Otters in Vizag: ఉమ్మడి విశాఖ జిల్లాలో అరుదైన ఏటి కుక్కల సంచారం !
Otters in Visakha: అంతరించిపోయే జాబితాలో చేరిపోయిన ఏటి కుక్కలను విశాఖ జిల్లాలోని కొండకర్ల ఆవ జలాశయంలో గుర్తించారు. విషయం తెలుసుకున్న వన్యప్రాణి ప్రేమికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Otters Spotted in Visakha: ఒట్టర్స్ గా పిలువబడే ఏటి కుక్కలను విశాఖలో గుర్తించారు. కొంతమంది వీటినే నీటి పిల్లులు అని కూడా పిలుస్తుంటారు. ఏపీలో కొల్లేరు తర్వాత అంతటి పెద్ద మంచి నీటి సరస్సుగా ఉన్న ఉమ్మడి విశాఖ జిల్లాలోని కొండకర్ల ఆవలో అనేక రకాల చేపలు, జంతువులు ఉన్నాయి. అయితే అంతరించిపోతున్న జాబితాలో ఏటి కుక్కలు కూడా చేరాయి. కానీ తాజాగా ఏటి కుక్కలు కనిపించడంతో పర్యావరణ ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కొండకర్ల ఆవ జలాశయంలో ఏటి కుక్కలు నివసిస్తున్నట్లు ఈస్ట్ కోస్ట్ కన్జర్వేషన్ టీమ్ గుర్తించింది. పాదముద్రలు, ఏటి కుక్కల విసిర్జితాల ఆధారంగా ఈ టీమ్ ఏటి కుక్కలుగా పిలిచే ఒట్టర్స్ ఇక్కడ ఉన్నట్లు పసిగట్టిన టీమ్ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. వాటిలో రికార్డ్ అయిన దృశ్యాల ఆధారంగా కొండకర్ల ఆవలో ఒట్టర్లు ఉన్నట్టు గుర్తించారు.
ముంగిసను పోలిన రూపం - పాములూ, చేపలే ఆహారం..!
ఏటి కుక్కలు చూడడానికి అచ్చం ముంగిసలానే ఉంటాయి. అయితే సైజులో మాత్రం కొంచెం పెద్దగా, జారిపోయే మృదువైన చర్మంతో ఉంటాయి. ఇవి నీటిలోనే ఎక్కువగా కాలం గడుపుతాయి. చేపలు, పాములూ, నీటికి దగ్గర్లో ఎగిరే చిన్న చిన్న పిట్టలను ఇవి వేటాడి తింటుంటాయి. నీటికి దగ్గరలో బొరియలు చేసుకుని ఉండే వీటిని మత్స్యకారులు శత్రువులుగా చూసేవారు. చేపల కోసం వారు ఏర్పాటు చేసే మాములను, చెక్కపెట్టలతో ఏర్పాటు చేసే ట్రాప్ లను ఏటి కుక్కలు అందులో ఇరుక్కున్న చేపల కోసం ధ్వంసం చేస్తుంటాయి.
గతంలో కృష్ణా, గోదావరి ప్రాంతాల్లో ఏటి కుక్కలను చంపేసేవారు. ఆ విధంగా వీటి సంఖ్య తగ్గింది. అయితే గత కొన్నేళ్లుగా వీటి సంచారం నాగార్జున సాగర్, శ్రీశైలం, ప్రకాశం బ్యారేజ్ లాంటి చోట్ల కనిపించాయి. తాజాగా అనకాపల్లి దగ్గరలోని కొండకర్ల ఆవ వద్ద కూడా వీటి సంచారం బయట పడడంతో వన్యప్రాణి ప్రేమికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కొండకర్ల ఆవలో వీటి సంచారం పై IUCN ఒట్టర్స్ జర్నల్ లో కూడా ప్రస్తావించారు.
Also Read: Vizag Beach Cleaning: విశాఖలో ‘మెగా బీచ్ క్లీనింగ్’, చెత్త ఎత్తిన మంత్రులు - పాల్గొన్న 20 వేల మంది
వేటాడితే జైలు శిక్ష తప్పదు..
ప్రపంచంలో అంతరించిపోయే జాతుల జాబితాలో ఉన్న ఏటి కుక్కలను వేటాడినా, చంపినా వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం కఠిన శిక్ష తప్పదని అధికారులు చెబుతున్నారు. అంతరించిపోతున్న జాతులను కాపాడుకోవడం వల్ల మానవాళికి చాలా మంచి జరుగుతుందని.. పొరపాటున ఎవరు కూడా ఏటి కుక్కలను చంపడం కానీ, దాడి చేయడం కానీ చేయకూడదని అధికారులు వివరిస్తున్నారు. నదులలోనూ, సరస్సుల్లోనూ సమతుల్యత పాటించాలంటే ఏటి కుక్కల సంచారం తప్పనిసరి. కొండకర్ల ఆవలో ఏటి కుక్కలు ఉన్నాయంటే.. దానికి సమీపంలోని శారదా నది, వరాహ నదుల్లో కూడా ఇవి ఉండే అవకాశం ఉందని.. ఆ దిశగా అధ్యయనం జరగాలని ఈస్ట్ కోస్ట్ కన్జర్వేటివ్ టీమ్ చెబుతుంది.