకడ్బందీగా అడుగులు వేస్తున్న వైసీపీ సర్కారు సిక్కోల్ సామాజిక యుద్ధం... ఉత్తరాంధ్ర జిల్లాలనే కుదిపేసేలా కనిపిస్తోంది. కాళింగ వెలమ సామాజిక వర్గాల మధ్య జరుగుతున్న ఆధిపత్యం పోరులో ఐక్యతగా సాగుతున్న తమ్మినేని నాయకత్వం, అనైక్యంగా అడుగులు వేస్తున్న వెలమ సామాజిక వర్గంలో ధర్మాన, కింజరాపు నాయకత్వం బలహీనపడుతోందన్న సంకేతాలు వినిపిస్తున్నాయన్న అభిప్రాయం వినిపిస్తోంది.