Rushikonda Green Carpet : పచ్చగా మారిపోయిన రుషికొండ - ఈ మ్యాజిక్ ఎలా జరిగిందో తెలుసా ?
రుషికొండ ప్రాంతంలో తవ్విన చోట గ్రీన్ మ్యాట్ కప్పారు అధికారులు. ఎందుకు చేశారన్నదానిపై స్పష్టత లేదు.
Rushikonda Green Carpet : రుషికొండ అంతా పచ్చగా కనిపించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. తవ్వేసిన చోట మొత్తం తవ్వినట్లుగా కనిపించకుండా గ్రీన్ కార్పెట్‌ను అధికారులు రాత్రికి రాత్రి పరిచేశారు. గతంలో తవ్విన చోట.. తవ్వినట్లుగా స్పష్టంగా కనిపించేది. కానీ ఈ గ్రీన్ కార్పెట్ ను పరవడంవల్ల దూరం నుంచి చూసిన వారికి కొండ అంతా పచ్చగా కనిపిస్తోంది. అయితే ఇలా ఎందుకు చేశారన్న దానిపై అధికారవర్గాలు ఎలాంటి ప్రకటన చేయలేదు. తవ్వేసిన కొండ ను గ్రీన్ కార్పెట్‌తో కవర్ చేయడంపై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి.
రుషికొండపై గతంలో ఉన్న రిసార్టును కూలగొట్టి కొండను తవ్వేసి కొత్త నిర్మాణాలు చేపడుతున్నారు. ఈ నిర్మాణాలు సీఎం క్యాంప్ ఆఫీస్ అన్న ప్రచారం జరుగుతోంది. అవి సీఎం క్యాంప్ ఆఫీస్ కార్యాలయాలు అయితే తప్పేంటి అని బొత్స సత్యనారాయణ కూడా ఓ సారి ప్రకటించడంతో వాటి నిర్మాణం అందుకే అనుకుంటున్నారు. అయితే కొండను తవ్వేయడం నిబంధనలకు విరుద్ధమని.. అనుమతించిన దాని కన్నా ఎక్కువ తవ్వేశారని హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. విచారణ జరిపిన హైకోర్టు ఐదుగురు కేంద్ర పర్యావరణ శాఖ అధికారులతో కమిటీని నియమించాలని ఆదేశించింది. సమగ్ర సర్వేకు నియమించే బృందంలో ఐదుగురు సభ్యులను నియమించాలని కేంద్ర పర్యావరణ, అటవీశాఖకు ఏపీ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అక్రమ తవ్వకాలను నిగ్గు తేల్చేందుకు సమగ్ర సర్వే చేయాలని హైకోర్టు ఆదేశించింది. జనవరి 31 లోపు నివేదిక ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది.
అయితే హైకోర్టు ఆదేశాల మేరకు హైకోర్టుకు నివేదిక సమర్పించిందో లేదో స్పష్టత లేదు. కానీ రుషికొండకు గ్రీన్ మ్యాట్ కప్పడంతో రాజకీయంగా విమర్శలు వస్తున్నాయి. రుషికొండ తవ్వకాల విషయంలో ఏపీలో విపక్షాలు మొదటి నుంచి తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. పర్యావరణ విధ్వంసానికి పాల్పడుతున్నారని.. అనేక వీడియోలు విడుదల చేశారు. విమానంలో నుంచి వెళ్తున్న సమయంలో... తీసిన రుషికొండ ఫోటోలు పలుమార్లు వైరల్ అయ్యాయి. ఆ ఫోటోల్లో.. రుషికొండ చుట్టూ తవ్వేసినట్లుగా స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు ఆ గ్రీన్ మ్యాచ్ ను పెట్టడం వల్ల ఇక అంతాపచ్చగానే కనిపిస్తుందని.. ఎంత మేర తవ్వారో తెలియకుండా ఉంటుందని అందుకే అలా చేస్తున్నారన్న వాదన వినిపిస్తోంది.
మరో వైపు రుషికొండపై సర్వే చేయడానికి హైకోర్టు ఆదేశాలతో నియమితులైన కమిటీ పర్యటిస్తుందని.. అందుకే వారికిపెద్దగా కనిపించకుండా ఈ ఏర్పాటు చేస్తున్నారన్న వాదన ఉంది. అయితే పైపైన అధికారులు చూడరని ఎంత మేర తవ్వారో సర్వే కూడా చేస్తారని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం నిర్మాణ కార్యకలాపాలు జోరుగా సాగుతున్నందున.. తవ్వేసిన ప్రాంతం నుంచి దుమ్ము విపరీతంగా లేస్తుందని.. అలా లేవకుండా.. గ్రీన్ మ్యాట్స్ ఏర్పాట్లు చేసి ఉంటారని మరికొంత మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎందుకు ఇలా ఏర్పాటు చేశారో స్పష్టత రావాలంటే.. అధికారులే ప్రకటించాల్సి ఉంది. ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.