Anakapalli TDP News: అనకాపల్లి టీడీపీలో రేగిన రగడ! ఆయనకు టికెట్ కేటాయించాలంటూ కేడర్ ఆందోళన
Janasena News: అనకాపల్లి అసెంబ్లీ స్థానాన్ని మాజీ మంత్రి కొణతాల(జనసేన)కు కేటాయించడాన్ని నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
Janasena Anounces Anakapalli Candidate: తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి అభ్యర్థుల తొలి జాబితా ప్రకటన ఇరు పార్టీ శ్రేణులను ఆందోళనకు గురి చేసంది. అనేక చోట్ల కేడర్ తీవ్ర అసంతృప్తికి గురై ఆవేదనను వ్యక్తం చేస్తుండగా, కొన్ని చోట్ల కేడర్ బయటకు వచ్చి నిరసనను తెలియజేస్తున్నాయి. అనకాపల్లి జిల్లాలోని అనకాపల్లి అసెంబ్లీ స్థానాన్ని మాజీ మంత్రి కొణతాల(జనసేన)కు కేటాయించడాన్ని నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అనకాపల్లిలోని పీలా గోవింద సత్యనారాయణ నివాసం, కార్యాలయం వద్దకు చేరుకున్న కార్యకర్తలు ఆవేదనను వ్యక్తం చేశారు. పలువురు కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన బ్రోచర్లను చింపి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పీలాకే సీటు కేటాయించాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా పలువురు కార్యకర్తలు కార్యాలయం ముందు నిరసన తెలిపారు. అనకాపల్లి సీటు విషయంలో పునరాలోచించుకోవాలని ఈ సందర్భంగా కేడర్ అధిష్టానాన్ని డిమాండ్ చేసింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు పార్టీ కార్యాలయంలోనే నాయకులు సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. అధిష్టానంతో మాట్లాడి చెబుతానని కార్యకర్తలతో ఫోన్‌లో మాట్లాడిన మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు హామీ ఇచ్చినట్టు చెబుతున్నారు.
పీలా గోవింద్ అడుగులు ఎటు..?
గతంలో ఎమ్మెల్యేగా పని చేసిన పీలా గోవింద్ సత్యనారాయణ ఇక్కడ పార్టీకి ముందు నుంచి అండగా ఉంటున్నారు. రానున్న ఎన్నికల్లో పోటీ చేసే ఉద్ధేశంతో గత ఎన్నికల్లో ఓటమి తరువాత నుంచి ప్రజల్లో ఉంటూ యాక్టివ్‌గా పని చేస్తున్నారు. పార్టీ కార్యక్రమాలను జోరుగా ప్రజల్లోకి తీసుకెళుతున్నారు. తనకే టికెట్ వస్తుందన్న ఆశాభావంతో ఉన్న ఆయనకు తొలి జాబితాలో టికెట్ లేకపోవడంతో కేడర్‌తోపాటు ఆయన షాక్‌కు గురయ్యారు. జాబితాలో చోటు లేకపోవడం అటుంచితే.. తన సీటును మరొకరికి కేటాయించడంతో ఆయన అభిమానులు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. పార్టీ కార్యాలయం వద్దకు చేరుకున్న పలువురు కార్యకర్తలు మాట్లాడుతూ.. పీలా గోవింద్ ఇండిపెండెంట్‌గా పోటీ చేసి సత్తా ఏమిటో చూపిస్తాడని స్పష్టం చేశారు.
తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం ఈ సీటు విషయంలో పునరాలోచన చేయకపోతే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని కార్యకర్తలు హెచ్చరించారు. కేడర్ ఆందోళనలు నేపథ్యంలో పీలా గోవింద్ సత్యనారాయణ అడుగులు ఎలా ఉంటాయన్న దానిపై ఆసక్తి నెలకొంది. ముందు నుంచీ తెలుగుదేశం పార్టీ వాదిగా ముద్రపడిన గోవింద్.. పార్టీ నుంచి బయటకు వెళతారా.? పార్టీ నిర్ణయానికి కట్టుబడి పని చేస్తారా..? అన్నది తెలియాల్సి ఉంది.