Minister Botsa: మణిపూర్ నుంచి ఏపీ విద్యార్థులను క్షేమంగా తీసుకొస్తాం, హెల్ప్ లైన్ నెంబర్లు ఇవే - మంత్రి బొత్స
మణిపూర్ రాష్ట్రంలో అల్లర్లు జరుగుతున్న క్రమంలో, అక్కడ ఉన్న ఏపీ విద్యార్థులను గుర్తించి, వారిని క్షేమంగా రాష్ట్రానికి తీసుకువస్తామని రాష్ట్ర విద్యాశాఖామత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.
- ఏపీ విద్యార్థులను మణిపూర్ నుంచి రాష్ట్రానికి రప్పిస్తాం
- ఇంకా విద్యార్థులు మిగిలి ఉంటే తమ పేర్లను నమోదు చేసుకోవాలి
- సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 8800925668, 9871999055
అకాల వర్షాలవల్ల నష్టపోయిన రైతులను ఆదుకుంటాం
- రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ
విజయనగరం: మణిపూర్ రాష్ట్రంలో అల్లర్లు జరుగుతున్న క్రమంలో, అక్కడ ఉన్నత విద్యను అభ్యసిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన విద్యార్థులను గుర్తించి, వారిని క్షేమంగా రాష్ట్రానికి తీసుకువస్తామని రాష్ట్ర విద్యాశాఖామత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఇప్పటివరకు సుమారు వంద మంది విద్యార్థులు తమ పేర్లను నమోదు చేసుకున్నారని, ఇంకా ఎవరైనా ఉంటే , రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ ను సంప్రదించాలని మంత్రి బొత్స సూచించారు. ఏపీ భవన్ లోని అధికారుల +91 8800925668, +91 9871999055 నంబర్లను కాంటాక్టు చేయాలన్నారు.
విజయనగరంలోని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి నివాసంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి బొత్స మాట్లాడుతూ.. మణిపూర్ లో ఉన్న ఏపీకి చెందిన విద్యార్థుల సమస్యను ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకువెళ్లామని, అక్కడ చదువుతున్న విద్యార్థుల జాబితాను రూపొందించామని, వారికి అన్ని విధాలా అండగా ఉంటాంమని హామీ ఇచ్చారు. దీనిపై కేంద్ర పౌర విమానయాన శాఖా మంత్రితో కూడా మాట్లాడినట్లు తెలిపారు. తల్లిదండ్రులు, విద్యార్థులు ఆందోళన చెందవద్దని కోరారు. ఇంకా 50 మంది వరకు ఉండచ్చు నని అంచనా వేస్తున్నామని, 150 మందికి సరిపడ్డ విమానం ఏర్పాటు చేశామని తెలిపారు. ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారులు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.
పెద్దగా పంట నష్టం లేదన్న మంత్రి బొత్స
అకాల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఉత్తరాంధ్రలో వర్షపాతం ఉన్నప్పటికీ, పెద్దగా పంట నష్టం లేదని మంత్రి బొత్స చెప్పారు. అక్కడక్కడా మొక్కజొన్న, అరటికి కి కొద్దిగా నష్టం వాటిల్లిందని చెప్పారు. మిగిలిన జిల్లాల్లో వివిధ పంటలకు జరిగిన నష్టాన్ని అంచనా వేస్తున్నామని, క్షేత్ర స్థాయిలో సిబ్బంది ఈ పనిలో నిమగ్నం అయ్యారని అన్నారు. ప్రభుత్వం ప్రతి జిల్లాకి స్పెషల్ ఆఫీసర్ ని నియమించిందనీ, వారు జిల్లాల వారిగా సమీక్ష చేసి, పంట నష్టాలు నమోదు చేయడం జరుగుతుందనీ తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసే బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు.
పంట నష్టపోయిన ప్రతీ రైతుని ఆదుకుంటామని భరోసానిచ్చారు. ఇటీవల విడుదల అయిన టెన్త్ ఫలితాలు పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది టెన్త్, ఇంటర్ ఫలితాలను మరింత మెరుగు పర్చేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. ప్రైవేటు విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణకు తగిన యంత్రాంగం ఇప్పటికే పనిచేస్తోందని, ఫీజులు అధికంగా ఉంటే కమిషన్ కి ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. తమ ప్రభుత్వ హయాంలో ప్రైవేటు కంటే ప్రభుత్వ విద్యా సంస్థల్లో నే ఎక్కువమంది విద్యార్థులు ఉన్నారని చెప్పారు. తమ ప్రభుత్వం ప్రభుత్వ విద్యా రంగాన్ని అభివృద్ధి చేసి, మౌలిక సదుపాయాలను కల్పించడంతో, విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు.విద్యా ప్రమాణాలను పెంచేందుకు ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చాను చెప్పారు. విద్యపై పెట్టే ఖర్చు అంతా రాష్ట్ర భవిషత్ కు పెట్టుబడిగా ముఖ్యమంత్రి భావిస్తున్నారని చెప్పారు. విలేకర్ల సమావేశంలో శాసనసభ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి పాల్గొన్నారు.