Vizag AI Data Center: విశాఖలో ఏఐ డేటా సెంటర్‌కు నారా లోకేష్ శంకుస్థాపన, రెండు దశల్లో అభివృద్ధికి ప్లాన్
Nara Lokesh విశాఖపట్నంలో ఏఐ డేటా సెంటర్ (AI Data Center)కు ఏపీ ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. సిఫీ టెక్నాలజీస్ ఈ సెంటర్ ఏర్పాటు చేస్తుందని తెలిసిందే.

AI Data Center In Visakhapatnam: విశాఖపట్నం: విశాఖపట్నం సిటీలో పలు కీలక ప్రాజెక్టుల ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) శంకుస్థాపన చేశారు. మొదటి ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్‌తో పాటు ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్‌కు ఆదివారం ఉదయం నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. ప్రముఖ డిజిటల్ ఐటీ సొల్యూషన్స్ ప్రొవైడర్ సిఫీ టెక్నాలజీస్ అనుబంధ సంస్థ సిఫీ ఇన్ఫినిట్ స్పేసెస్ లిమిటెడ్ విశాఖలో 50 మెగావాట్ల ఏఐ ఆధారిత ఎడ్జ్ డేటా సెంటర్ (AI Data Center) తో పాటు ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ఏర్పాటు చేస్తోంది.

సిఫీ టెక్నాలజీస్ నాస్‌డాక్‌లో నమోదైన కంపెనీ. సిఫీ ఇన్ఫినిట్ స్పేసెస్ లిమిటెడ్ దాదాపు రూ.1,500 కోట్ల పెట్టుబడితో రెండు దశల్లో డేటా సెంటర్‌ను ఏర్పాటు చేసి అభివృద్ధి చేయనుంది. ఈ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుతో గ్లోబల్ డిజిటల్ గేట్‌వేగా విశాఖపట్నం నగరం మారుతుందని నారా లోకేష్ ధీమా వ్యక్తంచేశారు. ఈ డేటా సెంటర్ ఏర్పాటుతో వెయ్యి మంది యువతకు ఉద్యోగాలు, ఉపాధి లభించనుందని ప్రభుత్వం తెలిపింది.

హైదరాబాద్‌ను మించేలా పదేళ్లలో విశాఖ అభివృద్ధి
ఈ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. 1990 దశకంలో హైదరాబాద్ నగరానికి ఐటీ కంపెనీలు రావడానికి ఎలాంటి పరిస్థితులు కల్పించారో.. ఇప్పుడు విశాఖ నగరానికి ఐటీ కంపెనీలు రావడానికి చంద్రబాబు అలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు. సైబర్ టవర్ తో పలు కంపెనీలు హైదరాబాద్ కు వచ్చాయి. హైదరాబాద్ 30 ఏళ్లలో ఎంత అభివృద్ది చెందిందో.. కేవలం 10 ఏళ్ల కాలంలోనే విశాఖను అదే స్థాయిలో అభివృద్ధి చేస్తాం. ఇతర రాష్ట్రాలతో కాదు, ఇతర దేశాలతో ఏపీ పోటీ పడుతుంది. నేడు విశాఖకు ఐటీ కంపెనీలు, డేటా సెంటర్ల ఏర్పాటుకు రావడానికి ఎంతో మంది కృషి చేశారు. భవిష్యత్తులో మరిన్ని కంపెనీలు ఇక్కడికి వచ్చి ఇన్వెస్ట్ చేస్తాయి, తద్వారా లక్షల మంది ఉపాధి, ఉద్యోగ అవకాశాలు వస్తాయని’ నారా లోకేష్ దీమా వ్యక్తం చేశారు.
2047 నాటికి జీవీఎంసీ 1 ట్రిలియన్ డాలర్ ఎకానమీ
విశాఖ వేగంగా అభివృద్ది చెందుతున్న నగరం. 2047 నాటికి విశాఖపట్నం 1 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మారుతుంది. ఇది మా అజెండా. ప్రతి రాష్ట్రానికి ఒకే రాజధాని ఉంటుంది. కానీ అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి. మేం పోటీ చేసిన స్థానాల్లో 94 శాతం సీట్లు నెగ్గాం. 2019లో మేం చాలా చోట్ల ఓడినా విశాఖలో మాత్రం మేం నెగ్గాం. 2014లో ఎన్డీయే కూటమినెగ్గింది. చంద్రబాబు సీఎం అయ్యాక వెంటనే హుదూద్ తుఫాన్ వచ్చి, విశాఖ మొత్తం నాశనం అయింది. కానీ చంద్రబాబు నాయుడు ఉన్నారని విశాఖ ప్రజల్లో నమ్మకం కనిపించింది. రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల్లో 50 శాతం విశాఖకే వచ్చాయి.
సూపర్ సిక్స్ ప్రకారం 20 లక్షల ఉద్యోగాలు
సూపర్ సిక్స్ హామీ ప్రకారం రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. అందులో కేవలం విశాఖలోనే 5 లక్షల ఐటీ ఉద్యోగాలు కల్పిస్తామని ఐటీ శాఖ మంత్రిగా హామీ ఇస్తున్నాను. టీసీఎస్ కంపెనీకి 99 పైసలకు భూమి ఇచ్చారని విమర్శించారు. కొందరు రాజకీయం చేసి కోర్టుకు వెళ్లారు. కానీ మేం చేసిన చర్యలతో గూగుల్, కాగ్నిజెంట్, యాక్సెంచర్ లాంటి చాలా కంపెనీలు విశాఖకు వస్తున్నాయి. ప్రభుత్వ పరంగా అవసరమైన పాలసీలు తీసుకొచ్చాం.
ఇది కేవలం డబుల్ ఇంజిన్ సర్కార్ మాత్రమే కాదు
ఏపీలో ఉన్నది కేవలం డబుల్ ఇంజిన్ సర్కార్ మాత్రమేకాదు. బుల్లెట్ ట్రైన్ మీద ఉన్న డబుల్ ఇంజిన్ సర్కార్. రెండు డబుల్ ఇంజిన్లు బుల్లెట్ ట్రైన్ వేగంతో వెళ్తుంటే ఇలా ఉంటుంది. ఒకేచోట 3 లక్షల మంది యోగా చేసి విశాఖలో రికార్డులు నెలకొల్పాం. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకున్నాం. కేంద్రం రూ.11 వేల కోట్లు ప్రకటిస్తే.. ఏపీప్రభుత్వం రూ.3 వేల కోట్లుతో చర్యలు చేపట్టింది. విశాఖ స్టీల్ ప్లాంటును లాభాల బాట పట్టించి పరుగులు పెట్టిస్తాం. వచ్చే 3 నెలల్లో విశాఖలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు, కొత్త కంపెనీలు, పెట్టుబడులు వస్తాయన్నారు నారా లోకేష్.






















