Kuwait Fire Accident : కువైట్ ప్రమాదంలో ముగ్గురు ఏపీ వాసులు దుర్మరణం- ఒక్కొక్కరిది ఒక్కో గాథ- మృతదేహాల తరలింపు కోసం ప్రత్యేక ఏర్పాట్లు
Kuwait Fire Accident: కువైట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఏపీకి చెందిన ముగ్గురు మృత్యువాత చెందారు. వీరిలో ఒక్కొక్కరిది ఒక్కో గాథ. వీరి మరణ వార్త తెలిసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా వినిపిస్తున్నారు.
Fire Accident In Kuwait : కువైట్ లోని మంగఫ్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదంలో మొత్తం 50 మంది మృతి చెందగా, వీరీలో 45 మంది భారతీయులు, ముగ్గురు ఫిలిప్పీన్స్ జాతీయులు ఉన్నట్లు కువైట్ అధికారులు ప్రకటించారు. మృతి చెందిన భారతీయుల్లో ముగ్గురు ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వాళ్లంతా కొద్దిరోజుల కిందటే అక్కడికి వెళ్లి ప్రాణాలు కోల్పోవడం బాధను కలిగించే విషయం. ఈ ప్రమాదంలో మృతి చెందిన ఒక్కొక్కరిది ఒక్కో గాథ.
శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం జింకిభద్రకు చెందిన తామడ లోకనాథం(31) ఆరేళ్లుగా ఎన్బిటిసి సంస్థలో రోలింగ్ ఆపరేటర్ హెల్పర్‌గా పని చేస్తున్నారు. ఇటీవల స్వగ్రామానికి వచ్చి వెళ్లారు. మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత తన క్యాంపునకు చేరుకొని ప్రయాణ బడలికతో నిద్రపోయాడు. బుధవారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో నిద్రలోనే మృత్యుఒడిలోకి జారుకున్నారు. నిబంధనల ప్రకారం ఆయన క్యాంపునకు తిరిగి రాగానే ఆ వివరాలను ఎంట్రీ చేయించుకోవాలి. అలా చేయకపోవడం వల్ల క్యాంపు లిస్టులో అతని పేరును చేర్చలేదు. దీంతో మరణ ధ్రువీకరణలో ఆలస్యం జరిగింది.
లోకనాథం ఇటీవలే ఊర్లోని గ్రామదేవత సంబరాలు కోసం కువైట్ నుంచి వచ్చారు. ఎన్నికల ఫలితాలను చూసి అందరితో సరదాగా గడిపి మంగళవారం కువైట్ బయలుదేరారు. అర్ధరాత్రి దాటిన తర్వాత క్యాంపును చేరుకుని నిద్రలోనే తిరిగిరాని లోకాలు చేరుకున్నారు. లోకనాథం మృతితో జింకిభద్రలో విషాదఛాయలు అలుముకున్నాయి. తమను ఆదుకుంటాడనుకున్న కొడుకు లేడని తెలుసుకుని లోకనాథం తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. మృతదేహాన్ని వెనక్కి రప్పించేలా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చొరవ తీసుకుంటున్నట్లు చెబుతున్నారు.
ఇదే క్యాంపులో మరో ఐదుగురు తెలుగువాళ్ళు ఆశ్రయం పొందారు. తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం అన్న వరప్పాడుకు చెందిన మీసాల ఈశ్వర్ (45), పెరవలి మండలం కండవల్లికి చెందిన ముల్లేటి సత్యనారాయణ (45) చనిపోయినట్లు కువైట్ లోని భారత రాయబార కార్యాలయం గురువారం రాత్రి అధికారికంగా ప్రకటించింది. వీరిద్దరూ హైవే స్టోర్ లో డెలివరీ బాయ్స్ గా పని చేస్తున్నారు.
మీసాల ఈశ్వర్ పదేళ్లుగా కువైట్ లోని హైవే సూపర్ మార్కెట్లో సేల్స్ బాగా పని చేస్తున్నారు. ఆయనకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఇటీవలే కుమార్తెకు వివాహం నిశ్చయమైనా విమానం టికెట్ ధరలు ఎక్కువగా ఉండడంతో కువైట్ నుంచి రావడానికి మరో నాలుగు రోజులకు వాయిదా వేసుకున్నారు. నాలుగు రోజుల్లో వస్తాడనుకున్న ఈశ్వర్ విగతిజీవిగా వస్తుండడంతో ఆయన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరువుతున్నారు.
ఇదే ప్రమాదంలో మృతి చెందిన బుల్లెట్ సత్యనారాయణ తన కుటుంబాన్ని పోషించుకునేందుకు పదేళ్లుగా కువైట్లో పని చేస్తున్నారు. ఈయనకు భార్య, చదువుకునే కుమారుడు, తల్లిదండ్రులు ఉన్నారు. బుధవారం నాటి అగ్ని ప్రమాదంలో సత్యనారాయణ తీవ్ర గాయాల పాలయ్యారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం మృతి చెందారు.
ప్రాణాలు నిలబెట్టుకున్న ఎంతోమంది
అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత ఎంతో మంది తమ ప్రాణాలను దక్కించుకునేందుకు పరుగులు పెట్టారు. ఈ క్రమంలోనే చనిపోయారు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం కొమ్మగూడెం గ్రామానికి చెందిన కే గంగయ్యతోపాటు తెలంగాణకు చెందిన మరో ఇద్దరు కూడా ప్రమాదం జరిగిన భవనంలోనే ఉన్నారు. తెల్లవారుజామున ప్రమాదం జరగగానే వీరు తప్పించుకునే ప్రయత్నం చేశారు. మెట్లపై మాడిపోయిన స్థితిలో మృతదేహాలు కనిపించడం, దట్టమైన పొగ అలుముకోవడంతో భవనంపై నుంచి దూకేశారు. కేబుల్ వైర్ల సాయంతో రెండో అంతస్తు నుంచి దూకినట్లు గంగయ్య తెలియజేశారు.
ఈ ప్రమాదంలో మృతి చెందిన 50 మంది మృతదేహాలు గుర్తించలేని విధంగా తయారు కావడంతో అధికారులు వీరిని గుర్తించడంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. కువైట్ లో పనిచేసే తండ్రి ప్రదీప్ తన కుమారుడు మృతదేహాన్ని గుర్తించడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చివరకు తన కొడుకు ఒంటిపై ఉండే టాటూ ద్వారా గుర్తించగలిగారు. శరీరమంతా మసిబారిపోయి ముఖం ఉబ్బి ఉందని, టాటూ లేకుంటే గుర్తించడం కష్టమయ్యేదని ఆయన కన్నీటి పర్యంతమయ్యారు.
మిగిలిన మృతదేహాలు గుర్తింపునకు డిఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వైద్య వర్గాలు చెబుతున్నాయి. ఆ తర్వాతే స్వదేశాలకు మృతదేహాలు తరలింపు ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. మృతి చెందిన భారతీయుల్లో కేరళకు చెందినవారు 23 మంది, తమిళనాడుకు చెందిన ఎనిమిది మంది ఉన్నారు. మిగిలిన వారిలో ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్ నుంచి ముగ్గురేసి, ఒడిశా నుంచి ఇద్దరు, హర్యానా, ఝార్ఖండ్, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, కర్ణాటక, బిహార్ రాష్ట్రాలకు చెందిన ఒక్కో బాధితుడు ఉన్నారని భారత విదేశాంగ శాఖ గురువారం రాత్రి ఒక ప్రకటనలో తెలియజేసింది. కువైట్ అగ్ని ప్రమాదంలో మృతి చెందిన భారతీయుల మృతదేహాలను వెనక్కి తీసుకొచ్చేందుకు ప్రభుత్వ ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే వాయుసేన విమానం కువైట్ చేరుకుంది.
కువైట్ అగ్ని ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు కేంద్రం రెండు లక్షల చొప్పున నష్ట పరిహారం ప్రకటించగా, కేరళ సీఎం ఫెనరై విజయన్ ఐదు లక్షలు చప్పున పరిహారాన్ని ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఇస్తామని మలయాళీ వ్యాపారవేత్త యూసఫ్ అలీ, రెండు లక్షలు చొప్పున ఇస్తామని మరో వ్యాపారవేత్త రవి పిళ్ళై వెల్లడించారు.