అమెరికా సహకారంతో శ్రీకాకుళం జిల్లా కొవ్వాడలో అణు విద్యుత్ కేంద్రం
శ్రీకాకుళం జిల్లా కొవ్వాడపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. అమెరికా సహకారంతో అణువిద్యుత్ కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపింది.
అమెరికా సహకారంతో శ్రీకాకుళం జిల్లా కొవ్వాడలో అణు విద్యుత్ కేంద్రం నెలకొల్పాలని ప్రతిపాదించినట్లు మంత్రి జితేంద్ర సింగ్ రాజ్యసభకు తెలిపారు. వైస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబు ఇచ్చారు.
మొత్తం ఆరు రియాక్టర్లతో 1,208 మెగావాట్ల సామర్ధ్యంతో అణు విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. అయితే దేశీయంగా తయారయ్యే ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ (పీహెచ్‌డబ్ల్యూఆర్)ను ప్రతిపాదిత కొవ్వాడ అణు విద్యుత్ కేంద్రంలో ఏర్పాటు చేయడం లేదని స్పష్టం చేశారు.
దేశం మొత్తం మీద ప్రస్తుతం 18 ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ అణు విద్యుత్ ఉత్పత్తి చేస్తుండగా మరో ఆరు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నాయి. అదనంగా మరో 10 ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ ఏర్పాటుకు ఆర్థిక, పాలనాపరమైన మంజూరు జరిగింది. ఈ మొత్తం రియాక్టర్ల ద్వారా 7 వేల మెగావాట్ల అణు విద్యుత్ ఉత్పత్తి అవుతుందని మంత్రి వివరించారు.
న్యాయ వ్యవస్థలో మౌలిక వసతుల కల్పనకు కేంద్ర పథకం
న్యాయ వ్యవస్థలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఓ పథకాన్ని అమలు చేస్తున్నట్లు న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజుజు తెలిపారు. విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ న్యాయ వ్యవస్థలో మౌలిక సదుపాయలను కల్పించి, అభివృద్ధి చేసే ప్రాథమిక బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వలదే. అయినప్పటికీ ఈ ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థిక తోడ్పాటు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం పథకాన్ని ప్రారంభించిందని చెప్పారు.
ఈ పథకం కింద న్యాయ వ్యవస్థలో మౌలిక వసతుల అభివృద్ధికి అయ్యే ఖర్చులో కేంద్రం 60 శాతం భరిస్తుంది. మిగిలిన మొత్తం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలి. ఈశాన్య రాష్ట్రాలు, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలైతే వ్యయంలో కేవలం 10 శాతం భరిస్తే సరిపోతుంది. కేంద్ర పాలిత ప్రాంతాల్లో మొత్తం వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని మంత్రి తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ఏప్రిల్ 2021 నుంచి మరో అయిదేళ్ళపాటు పొడిగించిందని మంత్రి చెప్పారు. ఈ పథకం కింద 9 వేల కోట్ల రూపాయలు కేటాయించగా అందులో కేంద్ర ప్రభుత్వం వాటా 5307 కోట్లని తెలిపారు. ఈ పథకం కింద కోర్టు భవనాలు, న్యాయాధికారుల నివాస సముదాయాల నిర్మాణం, కోర్టు భవనాలలో టాయిలెట్లు, డిజిటల్ కంప్యూటర్ గదుల, జిల్లా, సబార్డినేట్ కోర్టులలో లాయర్ హాల్స్ వంటి నిర్మాణాలను చేపట్టడం జరుగుతుందని చెప్పారు.
1993-94లో ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాలకు 8758 కోట్లు విడుదల చేసింది. అందులో ఆంధ్రప్రదేశ్ వాటా 199 కోట్ల రూపాయలని మంత్రి తెలిపారు.