లెక్కల పుస్తకాలు ఇవ్వలేదని డీఈవో సహా మరో ముగ్గురు అధికారులపై వేటు
పార్వతీపురం మన్యం జిల్లాలో డీఈవోతో సహా మరో ముగ్గురు అధికారులు సస్పెండ్‌కు గురయ్యారు. విద్యాశాఖ పనితీరు బాగోకపోవడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్
విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ గురువారం రాత్రి పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం మండలం రేగులపాడు కె.జి.బి.వి. రెసిడెన్షియల్ పాఠశాలను సందర్శించారు. అక్కడి విద్యార్ధులతో మాట్లాడారు. వారి పుస్తకాలను పరిశీలించారు. నవంబర్‌లో ఇవ్వాల్సిన రెండో సెమిష్టర్ లెక్కలు పుస్తకాలను నేటికీ పంపిణీ చేయకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.
పుస్తకాలు ఇవ్వకపోవడానికి గల కారణాలను పాఠశాల ఉపాధ్యాయులను అడిగితెలుసుకున్నారు. ఆ మేరకు వీరఘట్టం ఎం.ఇ.ఓ. కృష్ణమూర్తి, అసిస్టెంట్ గర్ల్ చైల్డ్ డెవలప్ మెంట్ అధికారి రోజా రమణి, కె.జి.బి.వి. ప్రిన్సిపాల్ రోహిణి ని అక్కడికక్కడే సస్పెండ్ చేశారు. ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన జిల్లా విద్యాశాఖ అధికారి తమ విధుల పట్ల నిర్లక్ష్యం గా ఉన్నందున డి.ఇ.ఓ. రమణని కూడా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
విద్యాశాఖ ఆర్. జె.డి. జ్యోతి కుమారికి అదనపు బాధ్యతులు అప్పగిస్తూ ఉత్తర్వులను విడుదుల చేశారు. డి.ఇ.ఓ. స్థాయి అధికారి మీద ప్రవీణ్ ప్రకాశ్ చర్యలు తీసుకోవడం విద్యాశాఖలో కలకలం సృష్టించింది. పాఠ్యపుస్తకాల పంపిణీ సక్రమంగా జరగకపోవడంపై సీతంపేట ఐటిడిఎ పిఒ కల్పన కుమారిని విచారణ చేయాలని ఆదేశించారు.
అసలు ఏం జరిగిందంటే...
పాలకొండ మండలం కొండాపురం ప్రాథమిక పాఠశాలలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ గురువారం రాత్రి పర్యటించారు. ఇక్కడ ఒకటి నుంచి ఐదో తరగతి వరకు 90 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరికి బోధించేందుకు నలుగురు ఉపాధ్యాయులు ఉన్నారు. విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాలు పరీక్షిస్తే జీరో మార్కులు వచ్చాయి. కనీసం వర్క్‌బుక్‌లలో ఖాళీలు కూడా నింపలేదు. సర్కారు బడుల్లో చదువుతున్న పేద కుటుంబాల పిల్లలకు చదువులు చెప్పేది ఇలాగేనా?.. వారి భవిష్యత్ ఏమవుతుందంటూ ఆయన విద్యాశాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పలువురు విద్యార్థుల ఇళ్లకు వెళ్లారు. తొలుత నాలుగో తరగతి చదువుతున్న రేవతి అనే విద్యార్థిని ఇంటికి వెళ్లి అభ్యసనా సామర్థ్యాలను పరీక్షించారు. సదరు విద్యార్థిని వర్క్‌బుక్స్ పూర్తిగా ఖాళీగా ఉండడంతో పాఠశాల హెచ్‌ఎం నందియ్యను ప్రశ్నించారు. మీరు ఎందుకు విద్యాభోదన సక్రమంగా పని చేయడంలేదని సూటిగా ప్రశ్నించారు. పాఠశాలలో బోధన సక్రమంగా జరగకపోతే కనీసం తనిఖీలు చేయటం లేదా అని ఎంఈఓ సూర్యనారాయణపై మండిపడ్డా రు.
ఇంత వరకు జిల్లాలో ఎన్ని పాఠశాలలు తనిఖీ చేశారు... సమస్యలపై తీసుకున్న చర్యలేమిటని డీఈఓ, ఆర్‌జేడీలను ప్రశ్నించారు. చర్యలు తీసుకుంటే ఉపాధ్యాయ సంఘాలు తనపై ఒత్తిడి తీసుకువస్తాయని డీఈఓ ఎస్‌డీవీ రమణ చెప్పడంతో అయితే నీవు ఏం పనిచేస్తున్నావని మందలించారు. నేరుగా మేము మీ శాఖకు బోధన, పాఠశాలలో పరిశీలన, సమస్యలపై తీసుకోవాల్సిన చర్యలపై వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తున్నా క్షేత్రస్థాయిలో ఆశించిన మేర ఫలితం కనిపించకపోవడం, ప్రభుత్వ ఆదేశాలు అమలు కాకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు.
వీరఘట్టం మండలం రేగులపాడు కేజీబీవీని ప్రిన్సిపాల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ రాత్రి 10.20 నిమిషాలకు సందర్శించారు. 8వ తరగతి విద్యార్థినుల గణిత అభ్యసనా సామర్థ్యాలను పరీక్షించారు. ఆ సమయంలో చాలామంది బాలికల వద్ద పాఠ్యపుస్తకాలు లేకపోవడంతో సిబ్బందిని ప్రశ్నించారు. పాఠ్యపుస్తకాలు ఎందుకు సరఫరా చేయలేదని డీఈఓ ఎస్‌డీవీ రమణ, వీరఘట్టం ఎంఈఓ కృష్ణమూర్తిని వివరణ అడిగారు. ఎంఈఓపై చర్యలకు ఆదేశించారు.
‘విద్యార్థుల పుస్తకాలకే ప్రభుత్వం రూ.కోట్లలో ఖర్చు చేస్తోంది. ఉపాధ్యాయుల జీతాలకూ భారీగానే వెచ్చిస్తోంది. ఒక్కో విద్యార్థికీ ఏటా రూ.75 వేల చొప్పున కేటాయింపులు జరుగుతున్నాయి. ఇన్ని డబ్బులు ఇస్తున్నా క్షేత్రస్థాయిలో ఫలితాలు కనిపించడం లేదు’ అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.