RI Swarnalatha Suspension: నోట్ల మార్పిడి కేసులో నిందితురాలు ఆర్ఐ స్వర్ణలత సస్పెండ్, ఈనెల 21 వరకు రిమాండ్
RI Swarnalatha Suspension: విశాఖ నోట్ల మార్పిడి కేసులో ఏ4 నిందితురాలైన ఆర్ఐ స్వర్ణలతను సస్పెండ్ చేశారు. అలాగే ఈమెతో పాటు మరో ముగ్గురు నిందితులకు ఈనెల 21 వరకు రిమాండ్ విధించారు.
RI Swarnalatha Suspension: విశాఖపట్నంలో వ్యక్తుల్ని భయపెట్టి డబ్బుల్ని దోచుకున్న ముఠాకు సీఐ స్వర్ణలత నేతృత్వం వహించినట్లుగా స్పష్టం కావడం పోలీసు వర్గాల్లో సంచలనం రేపింది. ఈక్రమంలోనే క్రమశిక్షణా చర్యల్లో భాగంగా ఆర్ఐ స్వర్ణలత, ఏఆర్ కానిస్టేబుల్ హేమ సుందర్ ను విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే ఈ కేసులో నిందితులైన స్వర్మలత, హేమ సుందర్, హోంగార్డు వి. శ్రీను మధ్యవర్తిగా వ్యవహరించిన సూరిబాబులకు కోర్టు ఈనెల 21వ తేదీ వరకు రిమాండ్ విధించింది. వీరిని శనివారం రోజు విశాఖ కేంద్ర కారాగారానికి తరలించారు. సాధారణ మహిళా ఖైదీలతో పాటు స్వర్ణలతను బ్యారెక్ లో ఉంచారు.
అయితే ఈమె బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా.. సోమవారం విచారణకు రానున్నట్లు సమాచారం. ఎస్బీ-2 లో పని చేస్తున్న హోంగార్డు శ్రీను.. సూరిబాబుతో తనకు ఉన్న పరిచయంతోనే ఈ నోట్ల మార్పిడి వ్యవహారంలో ప్రధానంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. గతంలో గాజువాక, 2వ పట్టణ పోలీస్ స్టేషన్లలో పని చేసిన సమయంలో శ్రీనుపై ఆరోపణలు వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం హోంగార్డుల ఆర్ఐగా ఉన్న స్వర్ణలతను మంచి చేసుకొని విధులకు సరిగా హాజరు కాకపోవడాన్ని గుర్తించారు. ఆరిలోవకు చెందిన సూరిబాబు జనసేనకు చెందిన ఓ నేతకు అనుచరుడిగా వ్యవహరిస్తున్నట్లు.. ఆ నాయకుడు తీస్తున్న సినిమాలో స్వర్ణలత నటించేలా చూస్తున్నట్లు సమాచారం.
అయ్యన్న పాత్రుడిపైనే విమర్శలు చేసిన సీఐ స్వర్ణలత
పోలీసులకు.. రాజకీయాలకు సంబంధం ఉండదు. రాజకీయ పరంగా ఏం జరిగినా పోలీసులు జోక్యం చేసుకోకూడదు. కానీ నేరుగా కమిషనర్ ఆఫీసులోనే .. పోలీసు అధికారుల సంఘం ఉపాధ్యక్షురాలు హోదాలో ప్రెస్ మీట్ పెట్టిన స్వర్ణలత.. మాజీ మంత్రి , తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. పోలీసు అధికారుల సంఘం పేరుతో స్పందించవచ్చు కానీ.. కమిషనర్ ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టి రాజకీయ నాయకుల్ని .. విమర్శించడం.. సవాళ్లు చేయడం వివాదాస్పదమయింది. అయితే ఆమె ఇలా స్పందించడానికి కారణం .. ఆమెకు అండగా ఉన్న వైఎస్ఆర్‌సీపీ నేతల సూచనలేనని చెబుతారు.
కొంత మంది కీలక వైఎస్ఆర్‌సీపీ నేతలతో సన్నిహిత సంబంధాలు !
విశాఖ కమిషనర్ కార్యాయయంలోనే సీఐ స్వర్ణలత చాలా కాలం పని చేశారు. కమిషనర్ కార్యాలయం నుంచే పోలీసు పాలన జరుగుతుంది కాబట్టి.. ఆమె తన పోస్టును అడ్వాంటేజ్ గా తీసుకుని అన్ని పోలీసు స్టేషన్ల విషయాల్లోనూ జోక్యం చేసుకునేవారన్న ఆరోపణలు ఉన్నాయి. అధికార పార్టీ నేతలతో స్వర్ణలత మంచి సంబంధాలు కొనసాగించి.. సర్వీస్ పరంగా ఇబ్బందులు రాకుండా.. పోస్టింగ్‌ల లాబీయింగ్ కూడా చేస్తారని అంటున్నారు. ఆమె ఇలా బెదిరించి డబ్బులు దోపీడీ చేసిన విషయం బయటకు వచ్చిన తర్వాత .. విశాఖలో ఓ కీలక ప్రజాప్రతినిధి ఆమెపై కేసు పెట్టకుండా ఉన్నత స్థాయిలో ఒత్తిడి తెచ్చారని చెబుతున్నారు. జిల్లా స్థాయిలో సాధ్యం కాకపోవడంతో.. రాష్ట్ర స్థాయి కీలక నేతతోనూ ఫోన్ చేయించారంటున్నారు. కానీ విషయం బయటకు రావడంతో స్వర్ణలతపై కేసు పెట్టక తప్పలేదు.