కాపులకు టిక్కెట్లు ఇచ్చే పార్టీలనే గెలిపిస్తాం - కాపునాడు జేఏసి నేతలు స్పష్టీకరణ
Only parties that give tickets to Kapus will win says kapunadu leaders : రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో కాపులకు అత్యధిక సీట్లను ఇచ్చే పార్టీలను గెలిపిస్తామని కాపు జేఏసీ నేతలు విశాఖ వేదికగా ప్రకటించారు.
Kapunadu Leaders: రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో కాపులకు అత్యధిక సీట్లను ఇచ్చే పార్టీలను గెలిపిస్తామని కాపు జేఏసీ నేతలు విశాఖ వేదికగా ప్రకటించారు. విశాఖ జిల్లా కాపు నాడు ఆధ్వర్యంలో కాపు ఉద్యమ జేఏసి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం మంగళవారం మేఘాలయ హోటల్ లో జరిగింది. ఈ సందర్భంగా జేఏసీ నేతలు మాట్లాడుతూ రానున్న ఎన్నికలకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. కాపు నాడు విశాఖ జిల్లా అధ్యక్షుడు తోట రాజీవ్ మాట్లాడుతూ కాపు ఉద్యమ జేఏసి 2015 నుంచి కాపుల సంక్షేమ కోసం పాటు పడుతోందన్నారు. జాతీయ స్థాయిలో ముద్రగడ నాయకత్వంలో జైలుకి వెళ్లి, స్టేషన్లలో పడిగాపులు కాసిన నేతలు ఉన్నారని, చిత్త శుద్ధితో పోరాటం చేసి వెనక్కు చూస్తే బాధ మిగులుతోందన్నారు. కాపులకు ప్రభుత్వ భరోసా లేదని, బీసీ జాబితాలో చేరిస్తే మేలు జరుగుతుందని రాజీవ్ స్పష్టం చేశారు. తమ పోరాటంలో 80 శాతం సక్సెస్ అయ్యామని, రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపిన రిజర్వేషన్ నివేదిక ఇవ్వాలని డిమాండ్ చేసిన రాజీవ్.. 20 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో కాపు ఓట్లు కావాలి అంటే తమ సమస్యలను కోల్డ్ స్టోరేజి నుంచి తీయాలని డిమాండ్ చేశారు. 28 శాతం జనాభా ప్రకారం టికెట్స్ ఇవ్వాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా సీట్లు, నామినేటెడ్ పోస్టులకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని రాజీవ్ డిమాండ్ చేశారు. తూర్పు కాపులకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని, రాయలసీమలో కాపులకు ప్రాధాన్యత లేదని రాజీవ్ ఆరోపించారు. కాపు జేఏసికి చెందిన ముద్రగడ పద్మనాభానికి రాజకీయ పార్టీలు సముచిత గౌరవం ఇవ్వాలని ఆయన కోరారు.
25 శాతం సీట్లు ఇవ్వాలని కోరిన సాయి సుధాకర్
కాపునాడు నేత సాయి సుధాకర్ మాట్లాడుతూ కాపులకు 25 శాతం టిక్కెట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆనంద ఎన్నికల్లో అధిక సీట్లు కాపులకు ఇచ్చే పార్టీని గెలిపిస్తామని స్పష్టం చేశారు. కాపు ఉద్యమ నేతలకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు ఇవ్వాలని కోరారు. కాపునాడు నేత ఆకుల రామకృష్ణ మాట్లాడుతూ జేఏసిలో కాపు సమస్యలు మీద చర్చ జరిగిందని, కాపులను బీసీల్లో చేర్చాలి అని పలు కమిటీలు సిఫారసు చేసినా అమలు చేయడం లేదని విమర్శించారు. ఏటా వెయ్యి కోట్లతో సంక్షేమం కోసం నిధులు ఇస్తామని మాట మాట ఇచ్చిన ప్రభుత్వం.. ఆ మాట తప్పిందని ఆరోపించారు. కాపు కార్పొరేషన్ ఏర్పాటు, విదేశీ విద్య, కాపు భవన్లు నిర్మాణం చేస్తామని చెప్పారని, సిఎం జగన్ ఏటా రెండు వేల కోట్లు ఇస్తామని చెప్పారని, తీరా ఇప్పుడు అన్ని పథకాలు కింద కాపులకు 30 వేల కోట్లు ఇచ్చాము అంటున్నారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం కాపు నేతలు పేర్లను కొన్ని కొత్త జిల్లాలకు పెట్టలేదని విచారం వ్యక్తం చేశారు. కాపులకు సామాజిక న్యాయం చేయాలని ఆయన కోరారు. సమావేశంలో జిల్లా కాపునాడు నేతలు బీఎన్ మూర్తి, నక్కా వెంకట రమణ, తోట నగేష్, కార్పొరేటర్ గంధం శ్రీనివాస రావు, కే సత్యనారాయణ, శ్రీదేవి, నల్లా విష్ణు, వాసు, రెడ్డి యేసుదాసు, చందు జనార్ధన్, ఆరెడ్డి ప్రకాష్, ముత్యాల రామ దాస్, కిక్కిరెళ్ళ సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.