Kodi Katti Sreenu: జైలు నుంచి కోడికత్తి శ్రీను విడుదల - మీడియాతో ఏం మాట్లాడాడంటే
Kodi Katti Case: కోర్టు తీర్పు మేరకు శుక్రవారం (ఫిబ్రవరి 9) జైలు నుంచి బయటికి వచ్చాడు. ఈ సందర్భంగా కోడికత్తి శీను మాట్లాడుతూ.. తనకు బెయిల్ రావడానికి ప్రయత్నించిన వారికి ధన్యవాదాలు తెలిపారు.
Kodi Katti Sreenu Released: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతిపక్ష నేత స్థానంలో ఉండగా ఆయనపై దాడి చేసిన కేసులో నిందితుడైన కోడికత్తి శీను బెయిల్ పై విడుదలయ్యాడు. దాదాపు ఐదేళ్లుగా ఆయన జైలులో రిమాండ్ ఖైదీగా ఉంటుండగా.. తాజాగా కోర్టు తీర్పు ఇవ్వడంతో శుక్రవారం (ఫిబ్రవరి 9) జైలు నుంచి బయటికి వచ్చాడు. ఈ సందర్భంగా కోడికత్తి శీను మాట్లాడుతూ.. తనకు బెయిల్ రావడానికి ప్రయత్నించిన వారికి ధన్యవాదాలు తెలిపారు. ఇన్నాళ్లు తాను జైలులో ఉండగా, తనకు అండగా నిలిచిన దళిత సంఘాలకు కూడా ధన్యవాదాలు తెలిపారు. శ్రీనివాస్ తరపు న్యాయవాది సలీం మాట్లాడుతూ.. ఆయన బెయిల్ కోసం తాను మానవతా దృక్పథంతో ప్రయత్నించానని చెప్పారు. బయటికి వచ్చిన అతనికి ఏం జరిగినా ఏపీ ప్రభుత్వానిదే బాధ్యత అని న్యాయవాది సలీం మాట్లాడారు.
విశాఖ సెంట్రల్ జైలు నుంచి, బెయిల్‌పై కోడి కత్తి శీనివాస్ శుక్రవారం విడుదల అయ్యే సమయంలో ఆయనకు దళిత సంఘాలు ఘన స్వాగతం పలికాయి. జై భీమ్, న్యాయం గెలిచింది అంటూ నినాదాలు చేశారు. జైలు నుంచి శ్రీనివాస్‌ను తీసుకొని న్యాయవాది శ్రీనివాస్, సలీం, విదసం నాయకుడు బూసి వెంకటరమణ వచ్చారు. న్యాయవాదులు దళిత సంఘాల సమక్షంలో తండ్రి కుటుంబ సభ్యులకు శీనివాస్‌ను అప్పగించ్చారు.
ఐదేళ్ల క్రితం ఘటన
2018లో అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్ పై విశాఖపట్నం ఎయిర్ పోర్టులోని లాబీలో శ్రీనివాస్ అనే యువకుడు కోడి కత్తితో దాడి చేశాడు. దాడి చేశాక పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. జగన్ కు అప్పట్లో చేయికి గాయం అయింది. దీంతో ఆయన హైదరాబాద్ కు వెళ్లి వైద్యం చేయించుకున్నారు. నిందితుడైన శ్రీనివాస్ ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.
అలా శ్రీనును పోలీసులు విచారణ చేశారు. విచారణ సమయంలో శ్రీనివాస్ మాట్లాడుతూ.. జగన్ ను సీఎంగా చూడాలన్నదే తన ఆశ అని అన్నారు. ఈ దాడి చేస్తే ఎన్ని కల్లో జగన్‌కు సానుభూతి వస్తుందని నిందితుడు చెప్పాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో వైసీపీ భారీ విజయం నమోదు చేయగా.. ఆ తర్వాత నిందితుడిని విడుదల చేయాలని అతని తల్లిదండ్రులు వేడుకున్నారు. నిందితుడు శ్రీనివాస్ కు బెయిల్ ఇవ్వాలంటూ ఆయన తల్లి, అన్న నిరవధిక దీక్షకు కూడా దిగారు. అయినా ప్రభుత్వం పట్టించుకోలేదు. దళిత సంఘాలు కూడా ప్రభుత్వ తీరుపై గళం ఎత్తాయి. మొత్తానికి ఐదేళ్లకు ఇప్పుడు శ్రీను బెయిల్ పై విడుదల అయ్యాడు.