(Source: ECI/ABP News/ABP Majha)
VV Lakshmi Narayana: రాష్ట్రంలో అల్లర్ల టైంలో జగన్ లండన్ పర్యటనా? లక్ష్మీ నారాయణ కీలక వ్యాఖ్యలు
AP Latest News in Telugu: లక్ష్మీ నారాయణ విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడారు. ఎన్నికల తర్వాత రాష్ట్రంలో వివిధ చోట్ల జరుగుతున్న హింసాత్మక ఘటనలు, ఘర్షణలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.
Lakshmi Narayana on CM Jagan London tour: ఏపీలో ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితుల నడుమ సీఎం జగన్ విదేశీ పర్యటనకు వెళ్లడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యమంత్రి రెండు రోజుల క్రితం యూకే పర్యటనకు వెళ్లడంపై జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంపై ఆదివారం (మే 19) లక్ష్మీ నారాయణ విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడారు. ఎన్నికల తర్వాత రాష్ట్రంలో వివిధ చోట్ల జరుగుతున్న హింసాత్మక ఘటనలు, ఘర్షణలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఇలాంటి ఘటనలు జరుగుతుండగా.. ముఖ్యమంత్రి విదేశీ పర్యటనలకు వెళ్లడం ఏంటని లక్ష్మీ నారాయణ నిలదీశారు.
ఇలాంటి ఉద్రిక్తతల సమయంలో ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రంలో ఉండాలని.. అన్నారు. శాంతి భద్రతలను కాపాడాల్సిన ముఖ్యమంత్రి విదేశీ పర్యటనకు వెళ్లడం సరికాదని అన్నారు. మంత్రి వర్గంలోని మంత్రులు కూడా ఎక్కడా కనిపించడం లేదని లక్ష్మీ నారాయణ మండిపడ్డారు. ఏపీలో పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత కూడా ఇరు వర్గాలు ఒకరిపై మరొకరు దాడులు చేసుకుంటున్నారని అన్నారు. పగలు, ఫ్యాక్షన్ లు, ప్రతీకారాలతో రాజకీయ పార్టీలు.. పగ తీర్చుకోవడం సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయం అని లక్ష్మీ నారాయణ అన్నారు.
పోలింగ్ రోజున 144 సెక్షన్ అయితే అమల్లో ఉందని.. కానీ ఎక్కడా అమలు కాలేదని లక్ష్మీ నారాయణ అన్నారు. రోడ్ల మీద రాడ్లు పట్టుకొని దండయాత్రలు చేయడాన్ని ప్రజలు అందరూ టీవీల్లో లైవ్ ద్వారా చూశారని గుర్తు చేశారు. ఆయా పార్టీల నేతలు దాడులను నియంత్రించలేక పోయాయని జేడీ లక్ష్మీనారాయణ విమర్శించారు. దాడులకు పాల్పడిన వారిని పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయలేదని లక్ష్మీ నారాయణ ప్రశ్నించారు.
ఈ ఎన్నికలు డబ్బులే ప్రధానంగా జరిగాయని లక్ష్మీ నారాయణ అన్నారు. డబ్బులను విచ్చలవిడిగా ఖర్చు పెట్టిన రాజకీయ పార్టీలు.. చట్టాన్ని ఎవరూ తమ చేతుల్లోకి తీసుకోవాలని యత్నించాయని విమర్శించారు. వారు అలా చేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జూన్ 4వ తేదీన ఎన్నికల కౌంటింగ్ ఉన్నందున.. ఆ రోజు కూడా తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. అల్లర్ల ఘటనలపై సిట్ కూడా త్వరగా విచారణ జరిపి ఎలక్షన్ కమిషన్‌కు నివేదిక ఇవ్వాలని... బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని జేడీ లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు.